
పిల్లలు... మరీ లావయిపోతున్నారు?
ఇదేమీ సంపన్నుల ఇళ్ల చుట్టూ తిరిగిన అధ్యయనం కాదు.
పేద... మధ్య తరగతి ఇళ్ల చుట్టూ తిరిగిన అధ్యయనమే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో ఈ సంగతి బయటపడింది.
ఆటల్లేక లావయిపోతున్నారు. అందుకే...
పిల్లలను ఆడుకోనిద్దాం... ఆరోగ్యంగా పెరగనిద్దాం!
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, కౌమార వయస్కులు అవసరానికి మించి బరువు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లు సంయుక్తంగా జరిపినఅధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. వరల్డ్ ఒబేసిటీ డే (అక్టోబరు 11వ తేదీ) సందర్భంగా ప్రఖ్యాత వైద్యశాస్త్ర పరిశోధన మ్యాగజైన్ ద లాన్‌సెట్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలుప్రచురితమయ్యాయి. దాదాపు వెయ్యిమంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో పాల్గొనగా.. 13 కోట్ల మంది (5– 19 మధ్య వయసు వారు) ఎత్తు, బరువులను పరిశీలించారు.
ఈ వివరాలఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్‌ను లెక్కించగా.. 1975లో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు, కౌమార వయసు వారి సంఖ్య కోటీ పది లక్షలు మాత్రమే ఉంటే.. 2016నాటికి ఇది 12.4 కోట్లకు పెరిగిపోయినట్లు స్పష్టమైంది. ఇంకోలా చెప్పాలంటే 40 ఏళ్లలో ఊబకాయులు పదిరెట్లు పెరిగారు. అంతేకాకుండా ఇంకో 2.13 కోట్ల మంది అవసరానికి మించిఎక్కువ బరువు ఉన్నా.. వారిని ఊబకాయులుగా పరిగణించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2022 నాటికల్లా అవసరమైనదాని కంటే తక్కువ బరువున్న పిల్లల కంటే ఊబకాయులే ఎక్కువగా ఉంటారని ఈ అధ్యయనం హెచ్చరించింది.
2016 నాటికి ఊబకాయులైన పిల్లల్లో 5 కోట్ల మంది బాలికలు కాగా, 7.4 కోట్ల మంది బాలురని.. ఇదే సమయంలో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువున్న వారిలో బాలురు, బాలికల సంఖ్య 7.5, 11.7 కోట్ల వరకూ వరకూ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ ఫియానా బుల్ తెలిపారు. ఊబకాయం సమస్య పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదని, కాకపోతే వీరిలో పెరుగుదల గత 40 ఏళ్లలో ఆరు రెట్లు మాత్రమే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చెబుతోంది. 1975లో ఊబకాయుల సంఖ్య పది కోట్ల వరకూ ఉంటే.. 2016కు ఇది 67 కోట్లకు పెరిగింది. అలాగే అవసరానికి మంచి బరువున్నా.. ఊబకాయులుగా చెప్పలేని వారు ఇంకో 130 కోట్ల మంది తేలింది. భారత దేశం విషయానికొస్తే.. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ అంచనాల ప్రకారం 2025 నాటికి దాదాపు 4.83 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతూంటారు.
ధనిక దేశాల్లో తగ్గుముఖం...
ఊబకాయం సమస్య 1975 నుంచి, మధ్య, అల్పాదాయ దేశాల్లో ఎక్కువవుతూ వస్తూండగా.. చాలా వరకూ ధనికదేశాల్లో ఊబకాయుల సంఖ్య తగ్గిపోతోంది లేదంటే.. స్థిరంగా ఉంటోందని ఈఅధ్యయనం చెబుతోంది. తూర్పు ఆసియా, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో కుటుంబాల ఆదాయాలు పెరగడం వల్ల కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎక్కువైందని..ఫలితంగా పిల్లలు తొందరగా ఊబకాయం బారిన పడుతూండటంతోపాటు.. అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ అధ్యయనం చెబుతోంది.
శారీరక శ్రమ కల్పించాలి..
ఊబకాయం సమస్య పిల్లల్లోనూ ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసే ప్రయత్నాల్లో ఉంది. ‘ఎండింగ్ ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీఇంప్లిమెంటేషన్ ప్లాన్‘ పేరిట జారీ కానున్న ఈ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలకు శారీరక శ్రమ కల్పించే ఆటలు, వ్యాయామాన్ని అన్ని దేశాలు ప్రోత్సహించాలి. అదే సమయంలో అధికకేలరీలు మాత్రమే అందిస్తూ.. ఇతర పోషకాల మోతాదు తక్కువగా ఉన్న ఆహారం విషయంలో.. అంటే జంక్‌ఫుడ్ తినడాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
బీఎంఐ లెక్కించేదిలా..
మీ శరీర బరువును కిలోల్లో, ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువును ఎత్తు తాలూకూ ఘనంతో భాగిస్తే బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది. ఉదాహరణకు మీ ఎత్తు, 5.8 అడుగులు లేదా1.76 మీటర్లు అనుకుందాం. బరువు 68 కిలోలైతే.. మీ బీఎంఐ 68/1.76 ఇంటూ 1.76 = 22.0 అవుతుంది. బీఎంఐ 19 వరకూ ఉంటే బరువు తక్కువ ఉన్నారని, 19 – 24.9 మధ్య బీఎంఐఉంటే ఆరోగ్యకరమైన బరువు ఉన్నారని అర్థం. బీఎంఐ 25 నుంచి 29.9 మధ్యలో ఉంటే అధిక బరువు ఉన్నారని.. 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయమని అర్థం. ఈ లెక్కలు 19 ఏళ్లకుమించిన వారికి మాత్రమే వర్తిస్తాయి. పిల్లల్లో బీఎంఐ లెక్కింపునకు ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు.
ఊబకాయం తగ్గాలంటే...
ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఊబకాయం సమస్యను కొంత వరకూ అధిగమించవచ్చు.
►మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. తద్వారా శరీరానికి అవసరమైన శక్తి నిలకడగా.. ఎక్కువ సమయం అందడంతోపాటు అత్యవసరమైన ఇతరపోషకాలూ అందుతాయి.
►ఆయా కాలాల్లో దొరికే పండ్లు, కాయగూరలు రోజూ తీసుకోవాలి. కనీసం రోజూ రెండు రకాల పండ్లు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీయాక్సిడెంట్లు లభిస్తాయి.
► కందిపప్పు, పెసరపప్పులతోపాటు శనగలు, సోయా, రాజ్మా వంటి పప్పుధాన్యాలను కూడా వాడాలి. వీటి ద్వారా అందే ప్రొటీన్లు శరీర బరువును నియంత్రణలో ఉంచడం మాత్రమే కాకుండాకడుపు నిండుగా ఉన్న అనుభూతిని కల్పిస్తాయి.
► శరీరానికి అవసరమైన మొత్తం కేలరీల్లో చక్కెరల ద్వారా అందేది పదిశాతం కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది ఐదు శాతం కంటే తక్కువ ఉంటే మరీ మేలు. ఎంత తక్కువ వాడితే అంత మంచిదన్నమాట.
► కొవ్వులు శరీరానికి అవసరమే కానీ ఇది మొత్తం కేలరీల్లో 15 శాతం వరకూ ఉండేలా చూసుకోవాలి. వంట నూనెలు మార్చి మార్చి వాడటం వల్ల అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment