
చాంద్ కా టుక్‌డా...
దేశభక్తి
ప్రపంచ దేశాలలో భారతదేశమే చాంద్ కా టుక్‌డా. అద్భుత నైసర్గికతతో, అత్యంత అద్భుతమైన వనరులతో, అంత కంటే అద్భుతమైన సాంస్కృతిక మూలాలకు నిలయమైన మన దేశం... ప్రపంచ దేశాలకు మురిపెంగా కనిపించే దేశం... ముద్దొచ్చే దేశం. అందుకే కవి ఇక్బాల్ ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాన్ హమారా’ అని మన దేశాన్ని కొనియాడాడు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ అక్కడి నుంచి మన దేశాన్ని చూస్తూ అదే ఉద్వేగంతో ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాన్ హమారా’ అని పాడాడు. కాని కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు.
ఒడి దుడుకులు వచ్చాయి. సంస్కృతుల మధ్య స్పర్థలు వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు దాటి ముందుకు పోవడమే ఈ దేశం ఎప్పుడూ చేసింది. ఈ దేశంలో మతాల మధ్య ఉన్న సోదర భావం, అన్ని మతాలకూ ఈ దేశం పట్ల ఉన్న భక్తిభావం ఈ దేశాన్ని అచంచలంగా నిలబెడుతున్నాయి. ఈసారి ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని మతాల వాళ్లూ, అన్ని ప్రాంతాల వాళ్లూ మమేకమై జరుపుకున్న పండగ ఇది. ముస్లిం బాల బాలికలు పాల్గొన్న వేడుకలు చూపరులను మరింతగా ఆకట్టుకున్నాయి. అరచేతులో త్రివర్ణ పతాకాలతోపాటు బుగ్గలపై, అమ్మాయిల శిరో వస్త్రాలపై కూడా మూడు రంగులు రెపరెపలాడాయి. ఇది అందరి దేశం. అందరితో వెలిగే దేశం. అందరితోనే వెలగాల్సిన దేశం. మన భారతదేశం.