ఎగ్జిమా నయమవుతుంది! | sakshi health councling | Sakshi
Sakshi News home page

ఎగ్జిమా నయమవుతుంది!

Published Sun, Dec 18 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

sakshi    health councling

హోమియో కౌన్సెలింగ్‌

మా పాప వయసు నాలుగేళ్లు. తనకు తరచూ బుగ్గలపై చర్మం ఎర్రగా మారుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఎగ్జిమా అని చెప్పారు. మందులు వాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. శీతాకాలంలో సమస్య మరింత అధికమవుతోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పోతుందా? తగిన సలహా ఇవ్వగలరు.
– వెంకటేశ్, నల్లగొండ

చలికాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ. ఇందులోనూ అనేక రకాలు ఉన్నప్పటికీ అటోపిక్‌ డర్మటైటిస్‌ అనేది ప్రధానమైనది. ఎక్కువ మందిలో కనిపిస్తుంది.  అయితే చిన్నపిల్లల్లో మరింత ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

కారణాలు : ఎగ్జిమా కనిపించడానికి కచ్చితమైన కారణాలు తెలియదు. కానీ వంశపారంపర్యత, వాతావరణ మార్పులు వంటి అంశాలు దీనికి కొంతవరకు కారణం కావచ్చు. ఎగ్జిమాను ప్రేరేపించే అంశాలు ఎదురైనప్పుడు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ... సాధారణ స్థితికి మించి ఎక్కువగా ప్రతిక్రియను కనబరుస్తుంది. దాంతో ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తాయి.

ఎగ్జిమాను ప్రేరేపించే అంశాలు : పొడి చర్మం ఉన్నవారిలో ఎగ్జిమా ఎక్కువగా వస్తుంది. దుమ్ము, ధూళి, వాతావరణ మార్పులు, పూల మొక్కల నుంచి వచ్చే పుప్పొడి, జంతుకేశాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, డియోడరెంట్లు కొన్ని ఆహార పదార్థాలు (గుడ్లు, పాల ఉత్పత్తుల వంటివి), కాస్మటిక్స్, చేతి గడియారాలు, కొన్ని ఆభరణాలు, డైపర్స్, ఉన్ని వస్త్రాలు, దురదను ప్రేరేపించే దుస్తులు ఎగ్జిమాను ప్రేరేపిస్తాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, మానసిక సమస్యలు, హార్మోన్‌ సమస్యలు ఎగ్జిమాను తీవ్రతరం చేస్తాయి.
లక్షణాలు : ఎగ్జిమా లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. ఎగ్జిమాలో కనిపించే ప్రధాన లక్షణం దురద. ఆ తర్వాత చర్మం ఎర్రగా మారి, వాపుతో కూడిన పొక్కులు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి నీటి బుడగలుగా మారి, అక్కడి స్రావాలు కనిపిస్తాయి. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతమంతా నల్లగా మారుతుంది.  చర్మంపై ఎక్కడైనా ఏర్పడే ఎగ్జిమా... ముఖ్యంగా తల, మోకాలు వెనక భాగంలో, మెడపైన, మోచేయి, మణికట్టు, చర్మం మడతలు, చెవి వెనకభాగం, కాలి మడమలపైన, పాదాలపై ఎక్కువగా కనిపిస్తుంది. శిశువుల్లో మొదట బుగ్గలపై దద్దుర్లుగా ఇవి కనిపిస్తాయి. కొన్ని నెలలకు ఈ దద్దుర్లు చేతులు, కాళ్లతో పాటు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయి.

చికిత్స : ßోమియో మందులతో రోగనిరోధక శక్తిని పెంచి çకణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. ఇలా చికిత్స చేసే సమయంలో రోగి మానసిక, శారీరక లక్షణాలతో పాటు శరీర నిర్మాణం, వ్యక్తిగత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిపుణులైన డాక్టర్లు మందులను సూచిస్తారు. హోమియో విధానం ద్వారా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండి హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
హైదరాబాద్‌

కొవ్వుల నియంత్రణ లో వ్యాయామంతో డబుల్‌ బెనిఫిట్‌!
లైఫ్‌సై్టల్‌  కౌన్సెలింగ్‌

వ్యాయామం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ వంటి చెడు కొవ్వులు తగ్గడంతో పాటు మనకు మేలు చేసే కొవ్వు కూడా పెరుగుతుందని మా ఫ్రెండ్‌ చెబుతున్నాడు. కొవ్వుల్లోనూ మంచి, చెడు కొవ్వులు ఉంటాయా?  వ్యాయామం కొవ్వును తగ్గించాలి కదా, మరి మంచి కొవ్వును ఎలా పెంచుతుంది. ఈ విషయమై తగిన అవగాహన కల్పించండి.
– సుధీర్‌ కుమార్, వరంగల్‌

మీ ఫ్రెండ్‌ చెబుతున్నది నిజమే. కొలెస్ట్రాల్‌ అనే కొవ్వులో మంచి, చెడు ఉంటాయి. ఎల్‌డీఎల్‌ అనే రకాన్ని చెడు కొలెస్ట్రాల్‌గా చెబుతారు. సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్‌ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్‌డీఎల్‌ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగ   గలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్కి›్లరోసిస్‌ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్‌ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్‌ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్‌ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్‌ను చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్‌ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్‌ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది.

ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతుంది. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్‌ఎటాక్‌ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ అనే మంచి కొవ్వును పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో తీసుకుంటూనే... వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్‌ అయిన హెచ్‌డీఎల్‌ పెరుగుతుంది. మరోవైపు అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి.

డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌సై్టల్‌ అండ్‌
రీహ్యాబిలిటేషన్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement