కుండపోత
అకాల వర్షంతో ఊరట
నగరంలో 9 సెం.మీల వర్షం
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
భారీవర్షంతో విద్యార్థులకు ఇబ్బందులు
ఎంసెట్ కౌన్సెలింగుకు అంతరాయం
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
విశాఖపట్నం:మూడు రోజుల పాటు మండు వేసవిని తలపించిన వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం తెల్లారేసరికే ఆకాశమంతా కారుమబ్బులతో కమ్ముకుంది. చిమ్మచీకటి ఆవరించింది. సుమారు ఎనిమిది గంటల సమయానికి అకస్మాత్తుగా వర్షం కురవడం మొదలయింది. అలా నాలుగ్గంటలు నాన్‌స్టాప్‌గా దంచికొట్టింది. ఈ కుండపోత వర్షానికి నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లాయి. చెత్తా, చెదారం రోడ్లపై పరుగులు తీశాయి. మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులు హడావుడి చేశాయి. పిడుగులు పడేలాంటి శబ్దాలతో కాసేపు జనాన్ని భయపెట్టాయి. రైల్వే న్యూకాలనీ, జ్ఞానాపురం, చావులమదుం, వెలంపేట, పూర్ణామార్కెట్, రైల్వే స్టేషన్‌రోడ్డు, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. భోరున కురుస్తున్న వానకు వాహన చోదకులు ఎటు వెళ్లాలో తెలియనంత పద్మవ్యూహంలో చిక్కుకున్నారు.
మరోవైపు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే వారు వర్షంలో చిక్కుకున్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద జరిగే కౌన్సెలింగ్ కేంద్రానికి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. వర్షానికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో కాసేపు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఇక ఉదయమే వర్షం మొదలవడంతో విధుల్లోకి వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు, కూలీలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం మధ్యాహ్నం 12 గంటలకు తగ్గుముఖం పట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలో 9 సెం.మీల వర్షపాతం నమోదయింది. నాలుగు రోజుల క్రితం వేకువజామున కురిసిన వర్షపాతం కూడా 9 సెం.మీలే. అయితే తెల్లారేసరికే తగ్గిపోవడంతో జనానికి వర్షప్రభావం తెలియలేదు. కాగా ఈ భారీ వర్షం నగర పరిధిలోనే అధికంగా ఉంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే తప్ప భారీ వర్షం కురవలేదు.
మళ్లీ చల్లదనం..
మరోవైపు వరుసగా మూడు రోజులపాటు దడపుట్టించిన ఎండలతో జనం విలవిల్లాడారు. 36, 37 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం చల్లదనం పరచుకోవడంతో అంతా ఊరట చెందారు. వరసగా బుధ, గురువారాల్లో 36.4, 36.2 డిగ్రీలు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కసారిగా ఏడు డిగ్రీలకు తగ్గి 29.4కు పడిపోయింది. వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఫలితంగా చల్లదనం కొనసాగనుంది.
అలా మొదలైంది
ఎంసెట్ ఇంజినీరింగు కౌన్సెలింగు శుక్రవారం ఉదయంవిశాఖలోని రెండు కేంద్రాలలో ప్రారంభమైంది. ఆరంభానికి ముందే కుండపోతగా వాన కురిసింది. దీంతో కొంత అంతరాయం ఏర్పడింది. పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక తడిసి ముద్దయ్యారు. టెంట్‌లు వర్షానికి కూలిపోయి నీడనివ్వలేకపోయాయి. వర్షపు నీరు నిలిచిపోయి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.