ఇఎన్‌టి కౌన్సెలింగ్
మా బాబు వయసు 11 ఏళ్లు. వాడికి వేసవి బాగానే గడుస్తుంది. ఆ సీజన్ వెళ్లి వర్షాకాలం వచ్చి నాలుగు చినుకులు రాలాయో లేదో తరచూ అనారోగ్యానికి గురవుతుంటాడు. వాడి విషయంలో మేము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?
- సుఫల, జంగారెడ్డిగూడెం
సాధారణంగా చాలామంది వేసవి ఎప్పుడు గడిచిపోతుందా, వర్షాలు ఎప్పుడు పడతాయా, వాతావరణం ఎప్పుడు చల్లబడుతుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ కొంతమందికి వర్షాకాలం కొంత ఆందోళనకరంగానే గడుస్తుంది. అపరిశుభ్రమైన పరిసరాలు, నీరు నిలిచి ఉండటం, నేల చిత్తడిగా బురదతో నిండి ఉండటం మొదలైన వాటి వల్ల కొంతమంది తరచూ అనేక రకాల వ్యాధుల బారిన పడుతుంటారు. ఇది వారి వారి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల జరుగుతుంటుంది.
సాధారణంగా వర్షాల సీజన్‌లో వచ్చే సమస్యల్లో జలుబు ముఖ్యమైంది. దీంతోపాటు అలర్జీకి సంబంధించిన సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్స్, కంటివ్యాధులు, చర్మవ్యాధులు కూడా వస్తాయి. మలేరియా, డెంగ్యూ కూడా ఈ కాలంలో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు.
వర్షాకాలంలో పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు ధరించాలి. రెయిన్‌కోట్, గొడుగులు ఇవ్వడం వంటి జాగ్రత్తలతో పిల్లలసు స్కూల్‌కు పంపండి. అపరిశుభ్రమైన నీటిలో అడుగు పెట్టకుండా చూడండి. వాననీటిలో పిల్లలు తడవకుండా జాగ్రత్త పడండి పిల్లలు తడిసి ఇంటికి వచ్చాక యాంటీబ్యాక్టీరియల్ సబ్బులతో స్నానం చేయించండి. వేడిగా పాలు లేదా సూప్ వంటివి తాగించండి ఆహారం తీసుకునేముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కునేలా చేయండి టాయిలెట్‌కు వెళ్లివచ్చాక మెడికేటెడ్ సబ్బు లేదా హ్యాండ్‌వాష్ లిక్విడ్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి గొంతు ఇన్ఫెక్షన్లు అపరిశుభ్రమైన నీరు తాగడం వల్లనే వస్తుంటాయి. అందుకని ప్యూరిఫైయర్ నీళ్లు లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
బయటి పదార్థాలు తినాల్సివస్తే, నీళ్లకోసం వాటర్‌బాటిల్ కొనడం మంచిది. చాలామందికి ఇన్ఫెక్షన్లు అలాంటిచోట్ల ఉండే అపరిశుభ్రమైన నీటిని తాగడం వల్లనే వస్తాయి. వీలైనంతవరకు ఈ సీజన్‌లో బయటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది తాజాగా ఉన్న పండ్లు మాత్రమే తినాలి. నిల్వ ఉంచిన పండ్లు, సలాడ్స్ తినకూడదు జలుబు వచ్చినప్పుడు మీ బాబును మిగతా పిల్లలతో ఎక్కువగా కలవకుండా చూడండి. తరచూ వచ్చే జలుబు విషయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. ఆహారనియమాలు సక్రమంగా పాటించాలి అపరిశుభ్రమైన నీళ్లతో తడిసిన చేతులతో లేదా వర్షపు నీళ్లతో తడిసిన చేతులతో కళ్లను అంటుకోవద్దు. ఆ చేతులతో ముఖం మీద రుద్దుకోవడం వల్ల కళ్లకు, చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నీరు చెవుల్లోకి పోకుండా జాగ్రత్తపడాలి ఆరోగ్యకరమైన పోషకాహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచవచ్చు. దీనివల్ల చాలారకాల వైరల్ ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఇఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
చినుకుపడితే... చిన్నారికి జలుబే..
Published Mon, Jun 29 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement