అలవాటు మార్చుకోలేదు! తప్పు దిద్దుకున్నా!!
మనోగతం
నాకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. దీని కోసం ఎంతైనా ఖర్చు చేసే అలవాటు ఉంది. మా ఆవిడకు మాత్రం నా అలవాటు బొత్తిగా నచ్చేది కాదు. ‘‘జీతం డబ్బులన్నీ పుస్తకాల కోసం తగలేస్తున్నాడు’’ అని ఇరుగు, పొరుగు వాళ్లకూ, బంధువులకూ చెప్పి బాధ పడుతుండేది. అది విన్నప్పుడల్లా చాలా బాధగా ఉండేది. ఒకసారి నేను ఊరెళ్లిన సమయం చూసి...చాలా పుస్తకాలను కిరాణా కొట్టు వాడికి అమ్మింది.
‘‘ఇక్కడ కొన్ని పుస్తకాలు కనిపించాలి. ఏవి?’’ అని అడిగితే ‘‘నాకేం తెలుసు!’’ అని అమాయకంగా ముఖం పెట్టింది. కాస్త గట్టిగా అడిగేసరికి ఆమెకు కోపం వచ్చింది. ‘‘అవును. కిరాణా కొట్టుకు వాడికి అమ్మాను. పుస్తకాల కోసం డబ్బులు తగలేస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండాలా?’’ అని దురుసుగా సమాధానం ఇచ్చింది. ‘‘చూడనక్కర్లేదు...నీ దారిన నీవు వెళ్లిపోవచ్చు’’ అని కోపంగా అన్నాను. దీంతో ఆమె కంటికి మింటికి ధారగా ఏడ్చింది. బట్టలు సర్దుకొని ఉన్నపళంగా పుట్టింటికి వెళ్లింది.
‘తొందరపడ్డానా? అనవసరంగా ఆమెను బాధ పెట్టానా?’ అనిపించింది. కానీ పుస్తకాలు కిరాణం కొట్టువాడికి అమ్మడం గుర్తుకు వచ్చి నాకు కోపం రావడం సమంజసమే అనిపించింది. ఒక వారం తరువాత పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ‘‘అందరూ మీ ఆయన గురించి మంచిగా చెబుతుంటారు. ఏమిటమ్మా నీకు వచ్చిన ఇబ్బంది?’’ అని అడిగాడు ఒక పెద్దాయన. ‘‘ఎప్పుడు చూసినా పుస్తకాల గొడవే. ఒక సినిమా లేదు, షికారు లేదు...’’ అని మా ఆవిడ నన్ను తిట్టడం మొదలుపెట్టింది. మధ్యలో మా అమ్మ ఏదో కలిపించుకోబోతే-‘‘అసలు నీవల్లే ఆయన ఇలా తయారయ్యాడు’’ అన్నది.
దీంతో నాకు విపరీతంగా కోపం వచ్చి- ‘‘మీ నాన్నలా మందు కొట్టడానికి డబ్బులు ఖర్చు చేయడం లేదు. మీ అన్నయ్యలా సిగరెట్లు తాగడానికి ఖర్చు చేయడం లేదు..’’ అని నేను అనేసరికి గొడవ పెద్దదయింది. పెద్దలు సర్దిచెప్పారు. సాయంత్రానికల్లా రాజీ కుదిర్చారు. మరుసటి రోజు మా ఆవిడ నాతో కాపురానికి వచ్చింది.
‘‘పుస్తకాలను తప్ప నన్ను పట్టించుకోడు’’ అని ఆమె అన్నమాట పదే పదే గుర్తుకు వచ్చింది. నేను నా తప్పును సరిదిద్దుకున్నాను. ఆమెతో పాటు సినిమాలకు, షాపింగ్‌లకు వెళుతున్నాను. కబుర్లు చెబుతున్నాను. ఆమె కూడా చాలా మారిపోయింది. నేను ఏదైనా కొత్త పుస్తకం కొంటే ‘‘ఎందుకు కొన్నారు?’’ అని రుసరుసలాడకుండా ఆ పుస్తకం గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే ఇద్దరం ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా ఉంటున్నాం.
- యస్. సుందర్, హైదరాబాద్