కష్టం అనుకుంటే సమస్యే..!!
13-19 కేరెంటింగ్
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
సుధీర్ కిందటేడాది పదవ తరగతి చదివేవాడు. పరీక్షలు రాయకపోవడం వల్ల పై క్లాస్‌కు వెళ్లలేకపోయాడు. సుధీర్ మరీ టాపర్ కాదు, అలాగని మరీ బొత్తిగా చదవనివాడూ కాదు. మార్కులు కూడా మధ్యస్థంగా వచ్చేవి. టెన్త్ పరీక్షలు నెల రోజులు ఉన్నాయనగా ఇంట్లో ఒత్తిడి మొదలైంది. స్కూల్లో రివిజన్ల మీద రివిజన్లు ఎలాగూ ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి కోసం టీవీ చూసినా, స్నేహితులతో మాట్లాడినా పేరెంట్స్ తిట్టేవారు. పరీక్షలు రేపట్నించి మొదలు అనగా సుధీర్ కనిపించకుండా పోయాడు. ఎక్కడెక్కడో వెతికారు ఇంట్లో వాళ్లు. రెండు-మూడు నెలలకు కాని అతని జాడ తెలియలేదు. కనిపించకుండా పోయిన కొడుకు దొరికినందుకు సంతోషించినా పరీక్షలు రాయక ఓ ఏడాది నష్టపోయిన విధం అటు తల్లిదండ్రులను, ఇటు సుధీర్‌ను బాధిస్తూనే ఉన్నాయి.
ప్రణతికి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది. చదువుతూ చదువుతూ ఎటో చూస్తూ కూర్చుంటుంది. తల్లి గద్దిస్తే మళ్లీ చూపు పుస్తకంపై పెడుతుంది. అది కూడా కాసేపే! సరిగ్గా తిండి తినడం లేదు. అదేమని అడిగితే ఆకలి లేదంటుంది. పరీక్షల సమయంలో డిస్టర్బెన్స్‌గా ఉంటుందని ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేశారు. కొన్నాళ్ల పాటు ఫోన్, కంప్యూటర్ ఉపయోగించడానికి వీల్లేదని తండ్రి గట్టిగా హెచ్చరించాడు. పరీక్షల సమయానికి ప్రణతికి విపరీతమైన జ్వరం.. కాసేపు కూడా కూర్చోని చదివే స్థితి లేదు.
పరీక్షలంటే కబళించడానికి వస్తున్న మహమ్మారిలా పిల్లలు భయపడుతుంటారు. కాదు కాదు వారిని పెద్దలే భయపెడుతుంటారు. అందుకే పిల్లలు పరీక్షల నుంచి పారిపోవడానికి వెనకాడరు. ఆందోళనతో అనారోగ్యం పాల్పడుతుంటారు. ఏడాదికోసారి వచ్చే పండుగల్లాంటివే ఈ పరీక్షలనీ, ఇవి కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలని పెద్దలే పిల్లలకు వివరించాలి.
హెచ్చరికలు వద్దు...
నూటికి నూరు శాతం తల్లిదండ్రులు చేసే తప్పిదాలలో ప్రధానమైనవి ‘పరీక్షలు దగ్గర పడ్డాయి జాగ్రత్త’, ‘బాగా రాయకపోతే అంతే’, ‘ఎలాగైనా ర్యాంకు వచ్చి తీరాలి’, ‘చదువుకి అయిన ఖర్చులు, పాసవకపోతే ఎంత నష్టమో’ తెలిపే వివరాలు ఏకరవు పెడుతుంటారు. అలాగే తెలిసినవారి పిల్లలు గతంలో సాధించిన విజయాలు, వారి కన్నా మెరుగైన ఫలితాలు రావాలనే మాటలు పిల్లల్లో అనుకోని భయాలను తెచ్చిపెడతాయి. ఇవన్నీ పిల్లల మెదళ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి దాంతో పరీక్షలంటేనే భయమేసి, దీంతో ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనుకోకుండా తప్పించుకోవాలి అని చూస్తారు. ఫలితంగా పరీక్షల సమయానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, అనారోగ్యంతో పరీక్షలు రాయలేకపోవడం జరుగుతుంటుంది.
శూన్యంలో చూపులా!
పరీక్షల గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి పిల్లలు శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ఉండిపోతారు. అది ‘పరీక్షలు బాగా రాయలేమేమో, మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతామేమో..’ అనే నెగిటివ్ థింకింగ్ కావచ్చు. టెన్షన్ వల్ల తిండి మీద ధ్యాస ఉండదు. ఆహారం ప్రభావం చదువు మీద చూపుతుంది. తినకపోతే నీరసం వల్ల చదవాలనిపించదు. ఎక్కువ తిన్నా అదే పరిస్థితి. అందుకని ఉదయం అల్పాహారం, పాలు, పళ్లరసం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. రోజంతా పుస్తకాలు ముందేసుకొని కూర్చోమని కాకుండా పక్కన కూర్చుని సరదాగా మాట్లాడాలి. పరీక్షల ఫలితాల గురించి బెంగ అవసరం లేదని చెప్పాలి.
నటించినా మేలే!
పరీక్షలని పిల్లలు ఎలాగూ సీరియస్‌గా ఉంటారు. వారిని ఇంకా సీరియస్‌లో ఉంచకుండా మీకు నవ్వు రాకపోయినా సరే నవ్వు మొఖంతో నటించండి. మీ నవ్వు మొఖం చూస్తే పిల్లలకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. రోజూ రాత్రి పూట కాసేపు కబుర్లు చెప్పి, తర్వాత పడుకోమని చెప్పండి. చదివేదేదో తెల్లవారుజామున లేపి చదివించండి. ఆ టైమ్‌లో పరీక్షలో ఏమొస్తాయో చెప్పమని ప్రశ్నలు వేయడం మంచిది కాదు. పిల్లలు ఏవైనా అడిగిన సందేహాలకే సమాధానాలు ఇవ్వండి. రోజంతా చదవాల్సిన అవసరం లేదు. రెండేసి గంటల చొప్పున మూడు, నాలుగుసార్లు విభజించుకొని చదివితే మెదడు కూడా చదివినది జ్ఞాపకం ఉంచడానికి సహకరిస్తుంది.
5సిలకు దూరం దూరం...
పరీక్షల సమయంలో మనసుని దారి తప్పించే సెల్‌ఫోన్, కేబుల్ టీవీ, క్రికెట్, సినిమా, చాటింగ్.. లు ప్రధానమైనవి. వీటిని నిర్దాక్షిణ్యంగా ‘కట్’ చేస్తున్నామని చెప్పకుండా వాటి వల్ల కలిగే నష్టం, పరీక్షల తర్వాత తిరిగి ఇచ్చే సదుపాయాల గురించి తెలియజేయండి. పూర్తిగా తీసివేయడం కాకుండా, సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం మేలు అని సూచించండి. చదువుతున్న రూమ్‌లో గోడల మీద పోస్టర్లు, క్యాలెండర్లు ఏవీ లేకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే సినీనటులు, క్రికెటర్ల క్యాలెండర్లు, బొమ్మలు చూడగానే మైండ్ చదువు నుంచి డైవర్ట్ అవుతుంది.
చదువులో అద్భుతాలు...
చదవాలి. ప్రశ్నలు వేసుకోవాలి. మళ్లీ చదవాలి. మనసులో వల్లెవేసుకోవాలి. మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి. చదివిన దాన్ని పేపరు మీద రాయాలి. ఇలా చేస్తే ఎవరైనా చదువులో అద్భుతాలు చేయవచ్చు. ఈ సూచన హెచ్చరికగా కాకుండా క్రమంగా అలవాటు పడేలా చేయాలి. ఈ కాలం విద్యార్థుల నోట వినిపించే సాధారణ మాట ‘చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా ర్యాంకు రావడం లేదు’ అని. నిజం చెప్పాలంటే ‘కష్టం’ అనే మాట అనుకోగానే అదొక సమస్య అనే సజేషన్ సబ్‌కాన్షస్‌మైండ్‌కి చేరుతుంది. దాంతో సమాచార రవాణాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. అందుకే కష్టపడుతున్నాను అనకూడదు. ఇష్టపడి చదువుతున్నామనుకుంటే అంతా సుఖమే. అదే టీవీ చూడ్డం, క్రికెట్, ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలు.. ఇవన్నీ ఇష్టపడి చేస్తున్న పనులు అవడం వల్ల సమాచార రవాణాలో అంతరాయం లేదు. అనుకున్న టైమ్‌కి అవి వెంటనే గుర్తుకు వస్తాయి. అందుకే కష్టపడి చదవద్దు-ఇష్టపడి చదవమని చెప్పాలి.
టీచర్ పాత్ర ఇంట్లో వద్దు...
పరీక్షల సమయంలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. ‘చదువు, చదువు’ అంటూ టీచర్‌లా పదే పదే అంటూ ఉంటే పిల్లలకు విసుగు పుట్టవచ్చు. అందుకని టీచర్ పాత్ర పోషించనని ప్రతి తల్లి తనకు తానే ఒట్టుపెట్టుకోవాలి. (ఇది బాగా చదువుకుంటున్నవారి విషయంలో మాత్రమే).
చివరగా... రాయబోయే పరీక్షలోని ప్రశ్నలన్నీ తాము చదివిన పుస్తకాల్లోనే ఉంటాయనే సత్యం ప్రతి ఒక్క విద్యార్థి గ్రహిస్తే చాలు. ఆందోళన లేకుండా ఆనందంగా పరీక్షలను పూర్తిచేస్తారు.
- డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్,
ప్రశాంతి కౌన్సెలింగ్ - హెచ్.ఆర్.డి సెంటర్, హైదరాబాద్