Finger Painting
-
ఇట్టే దొరికిపోతారు!
అల్లాదుర్గం(మెదక్): గతంలో నేరస్తుల వేలిముద్రలు తీసుకొనేవారు.. నేడు నేరస్తుల వేలిముద్రలను ఫింగర్ ప్రింట్ (లైవ్) స్కానర్ సహాయంతో కంప్యూటర్లో భద్రపరుస్తున్నారు. హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానర్‌తో సేకరిస్తున్నారు. మళ్లీ ఇదే నేరస్తులు ఎక్కడైనా నేరాలు చేస్తే ఫింగర్ ప్రింట్ ఆధారంగా వారి బయోడేటా పూర్తిగా తెలుస్తుంది. అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. అల్లాదుర్గం సర్కిల్ పరిధిలో టేక్మాల్, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. సర్కిల్ పోలీస్‌స్టేషన్ కావడంతో అల్లాదుర్గంలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు చేశారు. సర్కిల్ పరిధిలో ఎక్కడైనా నేరస్తులు పట్టుబడితే వేలిముద్రలను స్కాన్ చేసి కంప్యూటర్లో భద్రంగా ఉంచేలా ఏర్పాటు చేశారు. వేలిముద్రలు తీసుకున్న నేరస్తులు దేశంలో ఎక్కడా నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వారి పూర్తి వివరాలు తెలియడంతో సులువుగా నేరస్తులను పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో నమోదు.. ఎలాంటి నేరాలు చేసినా నేరస్తుల వేలిముద్రలే పట్టిస్తాయి. వారి వేలిముద్రలు భద్రపర్చేందుకు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేశాం. అత్యాచారం, హత్య, హత్యాయత్నం, దొంగతనాలు, దోపిడీలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానింగ్ చేసి ఆన్లైన్లో భద్ర పరుస్తున్నాం. అలాగే స్కాన్ చేసేటప్పుడు వారి ఆధార్‌కార్డు, నివాసం, జిల్లా, రాష్ట్రం పేర్లు నమోదు చేస్తున్నాం. నేరస్తులు ఏ రాష్ట్రంలో నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వెంటనే పట్టుకుంటాం. ఇటీవల గడిపెద్దాపూర్‌లో హత్యాయత్నం చేసిన బుడ్డాయిపల్లికి చెందిన నేరస్తుల వేలిముద్రలను స్కాన్ చేసి అన్లైన్లో నమోదు చేశాం. – మోహన్‌రెడ్డి, ఎస్ఐ -
మునివేళ్ల సృష్టి
అందమైన చిత్రాలను సున్నితమైన బ్రష్‌తో తీర్చిదిద్దుతారు. కానీ, కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వినీ వేణుగోపాల్ తన మునివేళ్లతో అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కు పైగా చిత్రాలను బ్రష్ లేకుండా వేళ్లతోనే ‘గీసిన’ వినీని పరిచయస్తులందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ప్యాలెస్ చేరిన చిత్రం రంగులను అద్దుకున్న వేళ్లు తెల్లని కాన్వాస్ పైన కదులుతూ ఒక మంచి చిత్రంగా ప్రాణం పోసుకునే కళలో మూడేళ్లుగా రాణిస్తున్నారు వినీ. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో ఉంటున్నారు. భర్త అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఏడాదిన్నర కొడుకు. పేరు గెహాన్. వాడిని ఆడించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు వినీ. ‘ఆ ప్రయోగాల ఫలితమే ఇది’ అంటూ ఇటీవల రియాద్‌లోని నైలా ఆర్ట్ గ్యాలరీలో తన వేలి చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన సౌదీ రాజు అమిర్ మహమ్మద్ బిన్ సల్మాన్ చిత్రం ఇప్పుడు అక్కడి ప్యాలెస్‌లో చేరింది! కొడుకు ఆటకు రంగులు వినీ చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌లో తన ప్రతిభ కనబరిచేది. అయితే, ఫింగర్ పెయింటింగ్ మాత్రం మూడేళ్ల నుంచే వేస్తున్నారు ఆమె. ఆసక్తి కొద్ది తనకు తానే సాధన చేసిన వినీ ఇప్పుడు ఈ వర్క్‌లో బిజీగా మారిపోయారు. తన కొడుకు ఆట కోసం మైదా, అందులో కొన్ని ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొడుకుతోపాటూ తనూ కొత్త కొత్త నమూనాలు తయారు చేశారు. అక్కణ్ణుంచే వేళ్లతో పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి, ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వాటర్ కలర్స్, ఆక్రిలిక్, పేస్టల్ కలర్స్‌తో అందమైన కొలను, సముద్రం ఒడ్డున పిల్లలు కట్టే ఇసుక గూళ్లు.. ఇలా ఏదో ఒకదాన్ని ఆ పెయింటింగ్‌లో ప్రధాన అంశంగా తీసుకుంటారు వినీ. కర్ణాటకలో జరిగే కంబాల బఫెలో రేస్, భయంకరమైన వన్యమృగాల వేట, ఆటలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె తన వేళ్లతో ప్రాణం పోశారు. సౌదీలో ఉండటం వల్ల కావచ్చు.. వినీ చిత్రాల్లో ఎక్కువగా అరేబియన్ జీవన శైలి కనిపిస్తుంది. లాంతరు చేతిలో పట్టుకున్న అరబిక్ మహిళ, ఒంటెల సవారీ, ఎడారి, ఖర్జూర చెట్లు, కాక్టస్ మొక్కలు.. ఇలా ఎన్నో ప్రకృతి నేపథ్యాలు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. 2017లో బహ్రెయిన్‌లో జరిగిన త్రీడీ పెయింటింగ్‌లో గిన్నిస్ రికార్డ్‌ను, 2018లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డులను పొందారు వినీ. ఎంచుకున్న కళతో ఓ కొత్త దారి వేసుకుంటూ వినీ తనప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. – ఆరెన్నార్ -
‘వేలిముద్రలతో మృతదేహాలను గుర్తించలేం’
న్యూఢిల్లీ: కేవలం వేలిముద్రలను ఉపయోగించి గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కోవడం అసాధ్యమని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది. మృతదేహాల వేలిముద్రలను మాత్రమే ఉపయోగించి 120 కోట్ల మందిలో ఆ వేలిముద్రలు ఎవరివో గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద లేదంది. ఒక వ్యక్తి ఆధార్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే.. ఆ ఆధార్‌కు అనుసంధానమై ఉన్న వేలి ముద్రలు ఆ వ్యక్తివేనా? కాదా? అన్నది తెలుసుకోవచ్చని చెప్పింది. గుర్తు తెలియని మృతదేహాల వివరాలను కనుక్కునేందుకు ఆధార్‌ను ఉపయోగించేలా ప్రభుత్వాలు, దర్యాప్తు సంస్థలను ఆదేశించాలంటూ ఓ న్యాయవాది వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వివరాలను యూఐడీఏఐ కోర్టుకు తెలిపింది. -
వేళ్ల కొసన చిత్రధనసు!
‘‘ఖాళీ సమయంలో కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తారు?’’ అని అడిగితే- ‘‘నచ్చిన పుస్తకం చదువుతాం’’ ‘‘నచ్చిన సినిమా చూస్తాం’’ ‘‘నచ్చిన సంగీతం వింటాం’’ ఇలా రకరకాల ‘నచ్చిన’లు వినిపిస్తాయి. యమౌక(జపాన్)కు మాత్రం సకల ఇష్టాలు ‘చిత్రకళ’లోనే దర్శనమిస్తాయి. ఆయన వినియోగించే ఐపాడ్ మినీ ‘ఆర్ట్ స్టూడియో’గా మారింది మరి! ఒసాక యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకున్న యమౌక తన ఐఫోన్, ఐప్యాడ్ మినీల ద్వారా అద్బుతమైన ఫింగర్ పెయింటింగ్ పోర్ట్రేట్స్ను సృష్టించడంలో నైపుణ్యం సాధించాడు. యాప్ ‘ఆర్ట్ స్టూడియో’ దీనికి ఉపయోగపడింది. చిత్రమేమిటంటే ఆ చిత్రాలు ఆయిల్, ఆక్రిలిక్లో చిత్రించినట్లుగా ఉంటాయి. జపాన్‌లోని సకైలో నివసించే యమౌక తన వీడియోల ద్వారా ‘ఇంటర్నెట్ సెన్సేషన్’ అనిపించుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకున్న యమౌక ‘ఆర్ట్’ను కెరీర్‌గా మలుచుకోలేదు. వేరే ఏదో ఉద్యోగంలో చేరిపోయాడు. ఇంట్లో బొమ్మలు వేయడానికి టైం ఉండేది కాదు. ఆఫీసులో వేయడం కుదరదు కదా! అందుకే లంచ్ టైంలో తన ఐపాడ్ మీద బొమ్మలను సృష్టించేవాడు. సొంతంగా చిత్రించినవే కాకుండా... ప్రసిద్ధ చిత్రాలకు ‘నకలు’ సృష్టించడం ద్వారా ‘భేష్’ అనిపించుకున్నాడు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఐపాడ్ మినీ లేదా ఐపాడ్ టచ్ ద్వారా చిత్రాలు రూపొందిస్తాడు. తరచుగా బయటి ప్రాంతాలకు ప్రయాణించే యమౌక తన అనుభవంలోకి వచ్చిన వివిధ దృశ్యాలను అందమైన డిజిటల్ పెయింటింగ్స్‌గా చిత్రిస్తాడు. దీనికి సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. మరి యమౌక సహజసిద్ధమైన కాన్వాస్‌కు ముఖం ఎందుకు చాటేస్తున్నాడు? అదేమీ కాదు. వాటర్ కలర్ పోర్ట్రేట్స్ అద్భుతంగా వేస్తాడు. దీనికి ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానలే సాక్ష్యం!