భేష్! ఎంత బాగా చెప్పావురా కన్నా!
ఎక్కడో, ఎప్పుడో, ఎవడో, ఏదో ఉపకారం చేస్తే పదిసార్లు తలుచుకొని వందసార్లు నమస్కారం చేసావు, మంచిదే. తప్పేమీ లేదు. కానీ అందరికన్నా, అన్నిటికన్నా పెద్ద మహ పకారం చేసినవాడు– బ్రహ్మ అంశగా నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన వాడు నీ తండ్రి. సంస్కృతంలో ‘భవతి’ అంటే ‘ఉన్నది’ అని. అసలు ‘ఉన్నది’ అనడానికి కారణం ఎవరు? నీవు ‘ఉన్నావు’, నీ శరీరం ‘ఉన్నది’ – అంటే ఇది ఉండడానికి కారణం మొదట మీ తండ్రిగారు. ఈ శరీరం ‘ఉన్నది’ అన్న భావన కలిగినప్పుడు అదెప్పుడయినా గౌరవింపబడితే, దాని ‘క్షేమం’ గురించి ఎవరయినా అడిగితే దానికి కారణమయిన తండ్రికి నమస్కారం చేసుకోవడం కృతజ్ఞత. అలా నమస్కారం చేయని జీవితం కృతఘ్నతతో కూడుకున్నది. తండ్రికి చేసిన నమస్కారం బ్రహ్మకు చేసిన నమస్కారమవుతుంది.
కుమారుడి శరీరస్పర్శ పొందిన తండ్రి పరమానందభరితుడౌతాడనీ, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడని తెలుసుకున్నాం కదా. అలాగే తండ్రి పొందగలిగిన సత్కారం ఏది? ‘పుత్రశిష్యత్‌పరాజయం’. అంటే కొడుకు చేతిలో ఓడిపోవడం. కొడుకు మూర్ఖవాదన చేసినప్పుడు కాదు. కొడుకు తనకన్నా విద్వాంసుడై, ఒక విషయాన్ని తనకన్నా బాగా చెప్పినప్పుడు ఆ కొడుకుని చూసి తండ్రి మురిసిపోతాడట. ‘‘సర్వతో జయమన్వ్‌ఇచ్ఛత్, పుత్రశిష్యత్‌పరాజయం’’ అంటే ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి గొప్పగొప్ప జయాలు, ఘనసన్మానాలు అందుకున్నా కలగని సంతృప్తి– కొడుకు చేతిలో ఓడిపోయినప్పుడు తండ్రి పొందగలుగుతాడు. అదే తండ్రికి సంతృప్తినిచ్చే సత్కారం.
‘‘ఈశానస్సర్వవిద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం, బ్రహ్మాధిపతిర్‌బ్రహ్మణోధిపతిర్‌బ్రహ్మాశివోమే అస్తు సదా శివోం’’ – అన్ని శాస్త్రాలకు మూలమైన పరమశివుడంతటివాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివలన సత్కారాన్ని పొందాడు. ‘‘నాన్నగారూ, ప్రణవానికి నేనో అర్థం చెబుతా’’ అన్నాడు. ‘చెప్పరా’ అన్నాడు తండ్రి. ’‘‘ఇలాంటి సందర్భాల్లో ఓ మర్యాద (పద్ధతి) ఉంటుంది. చెప్పేవాడు పైన కూర్చోవాలి కదా, వినేవాడు కింద కూర్చోవాలిగా నాన్నగారూ !’’ అన్నాడు కుమారస్వామి. ‘అలాగే కూర్చుంటాను, చెప్పరా’ అన్నాడు తండ్రి. ప్రణవార్థం సుబ్రహ్మణ్యుడు చెబుతుంటే పరవశించిపోయి ‘‘నేను కూడా ఇంత బాగా చెప్పలేదు నాయనా. ఆహా! ఎంత బాగా చెప్పావు. ఈవేళ నాకు నిజంగా సత్కారం జరిగింది’’ అని పరమశివుడు పరమానందం పొందాడు. అదీ ’పుత్రశిష్యత్‌పరాజయం’ అంటే.
బ్రహ్మహత్య చేసినవాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసినవాడికి, భగ్నవ్రతుడికి –ఒక వ్రతం చేస్తానని నీళ్ళు ముట్టుకుని సంకల్పించి ఆ వ్రతం చేయనివాడికి కూడా నిష్కృతి ఉందేమో గానీ ఉపకారం పొంది, దానిని స్మరించని, నమస్కరించని వాడు కృతఘ్నుడు. వాడి జీవితానికి మాత్రం నిష్కృతి లేదు... అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధకాండలో. ఒక కుమారుడుకానీ, కుమార్తెకానీ ఈ శరీరంతో తిరుగాడుతున్నారంటే దాని నిర్మాణానికి అవసరమైన తేజస్సును, బ్రహ్మ స్వరూపంలో తేజస్సుగా, వీర్యంగా నిక్షేపించినవాడు కేవలం తండ్రి. ఆ తండ్రిలో బ్రహ్మ అంశ చేరి ఉండకపోతే ఈ శరీర నిర్మాణంలో అటువంటి ప్రజ్ఞ ప్రదర్శితం కాదు. అందువల్ల తన కన్నబిడ్డల శరీరానికి ఆధారమైన తండ్రి తన శరీరంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా నమస్కరించాలి, లేకపోయినా నమస్కరించాలి. అలా చేయని వాడిని చూసి పితృదేవతాస్వరూపంలో ఉన్న తండ్రి – అటువంటి కొడుకును కన్నందుకు అలోమని ఏడుస్తాడట.
పితృదేవతలకు సంతోషాన్ని సమకూర్చడమే వంశాభివృద్ధికి కారణమై ఉంటుంది.