అధికార పీఠం చేసిన అవమానానికిఅతడు శపథం చేసి సిగముడి వీడాడు.ఆ అధికారాన్ని అంతం చేశాకే తిరిగి సిగముడి కట్టాడు.అతడు పట్టు పడితే వీడని మొండివాడు.శపథం నెరవేరే వరకుమరలని జగమొండివాడు.అందుకే అతడిది చాణక్య శపథంగా వాసికెక్కింది.ఆ ‘పీఠ’ ముడి గురించే ఈ సీరియల్.
సూక్ష్మబుద్ధి గల చాణక్యుడు తన రాజకీయ చతురతతో దిగ్గజాలతో ఢీకొని అనుకున్నది సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ చదువు విలువ తెలిసి, తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రతిభను కనబరచి అపారమేధస్సుతో భరతజాతి గుండెల్లో అమరుడై నిలిచాడు. అతనే చాణక్యుడు. కౌటిల్యుడిగా అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, భౌతిక, మానసిక తత్వశాస్త్రాలను ఔపోసన పట్టి ప్రపంచానికి అందించాడు. ఇతని కథను దేశ ప్రజలకు దర్శనీయం చేసిన బుల్లితెర చారిత్రక కథనాలను అందించడంలో మరో మైలురాయిని తన ఖాతాలో జమ చేసుకుంది.
ద్వివేది శపథం
కౌరవసభ మధ్యలో అందరిముందు తనకు జరిగిన అవమానానికి ప్రతిగా కౌరవుల రక్తంతో తన కురులను తడిపేవరకు వాటిని ముడివేయనని ప్రతిజ్ఞ చేస్తుంది మహాభారతంలో ద్రౌపది. పాటలీపుత్ర సభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా నందరాజులను రాజ్యహీనులను చేస్తానని, అప్పటివరకు తన శిఖ కురులను ముడివేయనని శపథం చేస్తాడు చాణక్యుడు. మొదటి సంఘటన ద్వాపర యుగంలో జరిగింది. రెండవది కలియుగంలో జరిగింది. రెండూ చారిత్రక ఘట్టాలే. రెండింటి నుంచీ నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. తొమ్మిదేళ్లపాటు చాణక్యుడి అర్థశాస్త్రంతో సహా 180 పుస్తకాలను చదివి, అర్ధం చేసుకొన్న దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది తనకు తానే శపథం చేసుకున్నాడు ‘ఎలాగైనా సరే ఈ రాజనీతిజ్ఞుడిని బుల్లితెర మీద ఆవిష్కరింపజేయాలి’ అని. అప్పటికే వాడుకలో ఉన్న చారిత్రక కథ చాణక్యుడిది.
ఒక పేద బ్రాహ్మణుడు అంచెలంచెలుగా ఎదిగి, తన సూక్ష్మబుద్ధితో ప్రత్యర్థులను మట్టికరిపించిన విధానాన్ని చూపాలనుకున్నాడు. అతనికున్న అపారమేధాశక్తిని దేశప్రజల కళ్లకు కట్టాలనుకున్నాడు. చాణక్యుడి జీవితం గురించి పరిశోధన చే శాడు. ‘జాతీయ స్పృహ కలిగిన మొట్టమొదటి వ్యక్తి’గా చాణక్యుడిని అభివర్ణించాడు ద్వివేది. 1988లోనే పైలట్ ఎపిసోడ్‌ను దూరదర్శన్‌కి సబ్‌మిట్ చేశారు ద్వివేది. అయితే, బిఆర్ చోప్రా మహాభారత్ పట్ల వారు ఆసక్తిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ తెరమీద రక్తి కట్టించడానికి మరో మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1991 సెప్టెంబరులో ప్రసార మైన ‘చాణక్య’ ఆగస్టు 1992 వరకు మొత్తం 47 ఎపిసోడ్లలో ప్రసారమైంది.
మొత్తం మూడు పార్టులు.. వాటిలో...
1. మగధ రాజ్యాన్ని పాలిస్తున్న చంద్రగుప్తుడు ధననందుడి కుమారుడు. ఇతని రాజ్య విశేషాలను ఈ భాగంలో చూపారు.
2. నందుల పాలనపై చాణక్యుడి సాయంతో చంద్రగుప్తుడు ఎదురుదాడి చేసి, గెలవడం.. ఈ భాగంలో చూడచ్చు.
3.అలెగ్జాండర్ ఉత్తరభారత దేశాన్ని ముట్టడి చేసే సమయంలో చంద్రగుప్త నాయకత్వంలో చాణక్యుని రాజనీతి చతురతతో వారిని తిప్పికొట్టడం చూస్తాం.
రాజకీయ చతురతతో కూడిన ఈ మూడు భాగాలను ప్రముఖంగా ఫ్రేమ్ వర్క్ చేసుకోవడానికి చాణక్యుడి యుద్ధకౌశలం పట్ల ముగ్ధుడవడమే కారణం అంటారు దర్శకుడు ద్వివేది.
కథ ఇదీ..
‘పాటలీపుత్రాన్ని మహాపద్మనందుడు తన ఎనిమిది మంది కుమారుల సాయంతో పాలించేవాడు. మహాపద్మనందునికి ఇళ, ముర అని ఇద్దరు రాణులు. ఇళకు ఎనిమిది మంది కొడుకులు, మురకు చంద్రగుప్తుడు ఒక్కడే కొడుకు. ఈ ఎనిమిది మంది నందులు తమ తమ్ముడైన చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాలోచనలు చేసేవారు. ఒకరోజు పేదవాడిగా కనిపించే చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి, అక్కడి ఉన్నతాసనంపై కూర్చున్నాడు. పేదవాడనే కారణంతో నందులు అతన్ని తిరస్కారభావంతో చూసి, సింహాసనం నుండి కిందకు లాగి పడేస్తారు. నందుల రాక్షసమంత్రి ఇది సరైనది కాదని వారికి నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోతుంది. తనను అవమానించిన నందులపై ఆగ్రహించిన చాణక్యుడు ‘ అందరి మధ్య ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇలాగే సింహాసనం నుండి లాగి, మీ తలలను నరికి గానీ ఈ జుట్టు ముడి వేయను’ అని శపథం చేసి అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు.
నందుల తమ్ముడు చంద్రగుప్తుడు రహస్యంగా చాణక్యుడిని కలుస్తాడు. మొదటి ప్రతిజ్ఞ నందుల నాశనం అయితే, రెండవ ప్రతిజ్ఞ నందరాజ్యానికి చంద్రగుప్తుని రాజుని చేయడం అంటాడు చాణక్యుడు. ఆ తర్వాత తన రాజకీయ చతురతతో నందులను యుద్ధంలో ఓడించి, వారిని చంపి తన తలవెంట్రుకలను ముడుస్తాడు. ముందు అనుకున్న విధంగా చంద్రగుప్తుణ్ణి రాజును చేశాడు. ఈ విధంగా రెండు ప్రతిజ్ఞలను నెరవేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా అనేక దండయాత్రలు తన ఆధ్వర్యంలో జరిపి, పాటలీపుత్రాన్ని మగధ రాజ్యంగా విస్తరింపజేసి చంద్రగుప్తుడిని చక్రవర్తిగా ప్రకటించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన చాణక్యుడు రాజనీతి శాస్త్రంతోపాటు అర్థశాస్త్రాన్ని రచించాడు. భౌతిక, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పాడు.
ప్రకాష్ ద్వివేది ద్విపాత్రాభినయం
∙చాణక్యుడిగా దర్శకుడైన ప్రకాష్ ద్వివేది తన నట విశ్వరూపం చూపడం ఇందులో విశేషంగా చెప్పుకోవచ్చు. చాణక్యుడిగా, చంద్రగుప్తుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ∙చాణక్య సీరియల్ ‘ఇండియన్ టెలివిజన్‌కి ఒక మైలురాయి’ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడిన ఈ సీరియల్ ఐదు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. సీరియల్ ప్రామాణికత, నటీనటుల నటనను దేశమంతా విస్తృతంగా ప్రశంసించింది ∙ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ కూడా ఈ సీరియల్‌కి తన సహకారాన్ని అందించారు ∙చాణక్య సీరియల్‌కన్నా ముందు ద్వివేది స్టేజీ యాక్టర్‌గా కొనసాగేవారు.
Comments
Please login to add a commentAdd a comment