కార్టిలేజ్ రీప్లేస్‌మెంట్ ... మోకాలి నొప్పులకు పరిష్కారం | Cartilage replacement | Sakshi
Sakshi News home page

కార్టిలేజ్ రీప్లేస్‌మెంట్ ... మోకాలి నొప్పులకు పరిష్కారం

Published Wed, Jan 6 2016 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

Cartilage replacement

హోమియో కౌన్సెలింగ్
 

ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. నాకు కారణాలు చెప్పి, హోమియోలో చికిత్స సూచించండి.
 - ధనలక్ష్మి, కందుకూరు


మన శరీరంలోని కదలికూ కీళ్లే ప్రధాన కారణం. అవి వేళ్ల జాయింట్లు కావచ్చు. మణికట్టు కీళ్లు కావచ్చు. భుజం జాయింట్లు కావచ్చు. పాదాల, వేళ్ల కీళ్లు కావచ్చు ఈ కీళ్ల కదలికలో వచ్చే సమస్యలను ఆర్థరైటిస్ అంటారు ఇది కీళ్లలో సాధారణంగా వచ్చే. అతి పెద్ద సమస్య.

లక్షణాలు :  కీలు లోపల వాచిపోవడం  కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధ  కీలు కడుపుతున్నప్పుడు శబ్దం రావడం  జాయింట్లు ఎర్రగా మారడం  జాయింట్ల వద్ద తాకినప్పుడు వేడిగా ఉండడం  ఆకలి సరిగా లేకపోవడం  రక్తహీనత  నిద్ర లేకపోవడం.
 
కారణాలు :  శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉండటం  జాయింట్ దగ్గర దెబ్బలు తగలడం  వంశపారంపర్య కారణాలు  జాయింట్లు అరిగిపోవడం  శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌లో వచ్చే అసాధరణ లోపాలు  సరైన పోషకాహారం తీసుకోలేకపోవడం  మానసిక ఒత్తిడి.
 
ఆర్థరైటిస్‌లోని రకాలు: ఎ. ఆస్టియో ఆర్థరైటిస్:  కీలు అరిగిపోవడం వల్ల కీలు లోపలంతా వాచిపోయి కదపాలంటే నొప్పి, బాధ తీవ్రంగా ఉంటుంది  ఇది ఎక్కువగా వయస్సు మళ్లిన వారిలో కనిపిస్తుంది  జాయింట్‌కు ఏదైనా దెబ్బ తగలడం వల్ల కానీ, శరీర బరువు అధికంగా ఉండటం వల్ల కానీ వస్తుంది. బి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్: స్పష్టమైన కారణమేది తెలియకుండానే ఆరంభమయ్యే అతిపెద్ద సమస్య  ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్  కీళ్లు ఎర్రగా వాచిపోయి, ఉదయం లేస్తూనే జాయింట్లు కదపడానికి సహకరించవు. తీవ్రమైన నొప్పి ఉంటుంది  సాధారణంగా ఇది ఎక్కువగా చిన్న జాయింట్లకు వస్తుంది  అంతేకాకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, కళ్ల వంటి ఇతరత్రా అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. సి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్: శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ తలెత్తి అది కీళ్ల దగ్గరకు చేరడం వల్ల నొప్పులు వస్తాయి. దీనిని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. డి. సోరియాటిక్ ఆర్థరైటిస్: సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో పాటు, ఒక్కోసారి కీళ్లల్లో నొప్పులు, వాపులు రావడం జరుగుతుంది. ఇ. రియాక్టివ్ ఆర్థరైటిస్: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నీళ్ల విరేచనాల తరువాత వచ్చే కీళ్ల వాపును. రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఎఫ్. వైరల్ ఆర్థరైటిస్: చికెన్ గున్యా వంటి వైరల్ వ్యాధుల్లో కూడా కీళ్ల నొప్పులు, వాపులు రావచ్చు.

ఆర్థరైటిస్ నివారణ:  ప్రతిరోజూ వ్యాయామం చేయాలి  పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలి  పండ్లు తీసుకోవాలి  మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి  శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 
నాకు 30 ఏళ్లు. కొంతకాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాను. కూర్చున్నా లేచినా మెట్లు ఎక్కినా, దిగినా ఈ సమస్య ఉండేది. కానీ కొన్ని రోజులుగా నొప్పి అధికమవడంతో పాటు మోకాళ్లలో కాస్త వాపు కూడా వస్తోంది. మందులు, ఆయింట్‌మెంట్‌లు వాడినా పెద్దగా ఉపశమనం లభించడంలేదు. ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
 - సరోజ, హైదరాబాద్

 ఒకప్పుడు పెద్ద వయసున్నవారికే మోకాళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు మధ్య వయస్సు వాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, అధికబరువు, వ్యాయామం చేయకపోవడం లాంటి తదితర కారణాల వల్ల ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాధారణంగా ఆర్థరైటిస్ సమస్యలో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో కూర్చుని లేచినప్పుడు మోకాళ్లలో నొప్పులు రావడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు మోకాళ్ల నొప్పి బాధించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండవ దశలో ఇంట్లో పనులు చేసుకోనీయకుండా మోకాళ్ల నొప్పులు పీడించడం. మూడో దశ వచ్చేసరికి ఈ సమస్య మరికాస్త ముదిరి కాళ్లలో వాపు రావడం, నొప్పి ఎక్కువవుతుండడం లాంటి లక్షణాలు బయటపడుతుంటుంటాయి. నాలుగో దశలో ఇక పేషెంట్ నిల్చోవడానికి కూడా త్రీవ ఇబ్బందులు పడుతుంటాడు. కీలులోని రెండు ఎముకల మధ్య రాపిడి తగ్గించే కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు కీళ్లనొప్పులు మొదలవుతాయి. ఇక మీ సమస్య విషయానికొస్తే... మీరు మూడో దశలో ఉన్నట్టు అనిపిస్తోంది.

ఈ దశలో కాళ్ల కార్టిలేజ్‌లో ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని... చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కార్టిలేజ్ అరుగుదల కొద్దిగానే ఉంటే నొప్పి నివారణకు సంబంధించిన మందులతో పాటు ఇంట్లో చేసుకునే విధంగా కొన్ని రకాల వ్యాయామాలు కూడా డాక్టర్ సూచిస్తారు. అంతేకాకుండా కార్టిలేజ్ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్‌మెంట్ థెరపీ (ఎస్‌ఎఫ్‌ఆర్‌టీ) అనే ఇంజక్షన్ ఇస్తారు. కార్టిలేజ్ అరుగుదల బట్టి ఆరు నెలలకోసారి లేదా సంవత్సరానికి ఒకటి చొప్పున ఇలా రెండు సార్లు తీసుకుంటే మీ సమస్యను చాలావరకు అరికట్టవచ్చు. మీరు వెంటనే మంచి సీనియర్ ఆర్థోపెడిక్‌ని సంప్రదించండి. మీరు వెంటనే సీనియర్ ఆర్థోపెడిక్‌ని సంప్రదించండి. ఒకవేళ అరుగుదల మరీ ఎక్కువగా ఉండి సర్జరీ అవసరమని సలహా ఇస్తే మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కార్టిలేజ్ సర్జరీలో అత్యాదునిక ఆర్థోస్కోపీ విధానం అమల్లోకి వచ్చింది. కాబట్టి మీ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభిస్తుంది.
 
డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం
సీనియర్ ఆర్థోపెడిక్ అండ్
జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట
హైదరాబాద్
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 37 ఏళ్లు. నాకు చాలా చిన్న వయసులోనే గుండెజబ్బు వచ్చింది. గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉందని స్టెంట్ వేయాలని చెప్పారు. ఇటీవల శరీరంలో కలిసిపోయే స్టెంట్స్ అందుబాటులోకి వచ్చాయని విన్నాను.  వాటి గురించి వివరించండి?
 - సందీప్, భీమవరం

మీరు తెలుసుకున్న విధంగా శరీరంలో కలిసిపోయేలా కొన్ని స్టెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుండెజబ్బు వచ్చినవారిలో రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగించడం, మళ్లీ రక్తప్రసరణను యథావిధిగా  ఉండేలా చేయడంతో పాటు, ఇది రక్తనాళాల్లోని కణజాలం పనితీరును నార్మల్‌గా ఉంచుతుంది. అయితే  ఈ రకమైన  బయో అబ్జార్బబుల్ వాస్క్కులార్ స్కాఫోల్డ్ (బస్) చికిత్స చాలా కొద్ది ప్రదేశాల్లోనే లభ్యమవుతోంది. చిన్న వయసులో గుండెజబ్బు బారిన పడ్డ రోగులు ఇది మంచి చికిత్స. స్టెంట్ ఎలాంటిది వేయించినా మీరు మంచి ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ మళ్లీ జబ్బు తిరగబెట్టకుండా చూసుకోవడం అవసరం.
 
నా వయసు 54 ఏళ్లు. ఈమధ్య కాళ్ల మంటలు, ఆకలి ఎక్కువగా ఉండి త్వరగా నీరసపడిపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే మధుమేహం అని చెప్పారు. దీర్ఘకాలంగా మధుమేహం ఉంటే గుండెజబ్బులు, కిడ్నీజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని విన్నాను. డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బులు రావడానికి గల కారణాలు చెప్పండి.
 - నిహారిక రెడ్డి, వరంగల్

 డయాబెటిస్ వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు కలిగి, హార్ట్ ఎటాక్ గాని, ఏంజైనా గాని రావచ్చు. ఇదే కాకుండా రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల గుండె కండరంపై ప్రభావం పడి, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గి డయాబెటిక్ కార్డియోమయోపతి అనే గుండెజబ్బు రావచ్చు. అయితే షుగర్ వ్యాధిని మందులతో నియంత్రణలో ఉంచుకుని, ఆహార నియమాలు పాటిస్తూ షుగర్ మందులతో పాటు స్టాటిన్స్, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
 
డాక్టర్ శ్రీనివాసకుమార్
చీఫ్ కార్డియాలజిస్ట్,
సిటిజెన్స్ హాస్పిటల్స్,
శేరిలింగంపల్లి,
హైదరాబాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement