ఉద్యోగాన్నే స్టోర్‌ చేసుకున్న మహిళ | Convenience Store Woman Kotha Bangaram | Sakshi
Sakshi News home page

ఉద్యోగాన్నే స్టోర్‌ చేసుకున్న మహిళ

Apr 15 2019 4:41 AM | Updated on Apr 15 2019 4:41 AM

Convenience Store Woman Kotha Bangaram - Sakshi

సయకా మురాటా

అతను బాత్‌టబ్బులో పడుకుని ట్యాబ్లెట్‌లో సినిమాలు చూసుకుంటూ గడుపుతాడు. ఆమెకు లైంగిక కోరికలు కలగవు. అతనికి ఆమె పైన ఆసక్తి ఉండదు.

సయకా మురాటా రాసిన జాపనీస్‌ నవలిక ‘కన్వీనియన్స్‌ స్టోర్‌ వుమన్‌’లో, 36 ఏళ్ళ కీకో– టోక్యోలో ఉన్న ‘స్మైల్‌ మార్ట్‌ కన్వీనియన్స్‌ స్టోర్‌’లో తనకి 18 ఏళ్ళున్నప్పటినుంచీ పని చేస్తుంటుంది. ఆమెకు సామాజిక ప్రవర్తన గురించి తెలియని సమస్య ఉంటుందని తప్ప, అదే జబ్బో పేర్కొనరు రచయిత్రి.

ప్రేమించే కుటుంబం ఉన్న కీకోకి– ప్రేమ, శృంగారం, పెళ్ళి, ఉద్యోగంలో ఎదగడం వంటి విషయాలు పట్టవు. తనకిచ్చిన స్టోర్‌ యూనిఫార్మ్‌ చూసుకుని మురిసిపోతుంది. ట్రెయినింగ్‌ వీడియో చూస్తూ ‘ముఖ కవళికలెలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నది ఎవరైనా నాకు చెప్పడం ఇదే మొదటిసారి’ అనుకుంటుంది. కొనుగోలుదార్లకు ‘స్వాగతం, అవును, లేదు’ అని చెప్పడం మినహా సహోద్యోగులతో ఎక్కువ మాట్లాడే అవసరం పడదు. కాకపోతే, ‘స్వాభావికం’గా కనబడేలా ప్రవర్తిస్తూ, వారితో ఇమడ్డానికి ప్రయత్నిస్తుంది. ‘ఈ స్టోర్‌ భోజనంతోనే నా శరీరం నిండి ఉంది. ఇక్కడున్న కాఫీ మెషీన్‌లాగా, పత్రికల స్టేండ్లలాగా నేనూ దీనికి భాగం’ అనుకుంటుంది. ‘రాత్రిళ్ళు నిద్రపట్టనప్పుడు, చీకట్లో కూడా జీవంతో తొణికిసలాడే స్టోర్‌ ఆక్వేరియంని గుర్తు తెచ్చుకుంటే నిద్ర పట్టేస్తుంది’ అన్నంత ఇష్టం కీకోకి స్టోర్‌ అంటే. అన్నేళ్ళల్లో ఎందరో మానేజర్లు మారుతారు కానీ కథకురాలైన కీకో మాత్రం సేల్స్‌గర్ల్‌గానే మిగిలిపోతుంది.

పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనమనీ, ప్రమోషన్‌ తెచ్చుకొమ్మనీ– ఇంట్లోవారూ స్నేహితులూ ఆమెని పోరుతుంటారు. ఆమె సంతృప్తిగా, స్వతంత్రంగానే జీవిస్తోందని వారు అర్థం చేసుకోరు. ‘ఒక పురుషుడూ స్త్రీ కలిసి ఉన్నప్పుడు నిజం ఏదైనప్పటికీ కనీసం ఇతరులు సంతోషపడతారు’ అనుకున్న కీకో– కుటుంబ ఒత్తిడి భరించలేక, తన నిర్లక్ష్య ధోరణి వల్ల అదే స్టోర్లో ఉద్యోగం పోగొట్టుకున్న స్వార్థపరుడూ, పోట్లాటలకు నెపాలు వెతికేవాడూ అయిన షిరహాను తన అపార్టుమెంట్లో ఉండమంటుంది. అతను బాత్‌టబ్బులో పడుకుని ట్యాబ్లెట్‌లో సినిమాలు చూసుకుంటూ గడుపుతాడు. ఆమెకు లైంగిక కోరికలు కలగవు. అతనికి ఆమె పైన ఆసక్తి ఉండదు. అయినప్పటికీ, సమాజం కోసం ఇద్దరూ తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకోవాలనుకుంటారు. ఆర్థికంగా కీకోమీద ఆధారపడే షిరహా, తన అప్పులు తీర్చడానికని ఎక్కువ జీతం దొరికే ఉద్యోగం చూసుకొమ్మని ఆమెను వొప్పిస్తాడు.

స్టోర్లో పని మానేశాక, తన జీవితపు లక్ష్యాన్ని కోల్పోయి, ‘ఇప్పటివరకూ– నిద్రపోవడం, శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం, మంచి భోజనం చేయడం కూడా ఉద్యోగంలో భాగమే అయి ఉండేవి. ఇక ఏ ప్రమాణాలతో జీవించాలో తెలియట్లేదు’ అని బాధ పడుతుందామె. మరో ఉద్యోగానికి ఇంటర్వూ్య ఇచ్చేందుకు వెళ్తూ, దార్లో కనిపించిన ఒక కన్వీనియంట్‌ స్టోర్‌ చిరపరిచితమైన శబ్దాల వల్ల ఆకర్షింపబడి, లోపలికి అడుగుపెడుతుంది. అక్కడ సరిదిద్దవలసిన లోపాలని ఇట్టే పట్టేస్తుంది. ఎవరేమనుకున్నా కానీ తన ఉనికి స్టోర్‌తోనే ముడిపడుందని ఆ క్షణంలోనే గ్రహిస్తుంది.

163 పేజీల యీ నవలిక పాఠకులను ఆలోచనలో పడేస్తుంది. ఒక వ్యక్తి సమాజంలో ఇమిడే తీరాలా! ప్రతీ ఒక్కరికీ సంతోషం కలిగించేది ఒకటే అయి ఉండాలా? రచయిత్రి– స్టోరును ఆధునిక సమాజానికి రూపకంగా ఉపయోగిస్తారు. కీకో తన సహోద్యోగులని అనుకరించడం హాస్యంగా అనిపిస్తుంది. కథాంశంలో క్లిష్టత ఉండదు. పొట్టి, సరళమైన వాక్యాలున్న యీ నవలికని చదివిన తరువాత సూపర్‌ మార్కెట్ల ఉద్యోగులని చూసే దృక్పథం మారుతుంది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన టేపీ టెకెమొరీ– జాపనీస్‌ నమ్మే యథాతథవాద మనస్తత్వాన్నీ, కీకో అనుభూతులనూ సరిగ్గా అంచనా వేస్తారు. తొలి ప్రచురణ 2016లో. ఆ ఏడాదికి అకుటగవా ప్రైజ్‌ గెలుచుకుంది. ఇంగ్లిష్‌లో 2018లో ప్రచురించినది గ్రోవ్‌ ప్రెస్‌. 
-కృష్ణ వేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement