దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఫెయిల్ కావడంతో ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ పదేళ్ల బాలుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటంలో తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆ బాలునికి మద్దతుగా నిలిచారు.
ఈ కేసు అలకనందలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. 2023-24 సంవత్సరంలో 10 ఏళ్ల బాలుడు ఐదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే సదరు పాఠశాల యాజమాన్యం ఆ బాలుడు ఫెయిలయ్యాడనే విషయాన్ని తెలియజేయకుండా 15 రోజుల వ్యవధిలో తిరిగి అతనికి మరోమారు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ బాలుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ బాలుడిని ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది విద్యా చట్టంలోని సెక్షన్ 16(3)ని ఉల్లంఘించడమేనని ఆ బాలుడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఆ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఆ బాలునికి సిక్స్త్‌లో అడ్మిషన్ కల్పించకపోతే అతని చదువు దెబ్బతింటుందని పేర్కొంది. ఆరో తరగతిలో ఆ బాలుడిని కూర్చోవడానికి పాఠశాల అనుమతిస్తే, అది పాఠశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సదరు ప్రైవేట్ స్కూల్‌తో పాటు విద్యా డైరెక్టరేట్‌ను ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ జూలై 4న జరగనుంది. తన ఫెయిల్యూర్ గురించి స్కూల్ తనకు తెలియజేయలేదని కోర్టులో పిటిషన్ వేసిన బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం రెండు నెలల తరువాత ఆ విద్యార్థికి తిరిగి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment