వేళ్ల కొసన చిత్రధనసు!
‘‘ఖాళీ సమయంలో కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తారు?’’ అని అడిగితే-
‘‘నచ్చిన పుస్తకం చదువుతాం’’
‘‘నచ్చిన సినిమా చూస్తాం’’
‘‘నచ్చిన సంగీతం వింటాం’’ ఇలా రకరకాల ‘నచ్చిన’లు వినిపిస్తాయి.
యమౌక(జపాన్)కు మాత్రం సకల ఇష్టాలు ‘చిత్రకళ’లోనే దర్శనమిస్తాయి. ఆయన వినియోగించే ఐపాడ్ మినీ ‘ఆర్ట్ స్టూడియో’గా మారింది మరి! ఒసాక యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకున్న యమౌక తన ఐఫోన్, ఐప్యాడ్ మినీల ద్వారా అద్బుతమైన ఫింగర్ పెయింటింగ్ పోర్ట్రేట్స్‌ను సృష్టించడంలో నైపుణ్యం సాధించాడు. యాప్ ‘ఆర్ట్ స్టూడియో’ దీనికి ఉపయోగపడింది.
చిత్రమేమిటంటే ఆ చిత్రాలు ఆయిల్, ఆక్రిలిక్‌లో చిత్రించినట్లుగా ఉంటాయి.
జపాన్‌లోని సకైలో నివసించే యమౌక తన వీడియోల ద్వారా ‘ఇంటర్నెట్ సెన్సేషన్’ అనిపించుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకున్న యమౌక ‘ఆర్ట్’ను కెరీర్‌గా మలుచుకోలేదు. వేరే ఏదో ఉద్యోగంలో చేరిపోయాడు. ఇంట్లో బొమ్మలు వేయడానికి టైం ఉండేది కాదు. ఆఫీసులో వేయడం కుదరదు కదా! అందుకే లంచ్ టైంలో తన ఐపాడ్ మీద బొమ్మలను సృష్టించేవాడు. సొంతంగా చిత్రించినవే కాకుండా... ప్రసిద్ధ చిత్రాలకు ‘నకలు’ సృష్టించడం ద్వారా ‘భేష్’ అనిపించుకున్నాడు.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఐపాడ్ మినీ లేదా ఐపాడ్ టచ్ ద్వారా చిత్రాలు రూపొందిస్తాడు. తరచుగా బయటి ప్రాంతాలకు ప్రయాణించే యమౌక తన అనుభవంలోకి వచ్చిన వివిధ దృశ్యాలను అందమైన డిజిటల్ పెయింటింగ్స్‌గా చిత్రిస్తాడు. దీనికి సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మరి యమౌక సహజసిద్ధమైన కాన్వాస్‌కు ముఖం ఎందుకు చాటేస్తున్నాడు?
అదేమీ కాదు. వాటర్ కలర్ పోర్ట్రేట్స్ అద్భుతంగా వేస్తాడు. దీనికి ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానలే సాక్ష్యం!