
మధుమేహం నుంచి విముక్తి పొందేందుకు తాజాగా యాల్ యూనివర్శిటీ పరిశోధకులు అన్నింటికంటే సింపుల్ పరిష్కారం ఒకదాన్ని సూచిస్తున్నారు. ఆహారం ద్వారా వంటబట్టే కేలరీలను వీలైనంత తగ్గిస్తే చాలు.. టైప్ –2 మధుమేహాన్ని నయం చేసుకోవచ్చునని అంటున్నారు. ఎలుకలకు సాధారణ కేలరీల్లో నాలుగోవంతు మాత్రమే అందించి చేసిన ప్రయోగాల్లో వ్యాధి నయమైనట్లు స్పష్టమైందని గెరాల్డ్ షూల్మన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ రకమైన ఆహారం అందించిన తరువాత ఎలుకల జీవక్రియల్లో జరిగిన మార్పులను పరిశీలించడం ద్వారా వ్యాధి ఎలా నయమైందీ గుర్తించారు. తక్కువ కేలరీలున్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, అదే సమయంలో గ్లైకోజెన్.. గ్లూకోజ్‌గా మారే వేగమూ తగ్గిందని, అలాగే శరీరంలో కొవ్వు శాతమూ తగ్గడం వల్ల కాలేయం ఇన్సులిన్‌కు స్పందించే లక్షణంలోనూ మార్పులొస్తాయని ఆయన వివరించారు.
కేవలం మూడు రోజులపాటు కేలరీలు తక్కువన్న ఆహారం తీసుకున్నప్పటికీ మధుమేహ తీవ్రతలో స్పష్టమైన మార్పులు కనిపించినట్లు ఈ ప్రయోగాల్లో తేలింది. ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేసుకున్న వారు, ఇప్పటికే అతితక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్న మధుమేహ వ్యాధిగ్రస్తులపై కూడా ఇదేరకమైన ప్రయోగాలు చేసి ఫలితాలను నిర్ధారించుకునేందుకు ప్రస్తుతం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు షుల్మన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment