బాల్యానికి రెక్కలుంటాయి. ఛీ..! రెక్కల కష్టం మిగిలింది. భవిష్యత్తు బంగారంలా ఉండాలి.బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఏమవుతోంది? గిల్టుగా మారుతోంది.అవును... మన ఒంటి మీద తళతళలాడే ఈ గిల్టు ఆభరణాలు ఆ పిల్లల బాల్యానికి భరణాలే. మన మెడలో హారాలను... పిల్లలు తమ స్వేదంతో కడుతున్నారు.
‘‘బంగారం, ప్లాటినం, వెండి వంటి విలువైన లోహాలతో తయారయ్యే ఆభరణాలకు బదులు, అనుకరణ నగలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అయితే ఇండియన్ ఇమిటేషన్ ఆర్నమెంట్స్ మార్కెట్‌లో పాతిక శాతాన్ని చైనా ఆక్రమించేసింది. ఏడాదికి వెయ్యికోట్ల విలువైన ఆభరణాలు చైనా నుంచి ఇండియాకి దిగుమతి అవుతున్నాయి. మన ఇమిటేషన్ ఆభరణాలతో పోలిస్తే చైనా ఆభరణాల ధర తక్కువ. చైనాలో తయారవుతున్న ఇమిటేషన్ నగలన్నీ మెషీన్ మేడ్ ఆర్నమెంట్సే. మన దగ్గర అలా కాదు. చేత్తో తయారయ్యేవే ఎక్కువ. బంగారు, ప్లాటినం ఆభరణాలను పోలిన ఇమిటేషన్ నగలను తయారు చేసే నిపుణులు మన దగ్గరున్నారు. ఇమిటేషన్ నగల తయారీ దారులు ఇండియాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్‌లో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ కూలితో పని చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ రాజ్‌కోట్‌లో విస్తరించడానికి అదీ ఒక కారణం. మన దగ్గర వంద రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల విలువ చేసే ఇమిటేషన్ నగలు తయారవుతున్నాయి. ప్రపంచంలో ఈ నగల తయారీలో చైనా తరవాతి స్థానం ఇండియాదే. మన నగలకు జర్మనీ, అమెరికా, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాలు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాలతోపాటు అనేక దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మన జువెలరీ తయారీ సంస్థలన్నీ వ్యవస్థీకృతం కావాలి’’ ... ఇది రాజ్‌కోట్ ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ వికారియా 2013లో అన్నమాట. వినడానికి బాగున్న మాట కూడ. మరి... ఇమిటేషన్ నగల తయారీలో ఛిద్రమవుతున్న బాల్యం మాటేమిటి?
ఇలా బయటపడింది
గుజరాత్, రాజ్‌కోట్‌లోని ఒక కృత్రిమ ఆభరణాల తయారీ యూనిట్‌లో పని చేస్తున్న పిల్లలను పోలీసులు రక్షించారు. ఆ పిల్లలకు ఏ నలుగురో, ఐదుగురో కాదు... ఏకంగా డెబ్బై మంది పిల్లలు. అదీ ఒక్క కార్ఖానాలోనే. ఇక మిగిలిన వర్క్ యూనిట్‌ల సంగతేమిటి? ఏడు వందల కార్ఖానాలున్న రాజ్‌కోట్‌లో ఎంత మంది పిల్లల బాల్యం అందమైన రంగు రాళ్ల నీడలో మసకబారుతుండవచ్చు? ఆ సంఖ్య వందలు కాదు వేలల్లో ఉండవచ్చనే అనుమానిస్తున్నారు పోలీసులు. గత ఏడాదిలో ఒక కార్ఖానా నుంచి ఇద్దరు పిల్లలు యజమాని కళ్లు కప్పి పారిపోయారు. వాళ్ల కోసం సాగిన దర్యాప్తులో తీగ లాగితే డొంక కదిలినట్లు పిల్లలు బిలబిల మంటూ బయటికొచ్చారు.
చట్టానికి దొరకని ట్రాఫికింగ్
ఇమిటేషన్ నగల తయారీలో పరిశ్రమల్లో పని చేస్తున్న పిల్లలంతా వెస్ట్ బెంగాల్ నుంచి పని కోసం గుజరాత్‌కి వచ్చిన వాళ్లే. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్. కార్ఖానాల యజమానులకు నేరుగా ఎటువంటి సంబంధం ఉండదు. పిల్లలను సరఫరా చేసే ఏజెంట్‌లు ఉంటారు. ఆ ఏజెంట్‌లు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి బేరం కుదుర్చుకుంటారు. నెలకు ఆరువేల జీతం ఇప్పిస్తామని చెప్పి పిల్లలను తీసుకొస్తున్నారు. ఇది చట్టం పరిధిలో ఏ సెక్షన్‌కూ దొరకని పిల్లల అక్రమరవాణా. తల్లిదండ్రుల సమ్మతితోనే జరుగుతుంది కాబట్టి, ఏజెంట్‌ల మీద ఎవరూ కేసు పెట్టరు. ఊపిరిసలపని పని పరిస్థితుల్లో పిల్లలు తమకు తామే బంధనాలను చేధించుకుని బయటకు రావడంతో ఈ దురాగతం అయినా బయటికొచ్చింది.
పగలు – రాత్రి పని
బ్రేస్‌లెట్‌లు, గాజులు, చెవి కమ్మలు, హారాలు, లాకెట్‌ల వంటి ఆభరణాలలో రాళ్లు పొదగడం వంటి సునిశితమైన పనుల్లో శిక్షణనిస్తారు. ఈ కార్ఖానాల్లో పగలు – రాత్రి పని జరుగుతుంటుంది. షిఫ్ట్‌ల వారీగా పిల్లల చేత పని చేయిస్తుంటారు. ఇక విశ్రాంతి సమయంలో ఒక పది– పన్నెండు మంది పిల్లలు నిద్రపోవాలి. ఇంత కష్టపడినా సరే... ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం వేతనం ఇవ్వరు, సగం ఇచ్చి సరిపెడతారు. ఇంత పెద్ద ఘోరం చాపకింద నీరులా జరిగిపోతోంది. ఇంత పెద్ద స్కామ్ బయటపడిన తర్వాత కూడా రాజ్‌కోట్ ఇమిటేషన్ నగల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాత్రం... ‘‘మా పరిశ్రమల్లో బాల కార్మికులు లేరు. మేము ఇళ్ల దగ్గర ఉండే ఆడవాళ్లకు మెటీరియల్ ఇచ్చి, వాళ్లు తయారు చేసిన ఆర్నమెంట్‌కి పీస్ లెక్కన వేతనం ఇస్తాం. ఇది అతి పెద్ద పరిశ్రమ. రాజ్‌కోట్‌లో ఏడాదికి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఎవరైనా చిన్న పిల్లల చేత పనులు చేయిస్తుంటే అది పూర్తిగా తప్పే, అలాంటి వాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందే’’ అని చేతులు దులుపుకున్నారు. ఇదంతా చట్టమే స్వయంగా చూసుకోవాలి... అన్నట్లు ముక్తాయించి ఊరుకున్నారు.
అందరి భాగస్వామ్యం ఉంది
పిల్లలు కార్మికులుగా మారుతున్నారంటే ఆ నేరం అందరిదీ. మొదటి దోషి ప్రభుత్వం, ఆ తర్వాత సమాజం. తల్లిదండ్రులు, పని ఇచ్చిన యజమాని వరకు అందరూ దోషులే. ఒక గ్రామంలో జనాభా రికార్డులో నమోదై ఉన్న పిల్లలందరూ ఆ ఊరి స్కూళ్లలో కానీ మరేదైనా స్కూళ్లలో కానీ నమోదై ఉన్నారా లేదా అని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వమే. స్కూళ్లలో నమోదు కాకపోయినా, నమోదై వరుసగా నెలల పాటు ఆబ్సెంట్ అవుతున్నా ఆ స్కూల్ టీచర్లు, అధికారులు కారణాల కోసం అన్వేషించాలి. తల్లిదండ్రులతో మాట్లాడి సమాచారం తెలుసుకోవాలి. పిల్లలను పనుల్లో పెట్టడం నేరమని తల్లిదండ్రులను హెచ్చరించాలి. పిల్లలు తప్పకుండా బడికి వచ్చేటట్లు చూడాలి. పోషణ జరగని కుటుంబాలకు పనికి ఆహార పథకంలో పని కల్పించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, పిల్లల కోసం ఇన్ని పథకాలున్నా సరే... పిల్లలు బడిలో ఉండాల్సిన వయసులో పనిలో ఉన్నారంటే సమాజం బాధ్యత కూడా ఉందని చెప్పక తప్పదు. సమాజంలో అందరమూ... ఒక హోటల్, మరేదైనా దుకాణంలో పిల్లలు పని చేస్తున్నట్లు గమనిస్తే ఆ హోటల్‌కి, దుకాణానికి వెళ్లడం మానేయాలి. బాల కార్మికుల సర్వీసులను, ఉత్పత్తులను స్వీకరించడానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యతిరేకించాలి. ఈ బహిష్కరించడం అనేది విదేశీ వస్తు బహిష్కరణలాగ ఒక ఉద్యమంలా జరగాలి. అప్పుడే పసితనానికి బాల్యం మిగులుతుంది.– ప్రొఫెసర్ శాంతా సిన్హా, సామాజిక కార్యకర్త,మాజీ చైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్
బడి చట్టం ఏమైంది?
‘‘పువ్వుల్లా విచ్చుకోవాల్సిన బాల్యం ఆడంబరాల వెలుగు జిలుగులకు బలవుతోంది. బడిలో ఉండాల్సిన వయసులో పిల్లలు గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేని పరిశ్రమల్లో మగ్గిపోతున్నారు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమైంది, ఆ చట్టాన్ని అమలు చేస్తే అక్షరాలు దిద్దాల్సిన చేతులు పూసలు అద్దవు కదా. ఈ నేరంలో ప్రత్యక్ష దోషులు కంపెనీ నిర్వహకులు, ఏజెంట్‌లు అయితే... మూల దోషి ప్రభుత్వమేనన్నారు పిల్లల హక్కుల కార్యకర్త శాంతాసిన్హా. మనకు చట్టాలున్నాయి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలున్నాయి, ప్రభుత్వాలు విఫలమైనప్పుడు హెచ్చరించి బాధ్యత గుర్తు చేయడానికి న్యాయస్థానాలూ ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలకు సమస్యను ఎలుగెత్తి చాటే పత్రికలూ ఉన్నాయి, హక్కుల పరిరక్షణ కోసం పని చేసే కార్యకర్తలూ ఉన్నారు. అయినా బిగించిన పిడికిలి నుంచి జారి పోయే ఇసుకలాగ చట్టాలు నిర్వీర్యమైపోతుంటాయి. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఒకవైపు స్పెషల్ డ్రైవ్ చేస్తోంది. మగపిల్లల బాల్యం కూడా భద్రంగా ఏమీ లేదనడానికి రాజ్‌కోట్ పెద్ద ఉదాహరణ.– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment