‘చింతకింది’కి పతంజలి పురస్కారం | Chintakindi Srinivas Gets Patanjali Award | Sakshi
Sakshi News home page

‘చింతకింది’కి పతంజలి పురస్కారం

Published Fri, Mar 29 2019 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 12:48 AM

Chintakindi Srinivas Gets Patanjali Award - Sakshi

కళింగాంధ్ర కథ తీరే వేరు. దాని నడక, దాని తీవ్రత, దాని వెటకారం, దాని సామాజిక ఆదర్శం అన్నీ ప్రత్యేకమే. గుగ్గురువు గురజాడ నుంచి మొదలు పెట్టుకుంటే వర్తమానం వరకూ ఉత్తరాంధ్ర మట్టిలోనే ఏదో మహత్తు ఉన్నట్టుగా ఇక్కడి కథకులు చెలరేగిపోతుంటారు. చాసో, రావిశాస్త్రి, కారామాస్టారు, పతంజలి.. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎందరో మహానుభావులు. తెలుగు ప్రజల హృదయాల్లోకి వాస్తవికతలను బలంగా ప్రసారం చేసినవారు. రచనల ద్వారానే కాదు. సృష్టించిన పాత్రల ద్వారానూ వీరెప్పటికీ చదువరుల మనస్సుల్లో చిరస్థాయిగా కొలువై ఉంటారు. గురజాడ గిరీశాన్నీ, చాసో గవిరిని, రావిశాస్త్రి డోన్ట్‌ కేర్‌ మేస్టర్ని, కారామాస్టారి నూకరాజుని, పతంజలి గోపాత్రుణ్ణీ ఎవరయినా ఎలా మరచిపోగలం. కె.ఎన్‌.వై. పతంజలి రచనల విషయానికే వస్తే అవి మరీ విలక్షణమైనవిగా కళ్లకు కడతాయి. పత్రికా రచయితగా ప్రపంచాన్ని చూసిన అనుభవం ఆయనకు హెచ్చుగా కలిసివచ్చిందని అనిపిస్తుంటుంది.

లేకపోతే ఆయన కలం నుంచీ ‘ఖాకీవనం’, ‘పెంపుడు జంతువులు’ వంటి నవలలు వచ్చి ఉండేవి కావేమో. లోకానుభవాన్నీ స్వీయపరిశీలనతో కలగలిపి కల్వంలో నూరి రాయకపోతే పతంజలి గోపాత్రుడు మనల్ని పలకరించేనా? పతంజలి పిలక తిరుగుడు పువ్వు మనందరినీ చూసి నవ్విపోయేనా? అప్పుడెప్పుడో శ్రీశ్రీ రాసిన పాడవోయి భారతీయుడా.. పాట ఇప్పటి దేశస్థితిగతులకూ అతికినట్టుగా ఎలా సరిపోతుందో, అచ్చం అలాగే పతంజలి రచనలు కూడా కాలాతీతమై నేటికీ మన వ్యవస్థ నిజరూపాన్ని బట్టబయలు చేస్తుంటాయి. నాడు ఆయన రాసిన ‘దిక్కుమాలిన కాలేజీ’ ఇప్పటికీ మన దిక్కుమాలిన చదువులను గుర్తుచేస్తూనే ఉంది. ఆయన ‘చూపున్న పాట’ కథలో చిట్లిపోయిన పిల్లనగ్రోవి చిందించిన నెత్తురు పెను ప్రవాహమై సమకాలీన సమాజాన్ని వెక్కిరిస్తూనే ఉంది. అంతెందుకు! ఇరవైయ్యేళ్ల కిందట పతంజలి రాసిన ‘నీ మతం మండా..!’ కవిత భారతీయ సమాజంలో చిచ్చురేపుతున్న తాజా మతోన్మాదులకు గట్టి హెచ్చరిక.

విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న సుప్రసిద్ధ సాహిత్య సంస్థ కె.ఎన్‌.వై. పతంజలి సాంస్కృతిక వేదిక ప్రతీ ఏటా ఆయన జ్ఞాపకార్థం ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తుంటుంది. 2019కిగాను ఈ పురస్కారాన్ని ప్రసిద్ధ కథారచయిత డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుకు ప్రకటించారు. మార్చి 29 పతంజలి జయంతి. ఈ సందర్భంగా విజయనగరంలో సాంస్కృతిక వేదిక ప్రతినిధులు చింతకిందిని అవార్డుతో సత్కరించనున్నారు. కె.ఎన్‌.వై. పతంజలి వైయక్తిక, సాహిత్య జీవితచరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం చింతకింది మోనోగ్రాఫ్‌గా రాయడం చెప్పుకోదగ్గది. పతంజలి పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా శ్రీనివాసరావుకు అభినందనలు.
(నేడు కె.ఎన్‌.వై. పతంజలి జయంతి. ఈరోజు విజయనగరంలో పతంజలి పురస్కారాన్ని ప్రముఖ కథారచయిత చింతకింది శ్రీనివాసరావు అందుకుంటున్న సందర్భంగా)
ప్రయాగ సుబ్రహ్మణ్యం ‘ మొబైల్‌ : 80080 01350

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement