Negative Thinking
-
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
మంచి మాట: మీ చిత్తం ఎలాంటిది?
కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు. ఈ రెండింటికి మూలం చిత్తం. జ్ఞానాన్ని భద్రపరిచే స్థానాన్నే చిత్తం అంటారు. చిత్తంలో ఉన్న చెడు ఆలోచనలు మంచి ఆలోచనలుగా మారాలి. అప్పుడే మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. కర్మ చే యించేది మనస్సు, మనస్సుని నియంత్రించేది బుద్ధి. అహంకారం అంటే ప్రకృతి సిద్ధమైన... తన చుట్టూ వున్న పరిస్థితులను తనకు అనుకూలంగా సృష్టించుకోవాలనుకోవటమే. దీనినే మన పెద్దలు ఏమైంది ఇతనికి నిన్నటివరకు బాగానే ఉన్నాడు కదా, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారాడు అనీ లేదా ఇంతలోనే ఇతనిలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది అనే వారు. దీనికి కారణం చిత్తం నుండి కర్మ ఆ సమయానికి ఆలా పనిచేయడమే. జీవికి వచ్చిపోయే జబ్బులు కూడా కొన్ని చిత్తానికి సంబంధించినవే, మనసు అనియంత్రిత అవయవాలను నియంత్రిస్తుంది. ఇది కలుషితమైతే దీనికి సంబంధించిన గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు మొదలైన అవయవాల పై ప్రభావం ఉంటుంది. నియంత్రించే వ్యవస్థ మొత్తం మెదడులో ఉంటుంది. మెదడులో ఏ అవయవానికి సంబంధించిన వ్యవస్థ చెడితే ఆ అవయవం పనిచేయదు. మెదడులో వున్న ఈ వ్యవస్థ సరికావాలంటే మనస్సులో ప్రక్షాళన జరగాలి. అందుకే ఈ మధ్యన వైద్యులు ప్రతి జబ్బుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి లేదా ధ్యానం చెయ్యండి అని విరివిగా చెబుతున్నారు. మరి అవయవాలకు వచ్చే జబ్బుకు మనస్సుకు సంబంధించిన ధ్యానాలు ఎందుకు అంటే అన్నిటికి మూలం మనసే కనుక. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంత వరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ. మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. శ్వాసప్రక్రియలోక్రమబద్ధత ఉండదు. మనసును శాంత పరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగే వారే యోగి. మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మన ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి. ఎదుటి వారి విజయానికి అసూయ చెందకుండా, అపజయాన్ని హేళన చేయకుండా ఉండాలి. విజయం, అపజయం, ఒకటి ఒకరు పొందితే. ఇంకొకరు కోల్పోతున్నారు, ఇంకొకరు కోల్పోతే, అది ఇంకెవరికో దక్కుతుంది. సుఖం, దుఃఖం. డబ్బు, ఆస్తి, అంతస్తులు అన్నీ నేడు నాది నాది అనుకున్నవి నిన్న వేరొకరివి, రేపు ఇంకెవరివో. అంటే ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాది, నాకు అనే సుడిగుండాలలో ఇరుక్కొని మనసు పాడుచేసుకోవడమే సకల జబ్బులకు మూలం. ఈ సూత్రం అర్థం చేసుకొంటేనే ప్రశాంతత. ఏ ఇద్దరి మనస్సు, జీవన విధానం ఒకలాగే ఉండదు. కాని అందుకు విరుద్ధంగా తనకు అనుకూలంగా ఉండాలనుకోవడమే అహంకారం. ఈ అహంకారాన్ని మార్చుకొంటే చిత్తంలో వున్న చెడు కర్మలు అన్నీ మంచి కర్మలుగా మారి మనిషి జీవన విధానం మొత్తం మారిపోతుంది. అందుకే వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించిన వాడికన్నా తన మనసును జయించిన వాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు. మనస్సు అంటే సంకల్ప, వికల్పాల కలయిక నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అందులో వేరే ఏమి కలిపినా నీరు కలుషితం అవుతుంది. ప్రతిబింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు ఆలోచనలు తరిమేయడానికి మంచి ఆలోచనలు చేయాలి. క్రమంగా మంచి ఆలోచనలూ తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మలం అవుతుంది. –భువనగిరి కిషన్ యోగి -
Negative Thoughts: గత అనుభవాలు, నెగెటివ్ ఆలోచనలు వెంటాడుతున్నాయా?
గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన కోరిక, తపన మనకు ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, అసలు ఆలోచించక పోవడం రెండూ తప్పే. భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అనే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. చదవండి: కాలేయాన్ని కాపాడుకోవాలంటే...ఏం చేయాలి? ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం లేదో ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మన మీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ► చివరగా ఒక మాట.. నెగెటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముట్టకూడదంటే ముందు మనల్ని మనం అన్ కండిషనల్‌గా ప్రేమించుకోవాలి. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
నేను అందంగా లేను
టొరంటో: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే యువతులు ఇతర స్నేహితులతో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలు, సోషల్‌మీడియాలో వేరే యువతులు పెట్టిన ఫొటోలతో పోల్చుకుని తమ శరీర సౌష్ఠవం గురించి బాధ పడతారని అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన ఫ్రొసెసర్ జెన్నిఫర్ మిల్స్ తెలిపారు. కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు మాత్రం అలా బాధ పడరని పేర్కొంది. సోషల్‌మీడియాలో ఫొటోలను పోస్ట్‌చేసే యువతులు తన ఫొటోలకు మంచి స్పందన రావాలని కోరుకుంటారని మిల్స్ పేర్కొన్నారు. సోషల్‌మీడియా వాడే 18–20 ఏళ్ల వారి పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని, ఇతరులతో పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మిల్స్ తెలిపారు. -
మీరు తీసుకున్న సెల్ఫీయే నచ్చుతోందా ?
టొరెంటో: డియర్ సెల్ఫీ టేకర్స్.. ఇక పై సెల్ఫీలు తీసుకునేముందు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేవాళ్లు తాము చాలా అందంగా కనిపిస్తున్నామనే భ్రమలో పడతారని యూనివర్సిటీ ఆఫ్ టొరెంటో పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 198 మంది కాలేజీ విద్యార్ధుల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. ఒక్కొక్కరిని తమంట తాము సెల్ఫీ తీసుకోవడం తర్వాత వేరే వ్యక్తితో ఫోటో తీయించి వీటిలో ఏ ఫోటో బాగుందో చెప్పమని అడిగామని 198లో 178 మంది తాము సొంతగా తీసుకున్న ఫోటోనే ఇష్టపడినట్లు వివరించారు. వీరందరూ తమ అందాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని గుర్తించినట్లు తెలిపారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్లు తొందరపడి తప్పిదాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. -
కష్టం అనుకుంటే సమస్యే..!!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... సుధీర్ కిందటేడాది పదవ తరగతి చదివేవాడు. పరీక్షలు రాయకపోవడం వల్ల పై క్లాస్‌కు వెళ్లలేకపోయాడు. సుధీర్ మరీ టాపర్ కాదు, అలాగని మరీ బొత్తిగా చదవనివాడూ కాదు. మార్కులు కూడా మధ్యస్థంగా వచ్చేవి. టెన్త్ పరీక్షలు నెల రోజులు ఉన్నాయనగా ఇంట్లో ఒత్తిడి మొదలైంది. స్కూల్లో రివిజన్ల మీద రివిజన్లు ఎలాగూ ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి కోసం టీవీ చూసినా, స్నేహితులతో మాట్లాడినా పేరెంట్స్ తిట్టేవారు. పరీక్షలు రేపట్నించి మొదలు అనగా సుధీర్ కనిపించకుండా పోయాడు. ఎక్కడెక్కడో వెతికారు ఇంట్లో వాళ్లు. రెండు-మూడు నెలలకు కాని అతని జాడ తెలియలేదు. కనిపించకుండా పోయిన కొడుకు దొరికినందుకు సంతోషించినా పరీక్షలు రాయక ఓ ఏడాది నష్టపోయిన విధం అటు తల్లిదండ్రులను, ఇటు సుధీర్‌ను బాధిస్తూనే ఉన్నాయి. ప్రణతికి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది. చదువుతూ చదువుతూ ఎటో చూస్తూ కూర్చుంటుంది. తల్లి గద్దిస్తే మళ్లీ చూపు పుస్తకంపై పెడుతుంది. అది కూడా కాసేపే! సరిగ్గా తిండి తినడం లేదు. అదేమని అడిగితే ఆకలి లేదంటుంది. పరీక్షల సమయంలో డిస్టర్బెన్స్‌గా ఉంటుందని ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేశారు. కొన్నాళ్ల పాటు ఫోన్, కంప్యూటర్ ఉపయోగించడానికి వీల్లేదని తండ్రి గట్టిగా హెచ్చరించాడు. పరీక్షల సమయానికి ప్రణతికి విపరీతమైన జ్వరం.. కాసేపు కూడా కూర్చోని చదివే స్థితి లేదు. పరీక్షలంటే కబళించడానికి వస్తున్న మహమ్మారిలా పిల్లలు భయపడుతుంటారు. కాదు కాదు వారిని పెద్దలే భయపెడుతుంటారు. అందుకే పిల్లలు పరీక్షల నుంచి పారిపోవడానికి వెనకాడరు. ఆందోళనతో అనారోగ్యం పాల్పడుతుంటారు. ఏడాదికోసారి వచ్చే పండుగల్లాంటివే ఈ పరీక్షలనీ, ఇవి కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలని పెద్దలే పిల్లలకు వివరించాలి. హెచ్చరికలు వద్దు... నూటికి నూరు శాతం తల్లిదండ్రులు చేసే తప్పిదాలలో ప్రధానమైనవి ‘పరీక్షలు దగ్గర పడ్డాయి జాగ్రత్త’, ‘బాగా రాయకపోతే అంతే’, ‘ఎలాగైనా ర్యాంకు వచ్చి తీరాలి’, ‘చదువుకి అయిన ఖర్చులు, పాసవకపోతే ఎంత నష్టమో’ తెలిపే వివరాలు ఏకరవు పెడుతుంటారు. అలాగే తెలిసినవారి పిల్లలు గతంలో సాధించిన విజయాలు, వారి కన్నా మెరుగైన ఫలితాలు రావాలనే మాటలు పిల్లల్లో అనుకోని భయాలను తెచ్చిపెడతాయి. ఇవన్నీ పిల్లల మెదళ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి దాంతో పరీక్షలంటేనే భయమేసి, దీంతో ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనుకోకుండా తప్పించుకోవాలి అని చూస్తారు. ఫలితంగా పరీక్షల సమయానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, అనారోగ్యంతో పరీక్షలు రాయలేకపోవడం జరుగుతుంటుంది. శూన్యంలో చూపులా! పరీక్షల గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి పిల్లలు శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ఉండిపోతారు. అది ‘పరీక్షలు బాగా రాయలేమేమో, మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతామేమో..’ అనే నెగిటివ్ థింకింగ్ కావచ్చు. టెన్షన్ వల్ల తిండి మీద ధ్యాస ఉండదు. ఆహారం ప్రభావం చదువు మీద చూపుతుంది. తినకపోతే నీరసం వల్ల చదవాలనిపించదు. ఎక్కువ తిన్నా అదే పరిస్థితి. అందుకని ఉదయం అల్పాహారం, పాలు, పళ్లరసం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. రోజంతా పుస్తకాలు ముందేసుకొని కూర్చోమని కాకుండా పక్కన కూర్చుని సరదాగా మాట్లాడాలి. పరీక్షల ఫలితాల గురించి బెంగ అవసరం లేదని చెప్పాలి. నటించినా మేలే! పరీక్షలని పిల్లలు ఎలాగూ సీరియస్‌గా ఉంటారు. వారిని ఇంకా సీరియస్‌లో ఉంచకుండా మీకు నవ్వు రాకపోయినా సరే నవ్వు మొఖంతో నటించండి. మీ నవ్వు మొఖం చూస్తే పిల్లలకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. రోజూ రాత్రి పూట కాసేపు కబుర్లు చెప్పి, తర్వాత పడుకోమని చెప్పండి. చదివేదేదో తెల్లవారుజామున లేపి చదివించండి. ఆ టైమ్‌లో పరీక్షలో ఏమొస్తాయో చెప్పమని ప్రశ్నలు వేయడం మంచిది కాదు. పిల్లలు ఏవైనా అడిగిన సందేహాలకే సమాధానాలు ఇవ్వండి. రోజంతా చదవాల్సిన అవసరం లేదు. రెండేసి గంటల చొప్పున మూడు, నాలుగుసార్లు విభజించుకొని చదివితే మెదడు కూడా చదివినది జ్ఞాపకం ఉంచడానికి సహకరిస్తుంది. 5సిలకు దూరం దూరం... పరీక్షల సమయంలో మనసుని దారి తప్పించే సెల్‌ఫోన్, కేబుల్ టీవీ, క్రికెట్, సినిమా, చాటింగ్.. లు ప్రధానమైనవి. వీటిని నిర్దాక్షిణ్యంగా ‘కట్’ చేస్తున్నామని చెప్పకుండా వాటి వల్ల కలిగే నష్టం, పరీక్షల తర్వాత తిరిగి ఇచ్చే సదుపాయాల గురించి తెలియజేయండి. పూర్తిగా తీసివేయడం కాకుండా, సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం మేలు అని సూచించండి. చదువుతున్న రూమ్‌లో గోడల మీద పోస్టర్లు, క్యాలెండర్లు ఏవీ లేకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే సినీనటులు, క్రికెటర్ల క్యాలెండర్లు, బొమ్మలు చూడగానే మైండ్ చదువు నుంచి డైవర్ట్ అవుతుంది. చదువులో అద్భుతాలు... చదవాలి. ప్రశ్నలు వేసుకోవాలి. మళ్లీ చదవాలి. మనసులో వల్లెవేసుకోవాలి. మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి. చదివిన దాన్ని పేపరు మీద రాయాలి. ఇలా చేస్తే ఎవరైనా చదువులో అద్భుతాలు చేయవచ్చు. ఈ సూచన హెచ్చరికగా కాకుండా క్రమంగా అలవాటు పడేలా చేయాలి. ఈ కాలం విద్యార్థుల నోట వినిపించే సాధారణ మాట ‘చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా ర్యాంకు రావడం లేదు’ అని. నిజం చెప్పాలంటే ‘కష్టం’ అనే మాట అనుకోగానే అదొక సమస్య అనే సజేషన్ సబ్కాన్షస్మైండ్కి చేరుతుంది. దాంతో సమాచార రవాణాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. అందుకే కష్టపడుతున్నాను అనకూడదు. ఇష్టపడి చదువుతున్నామనుకుంటే అంతా సుఖమే. అదే టీవీ చూడ్డం, క్రికెట్, ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలు.. ఇవన్నీ ఇష్టపడి చేస్తున్న పనులు అవడం వల్ల సమాచార రవాణాలో అంతరాయం లేదు. అనుకున్న టైమ్‌కి అవి వెంటనే గుర్తుకు వస్తాయి. అందుకే కష్టపడి చదవద్దు-ఇష్టపడి చదవమని చెప్పాలి. టీచర్ పాత్ర ఇంట్లో వద్దు... పరీక్షల సమయంలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. ‘చదువు, చదువు’ అంటూ టీచర్లా పదే పదే అంటూ ఉంటే పిల్లలకు విసుగు పుట్టవచ్చు. అందుకని టీచర్ పాత్ర పోషించనని ప్రతి తల్లి తనకు తానే ఒట్టుపెట్టుకోవాలి. (ఇది బాగా చదువుకుంటున్నవారి విషయంలో మాత్రమే). చివరగా... రాయబోయే పరీక్షలోని ప్రశ్నలన్నీ తాము చదివిన పుస్తకాల్లోనే ఉంటాయనే సత్యం ప్రతి ఒక్క విద్యార్థి గ్రహిస్తే చాలు. ఆందోళన లేకుండా ఆనందంగా పరీక్షలను పూర్తిచేస్తారు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, ప్రశాంతి కౌన్సెలింగ్ - హెచ్.ఆర్.డి సెంటర్, హైదరాబాద్