చర్మంపై తరచూ దద్దుర్లు... తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 21 ఏళ్లు. నాకు తరచూ చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి అవి తగ్గుతున్నాయి. అయితే ఎలాంటి హానీ లేకపోయినా... దద్దుర్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లు తగ్గినా... ఆ తర్వాత ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమవుతుందా?
– కె. ముని కృష్ణ, చిత్తూరు
అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది ఏ వయసు వారికైనా కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది. దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు. అవి...
అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది.
క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు.
కారణాలు: మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది.
అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు:
నొప్పి నివారణకు ఉపయోగించే మందులు
కీటకాలు, పరాన్నజీవులు
ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు
అధిక ఒత్తిడి, సూర్యకాంతి
మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు
అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు
జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు:
చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం
విపరీతమైన దురదగా అనిపించడం
దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం
కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు
గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు
దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు.
చికిత్స: హోమియో ప్రక్రియ ద్వారా కాన్‌స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాలను బలోపేతం చేయడం వల్ల అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్