యథా పేరెంట్స్... తథా కిడ్స్
కేరెంటింగ్
పిల్లల మనసు అద్దంలాంటిది. పెద్దవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడం పరిపాటి. అయితే చాలామంది తలిదండ్రులు దీనిని గ్రహించరు. పిల్లల ముందే నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతారు. ఇరుగూ పొరుగూ గురించి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు. వారి తలిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. పనివారిని, తక్కువ స్థాయి వారిని చులకనగా చూస్తారు. రోడ్డు మీదనో, ఆటోల్లోనో, బస్సుల్లోనో నగలు, నగదు, సెల్‌ఫోన్లు వంటివి దొరికితే ఇంటికి పట్టుకొచ్చి గొప్పగా చూపించుకుంటారు. అవతలి వారిని తక్కువ చేసి మాట్లాడతారు. ఆ వస్తువులూ, ఈ వస్తువులూ కొని డబ్బు దుబారా చేస్తారు.
టీవీల్లో చెత్త ప్రోగ్సామ్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తారు. బాస్‌లను నోటికొచ్చినట్లు తిట్టుకుంటారు. వడ్డించుకున్న పదార్థాలను పారవేస్తారు. ప్లేట్లూ, గ్లాసులూ విసిరికొడతారు. తమ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తారు. ఎవరి గురించీ ఒక్క మంచి మాట కూడా చెప్పడానికి, వినడానికీ ఇష్టపడరు. తాము ఇవన్నీ చేస్తూ, తమ పిల్లలు తమ మాట సరిగా వినట్లేదనీ, సరిగ్గా చదవట్లేదనీ అందరితో చెప్పుకుని వాపోతుంటారు. ‘నువ్వు ఏ విత్తు నాటితే ఆ చెట్టే మొలుస్తుంది’ అని బైబిల్‌లోనూ ఉంది, ఖొరాన్ అదే చెబుతుంది, గీతాకృష్ణుడూ అదే బోధించాడు. వేపవిత్తనం నాటి, దాని నుంచి మామిడి చెట్టు మొలిచి, పండ్లూ ఫలాలూ ఇవ్వట్లేదని బాధపడటం ఎంత అవివేకమో, మనం సరిగా ప్రవర్తించకుండా మన పిల్లలు చెడిపోతున్నారని బాధపడటం అంత కన్నా అహేతుకం.ముందు మనం సత్ప్రవర్తనతో మెలుగుదాం... అప్పుడు మన పిల్లలూ మన అడుగుజాడల్లో నడుస్తారు.