లైసెన్స్ రాజ్ ఆన్‌లైన్ రాజ్
వాణిజ్య భారతం
‘‘ఎంత అప్పు తీసుకోవాలో... ఎన్ని షేర్లు ఏ రేటుకివ్వాలో నేను నిర్ణయించలేను. బోనస్, డివిడెండ్, ఆఖరికి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు ఎంత జీతమివ్వాలో కూడా నేను నిర్ణయించలేను. ఎందుకంటే వాటన్నిటికీ ప్రభుత్వం అనుమతి కావాలి’’
– జేఆర్‌డీ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు
ఇష్టమైనవారంతా ‘జే’గా పిలిచే జేఆర్‌డీ మాటలు వింటే చాలు. స్వాత్రంత్యం వచ్చిన తొలినాళ్లలో మన ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ఇట్టే అర్థమయిపోతాయి. ఎందుకంటే డిమాండ్ ఉండి... మరిన్ని వాహనాలు కావాల్సి ఉన్నా... ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉన్నా... ఉత్పత్తి పెంచాలంటే మాత్రం కంపెనీకి లైసెన్సు కావాలి. వెయ్యి స్కూటర్లు ఉఉ్పత్తి చేసే కంపెనీ మరో వెయ్యి ఉత్పత్తి చేయాలంటే... దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అదీ... తొలినాళ్లలో మన లైసెన్స్ రాజ్!!. ఏ ఉత్పత్తికైనా ఇదే పరిస్థితి.
‘‘జే! నాతో ఎప్పుడూ లాభం గురించి మాట్లాడొద్దు. అదో పనికిమాలిన మాట’’– ఒకానొక సందర్భంలో ప్రభుత్వ కంపెనీలు కూడా లాభాల్లోకి రావాలని జేఆర్‌డీ టాటా సూచించినపుడు తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి.
ఈ మాటలు చూస్తే... లైసెన్స్ రాజ్ ఎందుకన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అప్పట్లో భారీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలపై ఏకకాలంలో దృష్టిపెట్టింది. భారీ పరిశ్రమలు వీలైనన్ని రావాలని, వాటిద్వారా సాధ్యమైనంత మందికి ఉపాధి దొరకాలన్నది ప్రభుత్వ సంకల్పం. మరి ఒకే కంపెనీ భారీగా ఉత్పత్తి చేసి డిమాండ్‌ను తీర్చేస్తే మిగిలిన కంపెనీలు ఏం చేస్తాయి? ఈ ఉద్దేశంతోనే లాభాల ఊసు పక్కనబెట్టి కంపెనీల ఉత్పత్తిని నియంత్రించిందన్నది ఆర్థిక నిపుణుల మాట.
కాలం ఒక్కో అడుగూ వేస్తూ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే... ఈ 70 ఏళ్లలో ఎన్నెన్నో పరిణామాలు. 1950ల మధ్యలో... బ్యాంకుల నుంచి భారీ ప్రయివేటు సంస్థలన్నీ జాతీయమయ్యాయి. అంటే! ప్రభుత్వ పరమయ్యాయి. ఆ చర్యలతో ఇండియావైపు చూడటానికే విదేశీ సంస్థలు భయపడ్డాయి. పాతికేళ్ల కిందటి వరకూ ఇదే పరిస్థితి. 1991లో అప్పటి ప్రధాని, ఆర్థికవేత్త పీవీ నరసింహరావు హయాంలో కీలక ఆర్థిక సంస్కరణలకు తెర తీయటంతో... విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం మళ్లీ మొదలయ్యింది. చాలావరకూ పెట్టుబడులు ఆటోమేటిక్ రూట్లోనే అనుమతి పొందే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఫలితం... టెలిఫోన్ల కోసం, వాహనాల కోసం, గ్యాస్ సిలెండ్ల కోసం ఏళ్లకేళ్లు వేచి చూసే పరిస్థితి తప్పిపోయింది. అడిగిన వెంటనే కంపెనీలు ఎగబడి మరీ టెలిఫోన్లు, వాహనాలు, గ్యాస్ సిలెండర్లు సమకూర్చే మార్కెట్ ఆధారిత వ్యవస్థ సాకారమయ్యింది. అంతేకాదు!! అనూహ్యంగా వచ్చిన డిజిటల్ విప్లవంతో కంపెనీల చెంతకు తిరగాల్సిన పరిస్థితీ తప్పింది. ఇంట్లో కూర్చుని కంప్యూటర్లోనో... ప్రయాణంలో ఉండి కూడా చేతిలోని మొబైల్లోనో ఆర్డర్ చేస్తే చాలు!! కావాల్సినవన్నీ ఇంటికే తరలివస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే... ఇదీ మన 70 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక ప్రస్థానం. ఆ ప్రయాణంలో... ఎన్నెన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుళ్లు. వాటినొక్కసారి పరికించే ప్రయత్నమే ఇది...
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నడిచిన లైసెన్స్ రాజ్‌పై ఎన్నో విమర్శలొచ్చాయి. కాకపోతే... యువతరం ఉద్యోగాల కోసం డిగ్రీలు చేతబట్టి కాళ్లరిగేలా తిరుగుతున్న ఆ సమయానికది అనువైన నిర్ణయం.1950ల మధ్యలో జరిగిన పరిశ్రమల జాతీయకరణ, 1969 నాటి బ్యాంకుల జాతీయీకరణపైనా విమర్శలున్నాయి. కానీ... కోట్ల మంది ప్రజలకు ఈ కంపెనీలు, బ్యాంకులు ఉపయోగపడటానికి నాటి నిర్ణయం సరైనదేనన్నది నిపుణుల మాట.1965 నాటి హరిత విప్లవం చిరకాలం కొనసాగేది కాదనే విమర్శలొచ్చాయి. కానీ ఈ హరిత విప్లవం ఆహార కొరతను అధిగమించేందుకు ఉపకరించిందన్నది కాదనలేం.
1947 తరవాత ఓ మూడు దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ‘హిందూ వృద్ధి రేటు’గా వర్ణించాయి పాశ్చాత్య దేశాలు. కారణమేంటంటే ఇతర ఆసియా దేశాల వృద్ధితో మనకు ఏమాత్రం పోలిక లేకపోవటం!!. ఇక 1991లో ఆర్థిక సంస్కరణలకు తెరతీశాక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం కళ్లముందు కనిపిస్తున్న మార్పులన్నీ... ఆ సంస్కరణల ఫలితాలే. అవి వేగం అందుకుంటున్న కొద్దీ... మార్పులు మరింత స్పష్టమవుతున్నాయి.
జీడీపీ: 10వేల కోట్ల నుంచి కోటి కోట్లకు!
ప్రస్తుత ధరలను బట్టి చూస్తే... 1950లో మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.10 వేల కోట్ల రూపాయలు. ఇప్పుడది ఏకంగా 1.04 కోట్ల కోట్లు. అంటే ఈ 70 ఏళ్లలో అది వెయ్యి రెట్లకు పైగా పెరిగిందన్న మాట.ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి (ప్రపంచబ్యాంకు) లెక్కల ప్రకారం చూస్తే 1980లో వాస్తవిక రేటు ప్రకారం మన జీడీపీ 189.44 బిలియన్ డాలర్లు. కానీ ఇప్పుడది ఏకంగా 2457.75 బిలియన్ డాలర్లు. ఇక కొనుగోలు శక్తి తారతమ్యాల (పీపీపీ) ప్రాతిపదికన చూస్తే 1950లో మన జీడీపీ 381.96 బిలియన్ డాలర్లు. ఇప్పుడు మాత్రం అది 14,187.08 బిలియన్ డాలర్లు. అదీ మన వృద్ధి.
స్వాతంత్య్రానంతరం స్వల్ప వృద్ధికి కూడా కటకటలాడిన ఆర్థిక వ్యవస్థ... 2005–06లో రెండంకెల వృద్ధిని చేరినా... 2008 సంక్షోభం తరవాత నెమ్మదించింది. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా 7 శాతం వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ అవతరించగలిగింది. ఈ 70 ఏళ్లలో వార్షిక తలసరి ఆదాయం రూ.247 నుంచి రూ.1.03 లక్షలకు పెరిగింది. 1950లో రిజర్వుబ్యాంకు వద్ద కేవలం 2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలుండగా, అవిప్పుడు 350 బిలియన్ డాలర్లకు చేరాయి మరి.
చెల్లింపుల సంక్షోభాల్ని దాటాం ఇలా...
1966, 1981, 1991... ఇవి మన ఆర్థిక చరిత్రలో గుర్తుండిపోయే సంవత్సరాలే!! విదేశాలకు చేయాల్సిన చెల్లింపులు చేయలేక... దివాళా దేశంగా ముద్రపడే ప్రమాదం తలెత్తింది ఇప్పుడే. ప్రపంచబ్యాంకు (ఐఎంఎఫ్) ముందుకొచ్చి డాలర్లలో రుణాలిచ్చి సర్దుబాటు చేయటంతో పరిస్థితి సర్దుమణిగినప్పటికీ... 1991లో ఆర్‌బీఐ దగ్గరున్న 67 టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్ వద్ద తనఖా పెట్టాల్సి వచ్చింది. 1966లోనైతే రూపాయి విలువను దారుణంగా తగ్గించాల్సి వచ్చింది. 1991లో ఈ సంక్షోభం ఫలితంగానే ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. కానీ... ఆ తరవాత మళ్లీ సంక్షోభాలు తాకలేదు. 2008లో ప్రపంచంలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఇండియా తట్టుకోగలిగింది.
ఐదేళ్లూ... ఒకో థీమ్!!
దేశ ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపడానికి 1951లో పంచవర్ష ప్రణాళికలు మొదలయ్యాయి. వీటిలో ఒకసారి సాగుపై ఫోకస్ పెడితే... మరోసారి పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చారు. ఇలా... ఒకోసారి ఒకో రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలు అమలయ్యాయి. ఇవి అమలు కాని 1967– 68 సంవత్సరాల్ని మినహాయిస్తే... ఇపుడు 2012–2017 ప్రణాళిక 12వది. ఈ ప్రణాళికలో 8.2 శాతం ఆర్థికాభివృద్ధి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకోగా, అంతర్జాతీయ మందగమనం వల్ల అది సాధ్యంకాలేదు.
రూపాయి విలువ మూడుసార్లు తగ్గించాం!!
1992లో రూపాయి విలువను ఒకే నెలలో మూడుసార్లు తగ్గించడం ద్వారా మొదలైన ఆర్థిక సంస్కరణలు ...పలు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం ద్వారా బాగా విస్తరించాయి. కొన్ని కీలక రంగాలు మినహా ఐటీ నుంచి టెలికం వరకూ నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ప్రస్తుతం అనుమతి ఉంది. చాలావరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్లోనే అనుమతి లభిస్తోంది కూడా.
1969... బ్యాంకులు ప్రభుత్వం చేతికి!
అప్పట్లో ప్రయివేటు బ్యాంకులదే హవా. రెతులకు, ఇతర చిన్న వ్యాపారులకూ రుణాలు దొరకని పరిస్థితి. దీంతో 85 శాతం డిపాజిట్లున్న 14 వాణిజ్య బ్యాంకుల్ని ప్రభుత్వ పరం చేస్తూ 1969లో ఓ ఆర్డినెన్స్ జారీ అయింది. ఆ ఏడాది జులై 19 అర్ధరాత్రి నుంచీ సదరు బ్యాంకులన్నీ ప్రభుత్వ బ్యాంకులైపోయాయి. మరో 6 బ్యాంకుల్ని 1980లో జాతీయం చేయడం ద్వారా... 91 శాతం డిపాజిట్లున్న బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తెచ్చుకుంది.
సంస్కరణల ఫలితంగా ఆయా బ్యాంకుల్లో వాటాను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తోంది. తరవాత మళ్లీ ప్రయివేటు బ్యాంకులొచ్చాయి. ప్రభుత్వ బ్యాంకుల్ని తలదన్నేలా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజాలు బ్యాంకులుగా అవతరించాయి. ఇపుడు చిన్నచిన్న బ్యాంకులు... ఆఖరికి చెల్లింపులు మాత్రమే చేసే పేమెంట్ బ్యాంకులూ వచ్చేశాయి. అంతేకాదు! స్టార్టప్ సంస్థలు వాలెట్ల పేరిట డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లోకి దిగాయి. అందుకే! ఇపుడు చేతిలో మొబైల్ ఉంటే బ్యాంకు ఖాతా, మనీ పర్సు అన్నీ అందులో ఉన్నట్టే!!
125 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్!
సంస్కరణల ప్రభావంతో భారత్ క్యాపిటల్ మార్కెట్ శరవేగంగా వృద్ధిచెందింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.125 లక్షల కోట్లకు చేరింది. తద్వారా అంతర్జాతీయంగా మన షేర్ మార్కెట్ 14వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. ఆసియాలో 6వ స్థానం మనది.
విదేశీ కరెన్సీకి కటకట కాబట్టే...
సంస్కరణలతో తేడా వచ్చేసింది...ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పెద్దఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివస్తున్నాయి. టెలికం, సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఆటోమొబైల్స్ తదితర రంగాల్లో అనువైన పరిస్థితులు, నైపుణ్యం ఉండటంతో 2000–2010 మధ్యకాలంలో 138 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు తరలివచ్చాయి.గత 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 500 డాలర్ల నుంచి 1600 డాలర్లకు పెరిగింది. ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం రానున్న 25 సంవత్సరాల్లో తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా.దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం 45 నుంచి 21.9కి తగ్గింది (2011 గణాంకాలు) పట్టణాల మురికివాడల్లో నివసించే జనాభా శాతం 55 నుంచి 24కు తగ్గింది. (2014 గణాంకాలు)
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
ఒకప్పుడు చేతిలో విదేశీ కరెన్సీ లేక విదేశాల నుంచి విడిభాగాలు కూడా తేలేని పరిస్థితి. అందుకే ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తిపై నియంత్రణల్ని కేంద్రం అత్యంత కఠినంగా కొనసాగించింది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ విడిభాగాలు కావాలి కదా!! వాటికి అధికంగా విదేశీ కరెన్సీ చెల్లింపులు చేయాలి కదా!!అంతేకాదు!! వైద్యానికైనా, విహారానికైనా, వ్యాపారానికైనా విదేశాలకు వెళ్లాలంటే అవసరమైన విదేశీ మారక ద్రవ్యం కోసం రిజర్వుబ్యాంకు అనుమతి తప్పనిసరి అయ్యేది. ఆర్‌బీఐ దగ్గర తగిన డాలర్లు లేకపోవడంతో పరిమిత విదేశీ ద్రవ్యానికే అనుమతినిచ్చేది.ఇక విదేశాల నుంచి కారు, కంప్యూటర్, కనీసం వైద్య పరికరాన్ని దిగుమతి చేసుకోవాలన్నా భారీగా 200, 300 శాతం వరకూ దిగుమతి సుంకాలుండేవి. మన క్రీడాకారులు కూడా విదేశాల్లో వచ్చిన బహుమతుల్ని దేశంలోకి తీసుకురావాలంటే భారీ భారీ సుంకాలు చెల్లించాల్సి వచ్చేది కొందరు క్రీడాకారులు తమ బహుమతుల్ని అక్కడే వదిలేసిన సందర్భాలూ ఉన్నాయి!