
విప్లవంతో మార్పు వస్తుంది. మార్పుతో ‘విప్లవం’ తెస్తున్నాయి కమర్షియల్ యాడ్స్! మా ప్రాడక్ట్ ఇదీ, దాని గొప్పతనం ఇదీ.. అని కంపెనీలేవీ నేరుగా ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోవడం లేదు. ముందు గుండె తలుపుల్ని తట్టి.. ఆ తర్వాతే ఇంటి తలుపుల్ని తడుతున్నాయి. ‘టచ్’ చేసే ఐడియాలతో యాడ్స్ చేయించి మార్కెట్‌లో కన్నా ముందు, మనసుల్లోకి చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. టముకు టమారంలా ఊదరగొట్టేయకుండా.. టచ్చి టమారంలా గుండెకు హత్తుకుపోతున్నాయి.
మీరు ఈ యాడ్ చూసే ఉంటారు. ‘‘నాన్నా’’ అంటూ అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది ఓ కూతురు. ‘‘ఏంటమ్మా’’ అంటాడు గాభరాపడుతూ తండ్రి.‘‘నేహా (ఫ్రెండ్) వాళ్లింట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పాను.. నిద్ర రావట్లేదు’’ అంటుంది. తండ్రి వైపు నుంచి నిశ్శబ్దం. ‘‘ఫ్రెండ్స్‌తో కలిసి ఔటింగ్‌కు వచ్చా నాన్నా’’ అని నిజం చెప్తుంది. కాసేపటి మౌనం తర్వాత తండ్రి అంటాడు‘‘నిజం చెప్పావు కదా.. ఇప్పుడు నిశ్చింతంగా నిద్రపో’’ అని. బొట్టు బొట్టులో స్వచ్ఛత అంటూ ఓ ప్రసిద్ధ కంపెనీ.. వాటర్ కోసం చిత్రీకరించిన తండ్రీ, కూతుళ్ల
అనుబంధపు యాడ్ ఇది.
ఆ కంపెనీవాళ్ల ముఖ్య ఉద్దేశం నీళ్లను అమ్ముకోవడమే. అవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూపించడానికి.. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని.. చిన్న అబద్ధంతో వమ్ము చేయకూడదని కూతురు పడే ఆరాటాన్ని తన ప్రొడక్ట్‌కు జోడించి మార్కెట్‌లోకి వదిలింది ఆ వ్యాపార సంస్థ! ఇదొక్కటే కాదు.. నూనెల దగ్గర్నుంచి జిల్లెట్ దాకా, కాస్మోటిక్స్ నుంచి కాస్ట్యూమ్స్ దాకా, వాషింగ్ మెషీన్స్ నుంచి వజ్రాల దాకా అన్నిటినీ అమ్మి పెడుతున్నవి ఇప్పుడు మానవ సంబంధాలే! కాలం మారింది. కమర్షియల్సూ (వాణిజ్య ప్రకటనలు) మారాయి.
మరి మేమెప్పుడు రావాలి?
పెళ్లి చూపులకు కూతురు అన్యమనస్కంగా రెడీ అవుతుంటుంది. అవతల అబ్బాయి వాళ్లు వచ్చి వెయిట్ చేస్తుంటారు. ‘‘ఇంకా రెడీ కాలేదా? త్వరగా కానియ్’’ అంటాడు తండ్రి లోపలికి వచ్చి. ‘‘రెండు సమోసాలు పెట్టి పెళ్లికొడుకును ఎలా అంచనా వేసుకోవాలి నాన్నా?’’ అంటూ ప్రశ్నిస్తుంది తండ్రిని. తండ్రి పట్టించుకోడు. నిట్టూరుస్తూ ఆయన వెనకాలే వెళ్లి అబ్బాయి వాళ్ల ముందు కూర్చుంటుంది. సమోసాలు తిని, టీ తాగుతూ ‘‘అమ్మాయి మాకు బాగా నచ్చింది. సంబంధం ఖాయం చేసేసుకోండి’’ అంటుంది పెళ్లి కొడుకు తల్లి.
అమ్మాయి కళ్లల్లో దిగులు. ‘‘మరి మీ అబ్బాయిని చూసుకోవడానికి మీ ఇంటికి ఎప్పుడు రావాలి’’ అంటాడు అమ్మాయి తండ్రి! అమ్మాయితో సహా అందరూ అవాక్కవుతారు. ‘‘అబ్బాయి ఇక్కడే ఉన్నాడుగా’’ అంటుంది అబ్బాయి తల్లి. ‘‘మా అమ్మాయికి ఏం వచ్చో.. ఏం రాదో మా ఇంటికి వచ్చి తెలుసుకున్నారు కదా.. మరి మా అమ్మాయిక్కూడా తెలియాలి కదా.. మీ అబ్బాయికి వంటొచ్చా.. ఇంటి పని చూసుకోగలడా అని’’ అంటాడు.
అమ్మాయి కళ్లల్లో తండ్రి పట్ల ఆరాధన. ‘‘మావాడికి వేణ్ణీళ్లలో మ్యాగి వేసి ఉడికించడం మాత్రమే తెలుసు’’ అంటూ గట్టిగా నవ్వేస్తుంది తల్లి. అమ్మాయి మనసు అర్థమవుతుంది అబ్బాయికి. ‘‘ఒక పది రోజులు ఆగి మా ఇంటికి రండి నన్ను చూసుకోవడానికి. అప్పటికి అన్నీ నేర్చుకుంటాను’’ అంటాడు అబ్బాయి. అమ్మాయితో సమానంగా అబ్బాయి కూడా ఇంటి బాధ్యతను పంచుకోవాలని చెప్పే యాడ్ ఇది.
తను కష్టంగా చేయట్లేదు
అమ్మా నాన్నా... కొడుకు కాపురం చూడ్డానికి వస్తారు. రాత్రవుతుంది. కోడలు ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాదు. పెద్దవాళ్లకు లేట్ అవుతుందని... కొడుకు వాళ్లతో కలిసి డిన్నర్ చేస్తుంటాడు. ‘‘రోజూ ఇలా ఆలస్యమవుతుందా?’’ అడుగుతారు కోడలి గురించి తల్లిదండ్రులు. ‘‘లేదు నాన్నా...తనకు పని ఎక్కువున్నప్పుడు లేట్ అవుతుంది’’అని సమాధానమిస్తాడు కొడుకు.
వీళ్లు ఇలా మాటల్లో ఉండగానే కోడలు వస్తుంది. తను డైనింగ్ హాల్లో అడుగుపెట్టబోతుంటే వినిపిస్తుంది.. ‘‘నీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా.. ఇంకా తను ఉద్యోగం చేయడం ఎందుకు? ఈ కష్టం ఎందుకు?’’ అని ప్రశ్నిస్తుంటాడు తండ్రి. ‘‘నాన్నా.. తను ఇది కష్టంగా చేయట్లేదు. తనకు ఇష్టం’’అంటాడు కొడుకు. కోడలి పెదవుల మీద చిరునవ్వు.
మ్యాట్రిమొనీలో తామిద్దరు పరిచయం అయినప్పుడు... అభిరుచులు కలిసి, సంబంధం ఖాయమవుతున్నప్పుడు చెప్తుంది ఆమె. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తానని. ఆమెను అర్థం చేసుకుంటాడు. ఆమె అభిప్రాయాన్ని అలా గౌరవిస్తుంటాడు భర్త. ‘‘మిమ్మల్ని అర్థంచేసుకున్న వాళ్లనే మీతో కలుపుతాం’’ అంటూ వచ్చే ఓ మాట్రిమోనియల్ యాడ్ అది.
‘తియ్యని’ అత్తాకోడళ్లు
కాలనీలో బారాత్ వెళ్తుంటుంది. చాక్‌లెట్ తింటూ ఆ మ్యూజిక్‌కు కాళ్లను కదుపుతూ కోడలు బాల్కనీలోంచి బారాత్‌ను చూస్తుంటుంది. అత్త వచ్చి పక్కనే నిలబడుతుంది. అత్తను చూడగానే పవిట సరిచేసుకొని తింటున్న చాక్‌లెట్ లోంచి కొంచెం విరిచి అత్తగారికి ఆఫర్ చేస్తుంది. గంభీరంగానే ఆ చాక్‌లెట్ తీసుకొని చప్పరిస్తూ తనూ ఆ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తుంటుంది. కట్ చేస్తే.. అత్తాకోడళ్లు ఇద్దరూ కిందికి వెళ్లి బారాత్‌లో తీన్‌మార్ డ్యాన్స్ చేస్తుంటారు. బంధాలను తీపిగా ఉంచుతుంది అని చూపించే చాక్‌లెట్ యాడ్ ఇది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, వ్యాపార సూత్రాలు కూడా! ఆయా సంస్థలన్నీ సమాజం మారాలనే ఉదాత్తమైన భావనతో ఈ యాడ్స్‌ను తీయలేదు. కేవలం తమ ఉత్పత్తులు జనాల్ని ఆకర్షించాలనే తీసాయి.. తీస్తాయి కూడా. అయితే పనిలో పనిగా మానవ సంబంధాలను మెరుగు పరిచే విధంగానూ వాటిని మలుస్తున్నాయి. ఇది మంచి పరిణామం.
నీకోసం కాదు.. మనిద్దరి కోసం
ఒక యాడ్‌లో... భార్య ప్రెగ్నెంట్ అని తెలియగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సింగపూర్ వెళ్లే పని ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటాడు భర్త. అంతేకాదు, ఎప్పుడూ టైమ్‌కి రాని వ్యక్తి.. చెప్పిన టైమ్‌కు వస్తాడు. భార్య కూడా వర్కింగ్ ఉమనే అయినా ఆమె ఇంటికి రాగానే కాఫీ అంటూ ఎప్పుడూ ఆర్డర్ వేసే అతను తనే ఈసారి స్వయంగా కాఫీ కలిపి భార్యకు ఇస్తాడు.
రాత్రి తనే స్వయంగా వండిపెడ్తాడు. అలారమ్ పెట్టుకొని మరీ భార్యకు ఆహారం ఇస్తుంటారు. ‘‘ఇదంతా నేను ప్రెగ్నెంట్ అని చేస్తున్నావ్ కదా’’ అని అడుగుతుంది భార్య. ‘‘కాదు.. వి ఆర్ ప్రెగ్నెంట్ అని.. మన కోసం చేస్తున్నా..’’ అంటాడు అతను. మగవాళ్ల ఆలోచనా ధోరణిని మార్చే మరో యాడ్ ఇది.
– శరాది