ఒంటిపైన దద్దుర్లు.. కారణమేమిటి? | The rash of shit .. What? | Sakshi
Sakshi News home page

ఒంటిపైన దద్దుర్లు.. కారణమేమిటి?

Published Tue, Aug 2 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

ఒంటిపైన దద్దుర్లు.. కారణమేమిటి?

ఒంటిపైన దద్దుర్లు.. కారణమేమిటి?

హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 25 ఏళ్లు. నాకు కొంతకాలంగా అప్పుడప్పుడు చర్మం మీద ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయి. మర్నాటికి అవి తగ్గిపోతున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘అర్టికేరియా’ అన్నారు. మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. హోమియో చికిత్స ద్వారా సమస్య పూర్తిగా నయమయ్యేలా చేయవచ్చా? సలహా ఇవ్వగలరు. - ప్రసన్న లక్ష్మి, ఆదిలాబాద్
అర్టికేరియా చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపించవచ్చు. కొందరిలో ఈ సమస్య 24 గంటల్లో దానంతట అదే తగ్గుతుంది. కానీ మరికొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగుతూ తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది.  దీన్ని రెండురకాలుగా విభజించవచ్చు.  

 
అక్యూట్ అర్టికేరియా: సమస్య ఆరు వారాల కంటే తక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు. సమస్యను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు ఇది కలుగుతుంది.

 
క్రానిక్ అర్టికేరియా: ఆరువారాలకు పైబడి కొనసాగితే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు. ఇలా దీర్ఘకాలిక సమస్యగా మారడానికి కారణాలు ఇంకా స్పష్టంగా లభించలేదు. అయితే మన ఒంట్లో అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సమస్యలైన థైరాయిడ్, లూపస్ వంటి వాటి వల్ల ఆర్టికేరియా కనిపించవచ్చు.

 
కారణాలు

మన శరీరానికి సరిపడని పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిస్పందనగా మన ఒంట్లో హిస్టమైన్స్ అనే పదార్థంలో పాటు కొన్ని రకాల రసాయనాలు రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. వాటి ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఇదే సమస్య మన రోగ నిరోధక శక్తి మనపైనే దుష్ర్పభావం చూపినప్పుడు కూడా కనిపిస్తుంది.


అర్టికేరియాను ప్రేరేపించే అంశాలు
నొప్పి నివారణకు ఉపయోగించే మందులు  కీటకాలు, పరాన్నజీవులు  ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లు  అధిక ఒత్తిడి, సూర్యకాంతి  మద్యం, కొన్ని సరిపడని ఆహార పదార్థాలు  అధిక లేదా అల్ప ఉష్ణోగ్రతలు  జంతుకేశాలు, పుప్పొడి రేణువులు వంటి చాలా అంశాలు అర్టికేరియాను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు
చర్మంపై ఎరుపు లేదా డార్క్ కలర్‌లో దద్దుర్లు ఏర్పడటం  విపరీతమైన దురదగా అనిపించడం  దద్దుర్లలో మంట, నొప్పి కూడా అనిపించడం  కళ్లచుట్టూ, చెంపలు, చేతులు, పెదవులపై కూడా అవి ఏర్పడవచ్చు  గొంతులో వాపు ఏర్పడి అది వాయునాళాలకు అడ్డుగా పరిణమించి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు  దద్దుర్ల పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ వాటిని ప్రేరేపించే అంశాలకు గురైనప్పుడు కనిపిస్తూ... ఆ తర్వాత అదృశ్యమవుతూ ఉండవచ్చు.

 
చికిత్స

హోమియో ప్రక్రియ ద్వారా కాన్‌స్టిట్యూషన్ పద్ధతుల్లో అత్యంత సునిశితమైన పరిశీలనతో తగిన మందులు ఇవ్వవచ్చు. వాటి వల్ల రోగనిరోధక కణాల్లో  పునరుజ్జీవనం కలిగి అవి అర్టికేరియాను సమర్థంగా ఎదుర్కొంటాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్  హైదరాబాద్

 

అవాంఛిత రోమాలతో పాప ఇబ్బంది పడుతోంది!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

మా అమ్మాయికి పదిహేనేళ్లు. అన్ని విధాలా ఆరోగ్యంగానే ఉంది. కానీ ఈమధ్య ఒంటి మీద జుట్టు ఎక్కువగా పెరుగుతోంది. దాంతో అమ్మాయి ఆందోళన పడుతోంది. పైగా ఈ వయసులో మరీ ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటోంది. తగిన సలహా ఇవ్వండి.  - రేణుక, హైదరాబాద్
పిల్లల్లో వెంట్రుకలకు సంబంధించిన రుగ్మతలు (హెయిర్ డిజార్డర్స్) అన్నవి వెంట్రుకల్లోనే అంతర్గత పెరుగుదల వల్ల, జీవరసాయనాల్లో ఒడిదుడుకుల వల్ల, జీవక్రియల్లో (మెటబాలిక్) మార్పుల వల్ల, ఇన్ఫెక్షన్స్‌తో వచ్చే వ్యాధుల వల్ల వస్తుంటాయి.


వెంట్రుకలు అసాధారణంగా పెరగడాన్ని హైపర్ ట్రైకోసిస్ అంటారు. అలాగే ఆడవాళ్లలో పురుషుల మాదిరిగా వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్’ అంటారు. మీరు చెప్పిన లక్షణాలను చూస్తుంటే మీ పాపకు ఉన్న కండిషన్ ‘హిర్సుటిజమ్’ అని చెప్పవచ్చు. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో ముఖంతో పాటు, గడ్డం, వీపు, రొమ్ము మీద కూడా వెంట్రుకలు పెరుగుతుంటాయి. దాదాపు 10 శాతం మంది ఆడవాళ్లలో ఈ కండిషన్ కనిపిస్తుంటుంది. అదేమీ తీవ్రమైన జబ్బుకు సూచన కానప్పటికీ యుక్తవయసు (ప్యూటర్టీ)కు ముందుగా ఈ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దీనికి కారణాన్ని తెలుసుకోవాలి.

 
మామూలుగానైతే హిర్సుటిజమ్ లక్షణాలు కనిపించడాన్ని అంత సీరియస్ సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటు రుతు సంబంధమైన సమస్యలుగాని, డయాబెటిస్ లేదా స్థూలకాయం గాని, చాలా కొద్ది సమయంలోనే రోమాల పెరుగుదల విపరీతంగా జరుగుతుంటే కూడా దాన్ని కాస్త సీరియస్‌గా పరిగణించాలి.

 
హిర్సుటిజమ్ కనిపించేవారిలో ముఖం మీద మొటిమలు (యాక్నే) ఎక్కువగా కనిపించడం, గొంతు బరువుగా, లోతుగానూ, కండరాలు బలంగా మారడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. అలాంటప్పుడు అది వాళ్లలో హార్మోన్లకు సంబంధించిన సమస్యగా గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివారిలో ఇతర ఎండోక్రైన్ సమస్యలు.. అంటే థైరాయిడ్, ఒవేరియన్ గ్రంథుల సమస్య, ఎడ్రినల్ ట్యూమర్స్, పీసీఓఎస్ సమస్యలతో పాటు కొన్ని జన్యుపరమైన సమస్యలూ ఉన్నాయేమో చూడాలి. అయితే కొన్ని మందులు.. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల కూడా రోమాల పెరుగుదల ఎక్కువగా ఉండవచ్చు.


ఇక మీ అమ్మాయి విషయంలో ఈ సమస్య ఫలానా కారణంతో అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఇది యాండ్రోజెన్ ఎక్కువగా స్రవించడం వల్ల కావచ్చు. దీనికి చికిత్సగా కొన్ని మందులు వాడటంతో పాటు సింపుల్ డర్మటలాజికల్ ప్రొసిజర్స్ అవసరం కావచ్చు. అవి... షేవింగ్, వ్యాక్స్, కొన్ని క్రీములు, ఎలక్ట్రాలసిస్ లేజర్ వంటివి. ఈ ప్రక్రియల ద్వారా ఆ అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు ఒకసారి మీ పాపను గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌లకు చూపించడం అవసరం.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement