
యూరప్‌ను చలి వణికించేస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికాలలోనూ అసాధారణ రీతిలో మంచు కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావమని చాలామంది అంచనా వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విపరీత ధోరణులకు, వాతావరణ మార్పులకూ సంబంధం లేకపోవచ్చునని.. సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాల్లో వచ్చిన మార్పులు కారణమని అధ్యయన పూర్వకంగా తేల్చారు. భూమి మీద సకల జీవరాశులకూ వెలుతురునిచ్చే సూర్యుడిపై అప్పుడప్పుడూ పేలుళ్లు జరుగుతూంటాయని.. పదకొండేళ్లకు ఒకసారి ఈ క్రమంలో మార్పులు వస్తాయని మనకు తెలుసు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సూర్యుడిపై కార్యకలాపాలు మందగతికి చేరుకున్నాయని.. ఫలితంగా ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో కొంచెం వెచ్చదనం ఏర్పడగా యూరేసియా ప్రాంతంలో మంచు కురుస్తోందని ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు.
భూతాపోన్నతితోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ సూర్యుడి ప్రభావాన్ని మాత్రం వేరుగా స్పష్టంగా గమనించవచ్చునని ఇంద్రాణి తెలిపారు. సూర్యుడిపై పేలుళ్ల కారణంగా ఏర్పడే మచ్చలు సాధారణం కంటే తక్కువైనప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో వెచ్చదనం దిగువ స్ట్రాటోస్ఫియర్ నుంచి ఎగువకు విస్తరిస్తుందని, మచ్చలు సగటు కంటే ఎక్కువగా ఉంటే ఆర్కిటిక్ ప్రాంతంలో శీతల పరిస్థితులు ఏర్పడతాయని ఇంద్రాణి వివరించారు. ఈ పేలుళ్ల కారణంగా సూర్యుడి నుంచి అందే అతినీలలోహిత కిరణాల సామర్థ్యంలో మార్పులు వస్తాయని, ఇది కాస్తా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని చాలాకాలంగా బలమైన అంచనాలు ఉన్నాయి.