దేవుడా.. దేవుడా.. దేవుడా..! | complete story about sridevi | Sakshi
Sakshi News home page

దేవుడా.. దేవుడా.. దేవుడా..!

Published Mon, Feb 26 2018 3:49 AM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

complete story about sridevi - Sakshi

శ్రీదేవి
పుట్టింది        :     ఆగస్టు 13, 1963
జన్మస్థలం     :    శివకాశి, తమిళనాడు
తల్లిదండ్రులు  :    అయ్యప్పన్, రాజేశ్వరి
అసలుపేరు    :    శ్రీ అమ్మయ్యంగార్‌
ముద్దుపేరు    :  పప్పీ
తొలి చిత్రాలు  :    బాలనటిగా... 1967 కందన్‌ కరుణై చిత్రంలో బాలమురుగన్‌ పాత్ర. హిందీలో... 1975లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా... జూలీ.  హీరోయిన్‌గా... 1976 – తమిళంలో కె.బాలచందర్‌ డైరక్షన్‌లో  ‘మూండ్రు ముడిచ్చు’ 1977 – తెలుగులో... దాసరి నారాయణరావు  డైరెక్షన్‌లో... ‘మా బంగారక్క’
సినిమాలు     :    తెలుగు 86, హిందీ 71, తమిళం 72,  మలయాళం 23, కన్నడ 6 (ఇవి కాక బాలనటిగా చాలా సినిమాల్లో నటించారు) మొత్తం 50 ఏళ్ల సినీ కెరీర్‌లో  300 సినిమాలు.
కుటుంబం       :    భర్త బోనీ కపూర్‌ (నిర్మాత), కుమార్తెలు జాన్వీ, ఖుషీ.

క్షణక్షణంలో శ్రీదేవికి ఒక ఊతపదం ఉంది. ‘దేవుడా.. దేవుడా.. దేవుడా...’ అని. దేవుడు చల్లగా చూస్తాడని అనుకున్నాం. కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. ‘దేవుడా... దేవుడా... దేవుడా’...


తీరని కోరిక!
జూనియర్‌ అతిలోకసుందరి... శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను చూసి ఇలాగే అనుకున్నారంతా. మరాఠీ హిట్‌ ‘సైరట్‌’ను హిందీలో రీమేక్‌ ద్వారా జాన్వీ కథానాయికగా పరిచయం కానున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్‌ డే షూట్‌ లొకేషన్‌కి కూడా వెళ్లారు శ్రీదేవి. కూతురికి ధైర్యం చెప్పారు. జాన్వీ కూడా తన తల్లి పేరును నిలబెట్టాలని ఎంతో కసితో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 20న విడుదల కానుంది. శ్రీదేవి ట్విట్టర్‌ అకౌంట్‌ కూడా జాన్వీ ‘ధడక్‌’ సినిమా పోస్టర్‌తోనే పిన్‌ అయి ఉంటుంది. కానీ జాన్వీని వెండితెరపై చూడకుండానే శ్రీదేవి కన్నుమూశారు. శ్రీదేవి దుబాయ్‌లో మరణించారు. షూటింగ్‌ నిమిత్తం ముంబైలో ఉన్నారు జాన్వీ. తల్లి మరణం కూతురికి తీవ్ర ఆవేదన కలిగించి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చివరి సినిమా
∙షారుక్‌ ఖాన్‌ హీరోగా ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో కత్రినాకైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా రూపొందుతోన్న చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో శ్రీదేవిని ఓ స్పెషల్‌ రోల్‌ చేయమని అడగ్గా.. ఆమె ఓకే చెప్పారు. ఇందులో ఓ పాటలో శ్రీదేవి తనలానే (హీరోయిన్‌ శ్రీదేవి) కనిపిస్తారట. ఇదే శ్రీదేవికి చివరి సినిమా.

లాస్ట్‌ ట్వీట్‌
తమిళంలో నటి ధన్సిక ప్రధాన పాత్రలో ‘కాత్తాడి’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా బాగా ఆడాలని శ్రీదేవి ట్వీట్‌ చేశారు. ఇప్పుడే కాదు మంచి చిత్రాలను ప్రోత్సహించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా గురించి శ్రీదేవి స్వయంగా చేసిన ఈ ట్వీటే ఆఖరిది.

జగదేకసుందరి – కొన్ని జీవిత విశేషాలు
బాలీవుడ్‌లో ఎంటరైన తొలినాళ్లలో హిందీ భాష రాక ఇబ్బంది పడేవారు శ్రీదేవి. ఆ తర్వాత మెల్లిగా నేర్చుకున్నారు. ‘సావన్‌’ (1979) సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘చాందిని’ (1989) సినిమాతో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఎమ్‌ఏ తిరుముగమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్‌ భక్తి చిత్రం ‘తునైవన్‌’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించారు శ్రీదేవి. అయితే..ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు శ్రీదేవి రోడ్డు పైకి వెళ్లారట. ఆ సమయంలో ఆమెకు చిన్న ప్రమాదం జరిగింది.
1990లలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటిగా శ్రీదేవి రికార్డ్‌ సృష్టించారు. బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ సాధించిన సినిమాలతో లేడీ సూపర్‌స్టార్‌ అన్న హోదాను దక్కించుకున్నారామె.
‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’ సినిమాలోని ‘దుష్మన్‌ దిల్‌ కా వో హై’ పాటలో శ్రీదేవి వేసుకున్న గోల్డెన్‌ కలర్‌ డ్రస్‌ దాదాపు 25 కేజీలు బరువు ఉందట. ఈ పాటను సుమారు 15 రోజుల పాటు చిత్రీకరించారట.
13వ ఏటనే ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో రజనీకాంత్‌కు సవతి తల్లిగా కనిపించిన శ్రీదేవి కొన్నేళ్ల తర్వాత ఆయన పక్కనే హీరోయిన్‌గా చేశారు.
‘బడి పంతులు’ సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలిగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన పక్కన హీరోయి¯Œ గా నటించారు. ఎన్టీఆర్‌తో శ్రీదేవి చేసిన తొలి చిత్రం ‘వేటగాడు’.
సద్మా (1983), చాందినీ (1989), గర్జన (1991), క్షణక్షణం (1991) సినిమాల్లో పాటలు పాడారు.
 ‘జురాసిక్‌ పార్క్‌‘లో శ్రీదేవిని నటింపచేయాలను కున్నారట  స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. కానీ బాలీవుడ్‌లో కెరీర్‌ పీక్స్‌లో ఉండటంతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారట.
 భర్త బోనీ కపూర్‌ నిర్మాణంలో వచ్చిన ‘జుడాయి’, ‘హమారీ దిల్‌ ఆప్‌ కీ పాస్‌’ అనే సినిమాలో హీరోయిన్లు పోషించిన క్యారెక్టర్‌ పేర్లనే తన కుమార్తెలకు పెట్టుకున్నారు శ్రీదేవి.
 టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆయన కుమారుడు నాగార్జునతో, బాలీవుడ్‌లో ధర్మేంద్ర ఆయన కుమారుడు సన్నీ డియోల్‌–  ఇలా తండ్రీ కొడుకులతో శ్రీదేవి యాక్ట్‌ చేయడం విశేషం.
♦  ఓసారి షూటింగ్‌ ముగించుకొని ఒంటరిగా కారులో ఇంటికి వెళ్తోంది చిన్నారి శ్రీదేవి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పడ్డాయి. పక్కనే ఐస్‌ క్రీమ్‌ బండి కనిపించింది. ‘నాకు ఐస్‌క్రీమ్‌ తినాలనుంది’ అని డ్రైవర్‌ని ముద్దుగా అడిగింది. ‘వద్దు తల్లీ.. నువ్వు ఐస్‌క్రీమ్‌ తిన్నట్టు మీ అమ్మకి తెలిస్తే నా పని పట్టేస్తుంది. అలాంటివి తింటే నువ్వు లావయిపోతావట’ అన్నాడు డ్రైవర్‌. కారు కదిలిపోతుంటే ఆ బండి వైపే చూస్తుండిపోయింది శ్రీదేవి. అప్పటికి బాల నటిగా తన సంపాదనతో కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్న శ్రీదేవికి ఇష్టమైనవి తినే స్వేచ్ఛ లేదు. ఆరేళ్ల  శ్రీదేవి ఐస్‌క్రీమ్‌ కావాలని మారాం చేయలేదు.. సర్దుకుపోయింది.


ఎన్టీఆర్‌ కారు, శ్రీదేవి కారు గుద్దుకుంటాయి ‘వేటగాడు’లో. ‘ఏయ్‌ మిస్టర్‌. వెనకేం రాసుందో చూసుకోలేదా’ అని దిగి, దబాయిస్తుంది శ్రీదేవి. వెంటనే ఎన్టీఆర్‌ శ్రీదేవి రెక్క పట్టుకుని వెనక్కు తిప్పుతాడు. ఆమె ప్యాంట్‌ వెనుక ‘లవ్‌ మీ’ అని ఉంటుంది. ‘దాందేముంది మిస్‌. అలాగే ప్రేమిస్తాం. గెట్‌ రెడీ.. గెట్‌ రెడీ’ అంటాడు. ఆ క్షణాన ఎన్టీఆరే కాదు ఆ గ్లామర్‌కీ, చలాకితనానికీ ప్రేక్షకులు కూడా గెట్‌ రెడీ అయిపోయారు. అది శ్రీదేవి.

‘ఆకలి రాజ్యం’ సినిమా. ఆకలితో ముగ్గురు కుర్రాళ్లు నకనకలాడిపోతున్నారు. గుప్పెడు మెతుకుల కోసం అల్లాడిపోతున్నారు. వాళ్ల పరిస్థితి చూసిన శ్రీదేవి తన దగ్గర ఉన్న చిల్లర మల్లర డబ్బులతో వాళ్లను ఇంటికి భోజనానికి పిలుస్తుంది. చాలారోజుల తర్వాత భోజనం. అందరూ చకచకమని వంట చేస్తారు. విస్తళ్లు పరుస్తారు. భోజనానికి కూచుంటారు. కాని గదిలో నుంచి చిన్న మూలుగు వినిపిస్తుంది. లోపలికి వెళ్లిన శ్రీదేవి అక్కడ తన నానమ్మ మరణించిందని గ్రహిస్తుంది. ఆ సంగతి బయటకు చెప్తే వాళ్లు భోజనం చేయడం మానేస్తారేమోనని భయం. కాని నానమ్మ చనిపోయిందన్న దుఃఖం. చిన్న క్లోజప్‌. ప్రేక్షకుల హృదయం ద్రవించిపోతుంది. అదీ శ్రీదేవే.

‘శ్రీదేవికి చీర కట్టుకోవడం కూడా సరిగా వచ్చేది కాదు. నేనే నేర్పించాను’ అన్నాడు కమల్‌హాసన్‌ ఒకసారి. వాళ్లిద్దరూ కలిసి తమిళ హిట్‌ ‘పదినారు వయదినిలే’లో నటించారు. తమిళంలో హీరోయిన్‌గా శ్రీదేవిని ఎస్టాబ్లిష్‌ చేసిన సినిమా. 15 ఏళ్లు నిండకుండానే పదహారేళ్ల అమ్మాయిగా నటించడానికి సిద్ధపడింది. నటించడం తప్ప వేరే ఏమీ తెలియదు. స్కూలుకు వెళ్లలేదు. స్టూడియోనే బడి. మేకప్పే టెక్స్‌›్టబుక్‌. ‘యాక్షన్‌’, ‘కట్‌’ అనే మాటలే పాఠాలు. ఆమె తొందరగా హీరోయిన్‌ కావడం ఇంటి పరిస్థితుల రీత్యా అవసరం. తల్లి రాజేశ్వరి అందుకు శ్రమించేది.

కమల్‌హాసన్‌ కూడా బాల నటుడే. కాని అతడు మగాడు. బయట తిరిగేవాడు. లోకం చూసినవాడు. శ్రీదేవి ఇంటి నాలుగ్గోడల మధ్య కానీ ఫ్లోర్‌లోని నాలుగ్గోడల మధ్య కానీ ఉండేది. కమల్‌హాసన్‌తో ఆమె ‘ఎర్ర గులాబీలు’, ‘గురు’, ‘ఆకలి రాజ్యం’ వంటి సినిమాలు చేసింది. కాలం గడిచిపోయింది. ఇద్దరూ 1986లో ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’లో నటించారు. ఒకరోజు ఒక వ్యక్తికి సెట్‌లో చాలా పెద్ద చెక్‌ ఇస్తూ కనిపించింది. ‘అంత డబ్బా. దేనికి?’ అడిగాడు కమల్‌హాసన్‌. ‘నా కాస్ట్యూమ్స్‌కి’ అని జవాబిచ్చింది శ్రీదేవి. అప్పటికే దేశంలోని ఆడపిల్లలందరూ ఆమె ఏ చీర కట్టుకుంటే ఆ చీరను ఫాలో అవుతున్నారు. అది శ్రీదేవే.

డాన్స్‌ మాస్టర్‌ సలీమ్‌ ఒకసారి చెప్పాడు– ‘సలీం మాస్టర్‌... ఎన్టీఆర్‌ గారితో ఏ స్టెప్‌ అయినా వేయించండి. కానీ చేయి పట్టుకుని వేసే స్టెప్‌ మాత్రం వద్దు’ అని అందట శ్రీదేవి. చేయి పట్టుకుని వేసే స్టెప్పులో ఎన్టీఆర్‌ లీనమైపోయి గట్టిగా పట్టుకునేవాడు. ఆమెకు అది కొంచెం నొప్పి అనిపించేది. ఆ తర్వాత సలీమ్‌ మాస్టర్‌ ఆమెతో ఎన్టీఆర్‌చే చేయి పట్టించలేదు. అది శ్రీదేవి.

ఎన్టీఆర్‌ అంటే వాణిశ్రీ హీరోయిన్‌. ఆ తర్వాత జయప్రద వచ్చింది. ‘అడవి రాముడు’, ‘యమగోల’, ‘డ్రైవర్‌ రాముడు’. జయసుధ కూడా ‘డ్రైవర్‌ రాముడు’, ‘కేడీ నంబర్‌1’. అప్పుడు ‘వేటగాడు’ కోసం దర్శకుడు రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌ పక్కన శ్రీదేవిని బుక్‌ చేశాడు. ఇదేంటి వాళ్లిద్దరికీ ఎలా కుదురుతుంది అన్నారు జనం. కొందరు ఇది రాంగ్‌ చాయిస్‌ అన్నారు. శ్రీదేవి చెవిన ఈ మాటలు పడుతూనే ఉన్నాయి. భారీ జ్వరంలో ‘ఆకుచాటు పిందె తడిసే’ పాట చేసింది. కొంచెం కష్టమైనా తెల్లవారు జామునే లేచి ఊటిలో ‘జాబిలితో చెప్పనా’ అంటూ జాగింగ్‌ చేసింది. ‘కొండమీన చందమామా’ గ్రూప్‌ డాన్సర్లతో శ్రమపడింది. సినిమా విడుదలైంది. సూపర్‌ డూపర్‌ హిట్‌. ‘మా తర్వాతి సినిమాలన్నింటిలోనూ ఆమెనే హీరోయిన్‌గా బుక్‌ చేయండి’ అని శాసనం వేయించాడు ఎన్టీఆర్‌. శ్రీదేవి చేతిని ఆయన విడువదలుచుకోలేదు. అది– శ్రీదేవి.

తెలుగులో పెర్ఫార్మెన్స్‌ తాలూకు లెగసీ ఒకటి ఉంది. భానుమతి, సావిత్రి.. ఆ లెగసీకి పాదు వేశారు. జయప్రద, జయసుధ ఆ లెగసీని కొనసాగించారు. కానీ జమున, వాణిశ్రీ, శ్రీదేవి గ్లామర్‌నూ పెర్ఫార్మెన్స్‌ను సమానంగా బేలెన్స్‌ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించారు. శ్రీదేవిది ఆ స్కూలు. హిందీలో రేఖా, జీనత్‌ అమాన్‌ తమ లుక్స్‌ మీద, కాస్ట్యూమ్స్‌ మీద ఎంత శ్రద్ధ పెట్టేవారో దక్షిణాదిన శ్రీదేవి అంత శ్రద్ధ పెట్టేది. ‘ఈ ముక్కు వెడల్పుగా ఉంది’ అని 1981లో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీకి వెళ్లడం ఆ రోజుల్లో చాలా పెద్ద వింత. ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్లందరూ ముక్కు సన్నగా అయిన శ్రీదేవి సినిమాలు చూడటానికి ఎగబడ్డారు. 1983 నాటికి ఈ సన్నముక్కు శ్రీదేవి తన వెడల్పు ముక్కు దక్షణాది జీవితాన్ని క్రమంగా వదిలేయదలుచుకుందని ప్రేక్షకులకు అర్థమైంది.

1983లో హిందీలో విడుదలైన ‘హిమ్మత్‌వాలా’ పెద్ద హిట్‌. ఆ టైమ్‌లో అక్కడ హేమమాలిని టాప్‌లో ఉంది. ఆ తర్వాత పర్విన్‌ బాబీ, టీనా మునిమ్, అనితా రాజ్‌... వీళ్లంతా ఏలుతున్నారు. ‘తోఫా’ (1984) హిట్‌ అయ్యింది. ‘నగీనా’ (1986) హిట్‌ అయ్యింది. కాని డజన్‌ ఫ్లాపులు కూడా ఉన్నాయి. సరే.. దక్షిణాది నుంచి వచ్చి అందరిలో ఒకరుగా ఉన్న ఒక హీరోయిన్‌. అది– శ్రీదేవి.

1987. ‘మిస్టర్‌ ఇండియా’. ‘ఇందులో ఒక రొమాంటిక్‌ సాంగ్‌ ఉందండీ’ అన్నాడు దర్శకుడు శేఖర్‌ కపూర్‌. ‘అయితే ఆ పాట ఒకసారి వినడానికి పంపండి’ అని అడిగింది శ్రీదేవి. ‘కాటేనహి కట్‌తే ఏ దిన్‌ ఔర్‌ రాత్‌’.... వినిందామె. ఒక నీలి రంగు చీరను ఎంచుకుంది. కురులను గాలికి వదిలిపెట్టింది. పాదాలను నగ్నంగా వదిలిపెట్టింది. వానలో కొంచెం ఒళ్లు తడిపింది. నడుమును కొంచెం ఒక్కసారి విదిలించింది. అంతే. కోట్లాదిమంది ఆ వొంపులో కొట్టుకునిపోయారు. శాశ్వతంగా పడిపోయారు. ‘మిస్టర్‌ ఇండియా’ సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇప్పుడు శ్రీదేవి సూపర్‌ స్టార్‌. ఇండియాస్‌ నంబర్‌ ఒన్‌ హీరోయిన్‌.అదే– శ్రీదేవి.

యశ్‌ చోప్రా ఆమెను ఆరాధించాడు. ‘చాందినీ’, ‘లమ్హే’ వంటి సినిమాలు ఆమె కోసమే తయారు చేశాడు. ఆమె ఇమేజ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. దానిని తెలుగు ఇండస్ట్రీ కూడా ఆహ్వానించింది. ‘శ్రీదేవి ఒక్క సినిమా చేయగలిగితే చాలు’.. అందరూ ఎదురు చూపులే. ‘అంత పెద్ద స్టార్‌ పక్కన మనం తేలిపోకుండా ఉండగలమా’ హీరోలకు గుబులు. వాళ్లు శ్రీదేవి మీద ఏమాత్రం చేయి వేయగలరో చూద్దాం అని అభిమానుల కుతూహలం. కాని నాగార్జున ‘ఆఖరి పోరాటం’ సినిమాలో ఆమెతో పాటు మెరవగలిగాడు. చిరంజీవి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’లో సమఉజ్జీగా ఢీకొట్టాడు. వెంకటేశ్‌ ‘క్షణక్షణం’లో గట్టిగా నిలబడగలిగాడు. ఆమె అలా తెలుగులో కనిపిస్తుంటే బాగుండని చాలామంది అనుకున్నారు. కాని ఆమె కనబడలేదు. అది శ్రీదేవి.

1996లో ఆమె బోనీ కపూర్‌ను వివాహం చేసుకుంది. 2012 వరకు ఇల్లు, కుటుంబం ముఖ్యమనుకుంది. ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. అభిమానులు ఆమె తిరిగి నటించాలని కోరుకున్నారు. ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమా చేసింది. విమర్శకులు పూలవర్షం కురిపించారు. ఇంకా ఇంకా చేయిమని అడిగారు. కానీ ఐదేళ్ల తర్వాత 2017లో ‘మామ్‌’ చేసింది. ఇన్నాళ్ల తర్వాత కూడా యాక్షన్‌ అనగానే తనలో నుంచి ఒక గొప్ప నటి ఎలా ఉబికి వస్తుందో నిరూపించింది. ఇంకా ఇంకా అని ప్రేక్షకులు అన్నారు. చేస్తానని ఆమె మాట ఇచ్చింది. ఇదిగో దుబాయ్‌ దాకా వెళ్లొస్తానని వెళ్లింది. తిరిగి రాలేదు. ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అది– శ్రీదేవి.


సినీ ప్రముఖుల స్పందన
షాకింగ్‌ అండ్‌ వెరీ డిస్ట్రబింగ్‌. నేనో మంచి మిత్రురాలిని అలాగే ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ను కోల్పోయింది.  – రజనీకాంత్‌
శ్రీదేవి సక్సెస్‌ లక్‌ కాదు.. ఇదంతా చిన్నతనం నుంచి తను చేసిన హార్డ్‌ వర్క్‌. నాకు తను చాలా చిన్న వయసు నుంచి తెలుసు. ‘మూండ్రు ముడుచ్చు’  సినిమా సెట్‌లో అడుగుపెట్టి నప్పుడు తను చాలా చిన్న అమ్మాయి. బాలచందర్‌గారు కొన్నిసార్లు యాక్టింగ్‌లో కరెక్ట్‌ చేయడం, స్టెప్స్‌ విషయంలో హెల్ప్‌ చేసే బాధ్యతను నాకు అప్పగించేవారు. శ్రీదేవి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అది కేవలం ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తన తత్వమే.తను సాధించిన సక్సెస్‌లన్నీ స్వయంగా వేసిన అడుగులే. 27 సినిమాలు కలిసి పని చేశాం. మేం ఇద్దరం కూడా పెద్ద ఎమోషన్స్‌ చూపించే రకం కాదు. కానీ లాస్ట్‌ టైమ్‌ మేం కలిసినప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాం. ఈ వార్త వినగానే తనతో నాకున్న హ్యాపీ మూమెంట్స్‌ అన్నీ మదిలో మెదిలాయి. ‘సద్మా’ సినిమాలో లుల్లా బేబి ఇంకా మెదులుతూనే ఉంది. – కమల్‌ హాసన్‌
చిన్న వయసులోనే శ్రీదేవి మనల్ని విడిచి వెళ్లిపోవడం బాధగా ఉంది. ఆమె ఇంకా ఎన్నో పాత్రల్లో నటించగలదు. ఎంతో భవిష్యత్‌ ఉంది. ఆమె చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేది. మా ఇంట్లో శ్రీదేవి సందడి చేస్తూ ఉండేది. ‘బుర్రిపాలెం బుల్లోడు’ సినిమాలో నా సరసన హీరోయిన్‌గా తొలిసారి శ్రీదేవి నటించింది. వంద రోజులు ఆడింది ఆ పిక్చర్‌. శ్రీదేవి 86 తెలుగు సినిమాల్లో నటిస్తే అందులో నా పక్కన హీరోయిన్‌గా దాదాపు 31 సినిమాల్లో నటించింది. అందరితో కంటే నాతోనే ఎక్కువ సినిమాల్లో యాక్ట్‌ చేసింది శ్రీదేవి.   – కృష్ణ
 అందం, అభినయం కలబోసిన నటి శ్రీదేవి. ఇంత అత్యద్భుతమైన నటిని నేను ఇంతవరకూ చూడలేదు. ఇకపై వస్తారన్న నమ్మకం లేదు. శ్రీదేవి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమెకు నటన తప్ప మరో వృత్తిలేదు. ఆమె అంకితభావం చూసి నేనెంతో నేర్చుకున్నాను. ఒక గొప్ప నటి దూరమవ్వడం భారత ప్రజలు  చేసుకున్న దురదృష్టమని నేను భావిస్తున్నాను. కోట్లమంది ప్రేక్షకుల హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న శ్రీదేవి చనిపోయిందని నేను అనుకోవడం లేదు. ఎప్పటికీ ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఈ సినిమా ప్రపంచం ఉన్నంత వరకు శ్రీదేవి బ్రతికే ఉంటుంది. – చిరంజీవి
ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే పలికించగల మహానటి శ్రీదేవి. ఆవిడ హఠాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. శ్రీదేవితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి  వేడుకుంటున్నాను. – బాలకృష్ణ
♦  శ్రీదేవి చనిపోయారన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆ నిజం నన్ను ప్రతి ఉదయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ దుర్వార్త కలలో భాగమై, శ్రీదేవి తిరిగొస్తే బాగుండనిపిస్తోంది. ప్రేక్షకులందరితో పాటు నేను కూడా శ్రీదేవిని ప్రేమిస్తూనే ఉంటా. – నాగార్జున
♦  శ్రీదేవి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. అమేజింగ్‌ టాలెంటెడ్‌ యాక్ట్రస్‌ను కోల్పోయాం. యంగ్‌ ఏజ్‌లోనే స్టార్‌డమ్‌ తెచ్చుకున్నప్పటికీ ఆమె ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ శ్రీదేవి స్ఫూర్తి. – వెంకటేశ్‌
ఈ రోజు సూర్యుడు ఉదయించాడు. కానీ వెలుగు మిస్సయ్యింది. ఒక నక్షత్రం తిరిగి స్వర్గానికి చేరింది. మరొకరికి మహానటి టైటిల్‌ ఇవ్వాలంటే అది శ్రీదేవికే. వెళ్లు మిత్రమా.. తిరిగి రాని నేస్తమా. – అశ్వనీదత్‌
♦  మకుటంలేని మహారాణిలా చిత్రపరిశ్రమలో వెలుగొందిన శ్రీదేవి ఫ్యామిలీతో మాకు ఎంతో అనుబంధం ఉంది. శ్రీదేవి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను.
– బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
♦  అసమానమైన అభినయంతో ప్రేక్షకలోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర సుస్థిరం. – పవన్‌ కల్యాణ్‌
ఆల్‌టైమ్‌ నా ఫెవరెట్‌ యాక్టర్‌ శ్రీదేవిగారు. యాక్టర్‌గానే కాదు.. మహిళగా కూడా ఆమె ఎందరికో స్ఫూర్తి. ఆమె ఇక లేరనే వార్త షాకింగ్‌గా అనిపించింది – మహేశ్‌బాబు
 శ్రీదేవిగారు అద్భుతమైన నటి. అలాగే టైమ్‌లైస్‌ బ్యూటీ. శ్రీదేవి మ్యాజికల్‌ ఎరా చిరకాలం గుర్తుండిపోతుంది  – ప్రభాస్‌
 ఫిల్మ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. శ్రీదేవిగారి మరణం గురించి విని షాక్‌ అయ్యాను. చాలా బాధపడ్డాను.   – రామ్‌చరణ్
 తను వచ్చింది, చూసింది, గెలిచింది. తిరిగి తన నివాసమైన స్వర్గానికే వెళ్లిపోయింది. శ్రీదేవి గారి లేని లోటు తీర్చలేనిది. –ఎన్టీఆర్‌
ఎక్కడ అడుగు పెడితే అక్కడి ప్రాంతాన్ని జయించింది శ్రీదేవి. తన హార్డ్‌వర్క్, టాలెంట్‌తో బాలీవుడ్‌ శిఖరాన్ని కూడా అధిరోహించింది. శ్రీదేవిని బాలీవుడ్‌లోకి పరిచయం చేసింది నేనే అని గర్వంగా చెప్పుకోగలను. కేవలం సౌత్‌ స్టేట్స్‌లోనే కాకుండా అడుగుపెట్టిన  ప్రతి ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసింది శ్రీదేవి. – భారతీరాజా
శ్రీదేవి గారి వర్క్‌కి నేనెప్పుడూ పెద్ద అభిమానిని. అందరి లాగే తన గ్రేస్‌ను, తన అందాన్ని ఆరాధించిన వాళ్లలో నేను కూడా ఒకణ్ణి. ప్రస్తుతం తనకోసం మౌనంగా రోదిస్తున్న కోట్లాది అభిమానుల్లో నేను కూడా ఒకణ్ణి. మేడమ్‌... మిమల్మి ఎప్పటికీ మా హృదయాల్లో ప్రేమతో, అపారమైన గౌరవంతో పదిలపరుచుకుంటాం. – ఆమిర్‌ ఖాన్‌
శ్రీదేవితో కలిసి నటించే అద్భుతమైన అవకాÔ¶ ం చాలా కాలాం క్రితమే లభించింది. ఎప్పటినుంచో తన స్టార్‌డమ్‌ అలానే కంటిన్యూ అవుతూనే ఉంది.అక్షయ్‌ కుమార్‌
 షాక్‌కి గురయ్యాను. బోనీ, ఆయన కుమార్తెలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను – రిషీ కపూర్‌
ఈ చేదు వార్తతో మేల్కొన్నాను. ప్రపంచం ఒక టాలెంటెడ్‌ పర్శన్‌ని కోల్పోయింది  – మాధురీ దీక్షిత్‌
ఇంకా డీప్‌ షాక్‌లోనే ఉన్నాను. ఒక బబ్లీ పర్శన్, వండర్‌ఫుల్‌ యాక్టర్‌. మన మధ్య లేరంటే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఎవ్వరూ పూరింపలేని ఒక ఖాళీను వదిలి వెళ్లారు.  – హేమ మాలిని


మానవ జాతికి దేవుడు ఇచ్చిన వరం శ్రీదేవి. బ్రహ్మ దేవుడు ఎప్పుడో స్పెషల్‌ మూడ్‌లో ఉన్నప్పుడు చేసే క్రియేషన్‌ శ్రీదేవి. ‘శివ’ సినిమా స్టార్ట్‌ కాకముందు కేవలం తనను చూడటం కోసమే తన ఇంటికి ముందుకు వెళ్లి నిల్చునేవాడిని. తనెప్పుడైనా బయటకి వస్తే చూద్దామనే ఆశ. కానీ అలాంటి అదృష్టం నాకెప్పుడు కలగలేదు. ‘క్షణక్షణం’ అనే సినిమా కేవలం శ్రీదేవిని ఇంప్రెస్‌ చేయడం కోసం రాశాను. నా దృష్టిలో ఆ సినిమా శ్రీదేవికో లవ్‌ లెటర్‌ లాంటిది.
శ్రీదేవిని సృష్టించినందుకు దేవుడికి, జీవితాంతం తన అందాన్ని పదిలంగా భద్రపరుచుకోవడానికి కెమెరాను కనిపెట్టిన లూయిస్‌ లుమీర్‌కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌ చెబుతున్నాను.
ఐ హేట్‌ శ్రీదేవి. తను కూడా మనందరి లాంటి మనిషే అని, తనకు మరణం ఉంటుందని ఐ హేట్‌ శ్రీదేవి. మనందరి లాగే ఏదో రోజు ఆగిపోయే గుండె తనకూ ఉందని ఐ హేట్‌ శ్రీదేవి. అంత త్వరగా తీసుకువెళ్లిపోయినందుకు దేవుడ్ని, అంత త్వరగా చనిపోయినందుకు  ఐ హేట్‌ శ్రీదేవి. – రామ్‌గోపాల్‌ వర్మ

సోమవారం అర్ధరాత్రి అమితాబ్‌ ఏదో కీడు శంకిస్తుంది అని ట్వీట్‌ చేశారు. ఇలా ట్వీట్‌ చేసిన 20 నిమిషాలకే శ్రీదేవి మరణించారు అనే న్యూస్‌ బయటకు వచ్చింది. అంటే.. అమితాబ్‌ మనసు శ్రీదేవి మరణాన్ని గ్రహించిందా? లేక కుటుంబ సభ్యులు బయటపెట్టకుండా తాను చెప్పకూడదని అలా ట్వీట్‌ చేశారా? ‘ఎందుకో తెలీదు ఒకరకమైన అలజడిగా అనిపిస్తుంది’ అని అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు.


అమరపురిలోనే కాదు... అవనిపై కూడా దేవతలు సంచరిస్తారన్న నమ్మకం కలిగించి... అమృతం సేవిస్తేనే కాదు... ఆనందామృతం పంచిపెట్టినా కూడా అమరత్వం సిద్ధిస్తుందని చాటిచెప్పిన సంపూర్ణ జీవన ప్రస్థానం... అందానికి అభినయాన్ని జోడించి, వ్యక్తిత్వానికి హుందాతనాన్ని మేళవించి, అర్ధాయుష్షుతోనే అటూ ఇటూ కలిపి మూడు తరాలను ఉర్రూతలూగించిన చలనచిత్ర వ్యాకరణం ఒక నిండు ఉదయాన్ని, ఒక నిండు సూర్యోదయాన్ని చిమ్మచీకటి చేసి వెడలిన అరుదైన నిష్క్రమణం. – రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement