సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తితో నెలకొంటున్న పరిస్థితులు బాలల స్వేచ్ఛకు పెను సవాలుగా మారనున్నాయి. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతబడి చాలామంది పిల్లలు ఇంటివద్దే ఉండటంతో వారిని పనిబాట పట్టించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఊరట లభిస్తుందనే ఆశతో పిల్లల్ని కార్మికులుగా మార్చే ప్రమాదముందని ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ), యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్‌డౌన్ అన్ని రంగాలపై పెను ప్రభావాన్నే చూపింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగం పెరగడంతో చిన్నపాటి ఉద్యోగాల్లో తక్కువ వేతనానికి పనిచేసే బాలలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో బాల కార్మికుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
ఇరవై ఏళ్లలో 10 కోట్ల బాలకార్మికులు బడికి
బాలల హక్కులతో పాటు బాల కార్మిక వ్యవస్థపై చేపట్టిన ఉద్యమం ఇరవై ఏళ్లలో మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది పిల్లలను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించడంలో అంతర్జాతీయ సంస్థలు కృషి చేశాయి. దేశంలో ఇరవై ఏళ్లలో దాదాపు 1.7 కోట్ల మంది పిల్లలు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ అంచనాలపై ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో బాలల స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై చేస్తున్న ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని, పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment