వానల్లో హాయ్‌ హాయ్‌ | choose special clothes for a short time | Sakshi
Sakshi News home page

వానల్లో హాయ్‌ హాయ్‌

Published Fri, Jul 13 2018 12:49 AM | Last Updated on Fri, Jul 13 2018 12:49 AM

 choose special clothes for a short time - Sakshi

వేసవి వేడి పరారయ్యింది. చల్లటి గాలులు.. అవి మోసుకువచ్చే వాన చినుకులు హాయిగాఉన్నా చిత్తడి నేలలో సరైన ఔట్‌ఫిట్‌ లేకపోతేమాత్రం చిరాకుగా ఉంటుంది. మబ్బులతో చిరుచీకట్లు కమ్మేసే వానకాలం ఎలాంటి దుస్తులుధరించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది.వేసవి వార్డ్రోబ్‌ని క్లోజ్‌ చేసి వానకాలానికే ప్రత్యేక మైన దుస్తులు ఎంచుకోవాల్సిన సమయం ఇది. 

సింథటిక్‌ కప్రీస్‌
వీటిలో పొట్టి, పొడుగు కప్రీస్‌ ఉన్నాయి. వేసవిలో వాడిన కాటన్, డెనిమ్‌ కప్రీస్‌ను ఈ సీజన్‌లోనూ ధరించవచ్చు. అయితే ఇవి తడిస్తే ఆరాలంటే ఎక్కువ టైమ్‌ పడుతుంది. దీనికి బదులుగా సింథటిక్‌ కప్రీస్, పలాజో, నీ లెంగ్త్‌ ట్రౌజర్స్‌ ఈ కాలానికి అనువైనవి.

వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్స్‌
ఏ కాలమైన వెంట హ్యాండ్‌ బ్యాగ్‌ ఉండాల్సిందే. అయితే, మిగతాకాలాలలో వాడినట్టు కాటన్, లెదర్‌ బ్యాగులు వాడితే లోపల ఉండే వస్తువులను తడవకుండా ఉంచలేం. పైగా బ్యాగ్‌ కూడా పాడైపోతుంది. ఈ సమస్య రాకుండా వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్స్, బ్యాగ్‌–ప్యాక్స్‌ సరైన ఎంపిక. మొబైల్‌ కవర్స్, వాలెట్‌ వంటివి వాటర్‌ప్రూఫ్‌వి ఎంచుకోవాలి. ఇవి కూడా మంచి బ్రైట్‌కలర్స్, ఫ్లోరల్‌ డిజైన్స్‌ అయితే కాలానుగుణంగా ఉంటాయి. నైలాన్‌ లేదా ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు వాడితే ట్రెండ్‌లో ఉన్నారనే కితాబులే పొందుతారు. వస్తువులూ సురక్షితం,  

రెయిన్‌కోట్స్‌
ఈ సీజన్‌కి 3డి గ్రాఫిక్‌ ఎఫెక్ట్‌ ఉన్న రెయిన్‌ కోట్స్‌ లభిస్తున్నాయి. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల మీరేం దుస్తులు ధరించారో బయటకు కనిపిస్తుంది. ప్లాస్టిక్‌ ట్రెంచ్‌ కోట్స్‌ కూడా మంచి ఎంపిక. ఇవి మీ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ని దాచిపెట్టవు. బెలూన్‌ రెయిన్‌ కోట్స్, రెయిన్‌ పాంచోస్‌ కూడా నియాన్‌ షేడ్స్‌లో లభిస్తున్నాయి.

రెయిన్‌ బూట్స్‌/ఫ్లిప్‌ఫ్లాప్స్‌
ఇవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నవే. కానీ, రెయిన్‌ సీజన్‌కి ఎవర్‌గ్రీన్‌ కూడా ఇవే! ఎక్కువ కాలం మన్నుతాయి. బురద, నీటి నుంచి రక్షణగా ఉంటాయి. వీటి గురించి మరో ఆలోచన చేయకుండా  ఈ సీజన్‌లో ధరించవచ్చు. అలాగే, జెల్లీ ఫ్లాట్స్, ఫంకీ ఫ్లిప్‌ ఫ్లాప్స్‌ ఈ కాలం మీ పాదాలు మెచ్చే స్నేహితులు.

రంగు రంగుల మడతల గొడుగులు
ఈ కాలం తప్పనిసరి అవసరంమున్న వస్తువు గొడుగు. అది అవసరం మాత్రమే కాదు, ఫ్యాషన్‌ యాక్ససరీ కూడా! గొడుగు అనగానే మనకు నల్లని రంగులో ఉండేదే కనిపిస్తుంది. కానీ, వీటిలో ఎన్నో మోడల్స్, కలర్స్, ప్రింట్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్సపరెంట్, చూడముచ్చటైన ప్రింట్లు, ముదురు రంగులు, మూడు మడతలుగా ఉండే గొడుగులు ఈ సీజన్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి.

ఫంకీ యాక్ససరీస్‌
రంగు రంగుల ప్లాస్టిక్‌ బ్యాంగిల్స్, పూసల బ్రేస్‌లెట్లు, గొలుసులు డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేస్తాయి. మోడ్రన్‌ దుస్తుల మీదకు ఫంకీగా ఉండే ఈ అలంకరణ ఆభరణాలు మరింత అందాన్ని పెంచుతాయి. మెటల్‌ స్టికర్స్‌ నీళ్లలో తడిచినా ఇబ్బంది ఉండదు.

వాటర్‌ మేకప్‌
నీళ్లలో పదే పదే తడిచే అవకాశం ఉండే ఈ కాలం మేకప్‌కి దూరంగా ఉండటం బెస్ట్‌. మేకప్‌ తప్పనిసరి అనుకుంటే మాత్రం వాటర్‌ఫ్రూఫ్‌ మేకప్‌ బ్రాండ్స్‌ని ఎంచుకోవాలి. 

ఫేస్‌వైప్స్‌
వేసవిలో చెమట అద్దడానికి వీటిని ఉపయోగించి ఉంటారు. ఈ కాలం ముఖం మీద పడిన నీటి తుంపరలను తొలగించడానికి వాడాలి. మేకప్‌లో ఉన్నప్పుడు వీటి అవసరం ఎక్కువ. 

మొబైల్‌ కవర్స్‌
నీటిలో తడిచినా పాడవకుండా ఫోన్‌కి కూడా రెయిన్‌ గేర్‌ అవసరం. అయితే, ఈ కవర్స్‌ కూడా ధరించిన డ్రెస్‌కు కాంబినేషన్‌ కవర్స్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement