
మొబైల్‌ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాం. దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుందా అని వెతుకుతాం. మరి విద్యుత్తు కారులో ఛార్జ్ అయిపోతే..? ఇప్పటికైతే ఛార్జింగ్ స్టేషన్లు పెద్దగా లేవు కాబట్టి.. ఒక్క ఫోన్‌కొడితే మీ దగ్గరికే చార్జింగ్ స్టేషన్ వచ్చేస్తుంది అంటున్నారు జర్మనీకి చెందిన ఛార్జరీ అనే కంపెనీ. ఫొటోలో కనిపిస్తోందే.. అదే ఆ ఛార్జింగ్ స్టేషన్. ఒక మీటర్ పొడవు, దాదాపు 330 కిలోల బరువుండే ఈ యంత్రంలో 24 కిలోవాట్/గంటల విద్యుత్తు నిల్వ ఉండేలా లిథియం అయాన్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఈ స్థాయి విద్యుత్తుతో వాహనాలు దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని అంచనా. త్వరలోనే దీన్ని 50 కిలోవాట్/గంటలకు పెంచేందుకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
ఛార్జింగ్‌కు పట్టే సమయం కూడా చాలా తక్కువని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో ఉత్పత్తి చేసిన విద్యుత్తునే ఇందులో వాడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ లేదా స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా చెబితే చాలు.. మీ దగ్గరకు ఛార్జరీ యంత్రం వచ్చేస్తుంది. దాంట్లోంచి ఏసీ అడాప్టర్‌తో ఎంచక్కా మీ విద్యుత్తు వాహనాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. యూరప్‌లోని 13 నగరాల్లో దాదాపు 350 ఛార్జరీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment