ప్రేమలు పూసిన తోట!
ఛాయాచిత్రం
‘కవిత్వాన్ని తూచడానికి నా దగ్గర రాళ్లు లేవు’ అన్నారు చలం. ప్రేమను కొలవడానికి మాత్రం ఏమున్నాయి? ‘ఏమీ లేవు’ అనుకుంటాంగానీ...ఒక మంచి కవిత చదివినప్పుడో, ఒక ఛాయాచిత్రాన్ని చూసినప్పుడో ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలను తూచడానికి...అవి కాస్తో కూస్తో ప్రతిభను చాటుకున్నాయి అని మాత్రం అనిపిస్తుంది.
ఇంగ్లండ్‌కు చెందిన ఒక వెబ్‌సైట్ ‘ఎ హార్మనీ లవ్ క్యాప్చర్డ్ కాంటెస్ట్’కు ఎన్నికైన పది ఫొటోలు గుండెలో పదిల పరుచుకునేలా ఉన్నాయి. నలుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం విజేతలను నిర్ణయించింది. ఈ బృందంలో ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లతో పాటు అనుబంధాల లోతు తెలిసిన మానసిక నిపుణులు కూడా ఉన్నారు. లీ జెఫ్రీ తీసిన ‘వుయ్ హ్యావ్ వాక్‌డ్ ఏ లాంగ్ వే టుగెదర్’ ఛాయాచిత్రం ‘విన్నింగ్ ఫొటోగ్రాఫ్’గా నిలిచింది. నాలుగో స్థానంలో నిలిచిన సమంతా మిల్లర్ ‘లవ్ టైమ్’లో గొప్ప తమాషా ఉంది. అందుబాటులో ఉండే వస్తువులతో కూడా అపురూపమైన భావాలను చాటవచ్చునని చెప్పిన ఫొటో ఇది.
‘‘ఒక్కమాటలో చెప్పాలంటే ఫొటోగ్రఫీ అనేది నా ప్రపంచం. బహుమతి గెలుచు కోవడం గొప్ప గుర్తింపు అనుకుంటున్నాను’’ అని సంతోషపడుతున్న సమంత... సింపుల్ ఐడియాతో బహుమతి గెలుచుకున్నారు. ఈ ఫొటో షూట్ కోసం తన బాయ్‌ఫ్రెండ్ షూ దొంగిలించి, దానికి తన షూ జత చేసి క్లిక్ అనిపించారట! చెల్లి ప్రేమను ముద్దొచ్చేలా ఫొటో తీశారు జోలంట. ఒలఫ్, ఆస్కార్ అనే సోదరులు తమ చెల్లిని ముద్దాడుతున్న దృశ్యం ఎంత ముద్దొచ్చేలా ఉందో కదా!