దేశం మెచ్చిన నటుడు... | Country favored by the actor ... | Sakshi
Sakshi News home page

దేశం మెచ్చిన నటుడు...

Published Fri, Mar 4 2016 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

దేశం మెచ్చిన నటుడు...

దేశం మెచ్చిన నటుడు...

మనోజ్‌కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సందర్భంగా...
 
పదేళ్లుంటాయి.లాహోర్ నుంచి ఢిల్లీకి కాందశీకులుగా వచ్చి పడ్డారు. స్నేహితులు విడిపోయారు. బంధువులు విడిపోయారు. ఆ అందమైన నగరం విడిపోయింది. ఆటలూ పాటలూ... ఇక్కడ ఢిల్లీ హడ్సన్ లేన్‌లో శరణార్థి శిబిరంలో... ఎవరు ఏమిటో... ఎలా బతకాలో...
అప్పుడే తల్లి ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్యం బాగలేదు. తల్లికీ బాగలేదు. హాస్పిటల్‌లో చేర్చారు. కాని ఇంకా గొడవలు ఆగిపోలేదు. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ సైరన్ మోగినప్పుడల్లా రక్షణ కోసం డాక్టర్లు నర్సులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లి దాక్కునేవారు. ఆ రోజు సైరన్ మోగింది. డాక్టర్లు నర్సులు పేషెంట్లను వదిలి పారిపోయారు. తల్లి వేదనతో డాక్టర్లను పిలుస్తోంది. ఆమె ఎందుకు పిలుస్తోందో ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కావడం లేదు. మళ్లీ మళ్లీ పిలుస్తోంది. కాని ఎవరూ రావడం లేదు.
 మరి కాసేపటికి పొత్తిళ్లలో ఉన్న బిడ్డ అచేతనమైంది. పదేళ్ల వయసులో దేశం చేసిన గాయం ఇది.ఇది ఇలా ఎందుకు ఉంది? నా దేశం గొప్పది. ఆ గొప్పదనం నిలబెట్టేలాగే నేనూ ఈ దేశ ప్రజలూ ఉండాలి. అది ప్రేమే. అదొక్కటే ఉంది.
     
 అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. కాని ‘మనోజ్ కుమార్’ అని ముందే నిర్ణయించుకున్నాడు. శరణార్థి శిబిరంలో పొద్దు పోక మొదటిసారి సినిమా చూశాడు. దాని పేరు ‘జుగ్ను’. దిలీప్ కుమార్ హీరో. ఆ తర్వాత మరో సినిమా చూశాడు. దాని పేరు ‘షబ్నమ్’. అందులో కూడా దిలీప్ కుమారే హీరో. పెద్దయ్యి నేను దిలీప్‌కుమార్ అవుతాను అనుకున్నాడు. పేరు కూడా డిసైడ్ చేసుకున్నాడు. మనోజ్ కుమార్. అది షబ్నమ్‌లో దిలీప్ ధరించిన పాత్ర పేరు.
     
 అందరూ సినిమాల మీద పిచ్చితో బొంబాయి పారిపోయి వస్తాడు. మనోజ్ కుమార్ తల్లిదండ్రుల అనుమతితో బొంబాయి వచ్చాడు. యాక్టర్ కావాలి. హీరో కావాలి. కల. కాని తల తిప్పి చూస్తే అలాంటి కలలు వేలాది ఉన్నాయి. భుజానికి రాసుకు పూసుకు తిరుగుతూ వడపావ్‌తో పొట్ట నింపుకుంటున్నాయి. మరి అవకాశాలు ఎలా వచ్చాయి? నిలబడటం నేర్చుకోవడం వల్ల. అవును... సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం నేర్చుకున్నాడు. సినిమా అవకాశాల కోసం స్టుడియో బయట నిలబడటం నేర్చుకున్నాడు. సినిమాల్లో అవకాశం వచ్చాక వాటిని నిలబెట్టుకోవడానికి డెరైక్టర్ ముందు నిలబడటం నేర్చుకున్నాడు. రాత్రిళ్లు ఎప్పుడైనా రూమ్‌కు వెళ్లే ట్రైన్ మిస్సైపోతే స్టేషన్‌లో తల దాచుకోవడానికి స్టేషన్ మాస్టర్ ముందు వినయంగా నిలబడటం నేర్చుకున్నాడు. వంగి వంగి నడిచేదా ఈ దేశ యువత? దీనికో వెన్ను ఉందని గుర్తు చేయాలి. కోపం లేదు. ఉన్నది ప్రేమే. యువతను తట్టి లేపాలి. ఆలోచించాడు. భగత్ సింగ్. అవును... భగత్ సింగ్ మీద సినిమా తీయాలి.
     
అప్పటికి చిన్న నటుడే. పైగా అంతకు ముందు రెండు సినిమాలు భగత్ సింగ్ మీద తేస్తే బోల్తా కొట్టాయి. కాని తాను కంకణం కట్టుకున్నాడు. ప్రొడ్యూసర్ కూడా చావో రేవో అంటున్నాడు. కాని భగత్ సింగ్ గురించి సమాచారమే లేదు. పంజాబ్‌లో ఉన్న తల్లి దగ్గరకు వెళితే ఆశీర్వాదం దక్కింది. బంధువుల దగ్గరకు వెళితే ఛీత్కారమే ఎదురయింది. చివరకు తాను పుస్తకాల్లో ఏరుకున్న సమాచారం నుంచే మనోజ్ కుమార్ కథను రాసుకున్నాడు. అయితే అసలు సమస్యంతా లొకేషన్‌లో వచ్చింది. దర్శకుడిగా పెట్టుకున్న రామ్‌శర్మకు దర్శకత్వం రాదు. వచ్చన్నావ్? అంటే అనుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ బరువు కూడా తనే నెత్తిన వేసుకున్నాడు.
 చివరకు షహీద్ విడుదల అయ్యింది.

1965... షహీద్ నామ సంవత్సరంగా నిలిచింది.పెద్ద హిట్. భగత్ సింగ్‌గా వేసిన ఆ నటుడు మనోజ్ కుమార్ పెద్ద హిట్. ఈ మాత్రం దేశభక్తిని చూపించే వాళ్లు ఏరి? మరో పొగడ్త కాచుకుని ఉంది. ఆ రోజు మనోజ్ కుమార్ ఫోన్ మోగింది. ‘మనోజ్ కుమార్?’ ‘ఎస్ సర్. మీరెవరు?’ ‘నేను లాల్ బహదూర్‌శాస్త్రిని. ఒకసారి టీ పుచ్చుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కు రాగలరా?’
     
షహీద్ చూసిన లాల్‌బహదూర్ శాస్త్రి మనోజ్ కుమార్‌ని ఒక కోరిక కోరారు. ‘జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని బలపరిచే సినిమా ఏదైనా తీయగలవా?’ ఒక ప్రధాని కోరిక. తన దేశం తన ప్రేమ ప్రకటనకు వీలైన కోరిక.ఒక మనిషికి ఎంతటి అంతర్గత శక్తి ఉంటుందనే దానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ప్రోత్సహించే తోడు దొరికితే ఆ శక్తి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఢిల్లీ నుంచి బొంబాయి తిరుగు ప్రయాణానికి మనోజ్ కుమార్ రైలు ఎక్కాడు. తన బెర్త్ మీదకు చేరాక రాయడం మొదలుపెట్టాడు. ఏం స్టేషన్ వస్తోందో ఏం స్టేషన్ పోతోందో అనవసరం.రాస్తూనే ఉన్నాడు. బొంబాయి వచ్చేసరికి చేతిలో స్క్రిప్ట్ ఉంది.పేరు- ఉప్‌కార్.
     
మేరే దేశ్ కి ధర్తీ ఉగలే సోనా మోతీ మేరే దేశ్ కి ధర్తీ... ‘ఉప్‌కార్’ పెద్ద హిట్. హీరో తనే. నిర్మాత తనే. దర్శకుడూ తనే. జనం విరగబడి చూశారు. ఎందుచేతనో వాళ్లకు అతణ్ణి మనోజ్ కుమార్ అని పిలవడం ఇష్టమనిపించలేదు. ఇంకా దగ్గరగా పిలిచుకోవాలి. ప్రేమగా పిలుచుకోవాలి. గౌరవంగా పిలుచుకోవాలి. ఎస్. మిస్టర్ భారత్. ఆ రోజు నుంచి మనోజ్ కుమార్ ముద్దు పేరు మిస్టర్ భారత్ అయ్యింది.
     
కల్చర్‌ను అరువు తెచ్చుకోవడం సినిమా వాళ్ల పని.కాని కల్చర్‌ను ప్రశ్నించడం మనోజ్ కుమార్ పని.డెబ్బైల కాలం నాటికి వెర్రి తలలు వేస్తున్న పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని ప్రశ్నించడానికి ఈ దేశ సంస్కారాన్ని గుర్తు చేయడానికి మనోజ్ కుమార్ సినిమా తీశాడు. పేరు ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’. పెద్ద హిట్. ఈ దేశంలో పేరుకు పోయిన అవినీతి, బ్లాక్ మార్కెటింగ్, లంచాలు వీటిని ప్రశ్నిస్తూ... వీటి వల్ల రగిలిపోతున్న నిరుద్యోగ యువత గుండె మంటలను చూపిస్తూ మరో సినిమా తీశాడు. ‘రోటీ కప్‌డా ఔర్ మకాన్’. అదీ పెద్ద హిట్టే.పార్కులూ చెట్లు పుట్టలూ త్రికోణాకార ప్రేమలూ... వీటన్నింటి మధ్య ఎప్పుడూ మనోజ్ కుమార్ దేశం కోసం ఆలోచించే ఒక నిజమైన హీరోలా మిగిలాడు. ఒక్క మనిషిలో చిన్న మార్పు వచ్చినా అది జాతీయ జెండాను ఎగురవేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదు.
     
1981. మనోజ్ కుమార్ జీవితంలో ఉత్తేజకరమైన సంవత్సరం. ఆ సంవత్సరమే ఎవరి పేరు పెట్టుకుని ఈ రంగంలోకి వచ్చాడో ఎవరి స్ఫూర్తితో నటన నేర్చుకున్నాడో ఎవరిని చూస్తూ కెరీర్‌ను నిర్మించుకున్నాడో ఆ హీరో- దిలీప్ కుమార్‌ను డెరైక్ట్ చేసే అవకాశం వచ్చింది. సినిమా- క్రాంతి. మనోజ్ కుమార్, శశి కపూర్, శతృఘ్న సిన్హా, హేమమాలిని... భారీ తారాగణం అంతా నటించింది. మరో శక్తివంతమైన దేశభక్తి సినిమా.సూపర్ డూపర్ హిట్. ఈ దేశానికి మనోజ్ ఎప్పుడూ అపకారం చేయలేదు. ఈ దేశం కూడా అతడికి ఎప్పుడూ అపకారం లేదు. ఒక రూపాయికి పది రూపాయలు ఇచ్చి అక్కున చేర్చుకుంది.
     
మనోజ్ కుమార్ గొప్ప నటుడు అంటే కొందరికి అభ్యంతరం ఉండొచ్చు కాని అతడు గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు అంటే మాత్రం అంగీకారం ఉంటుంది. దర్శకత్వంలో చాలామంది శిష్యులను తయారు చేశాడు. అమితాబ్ బచ్చన్‌కు ‘రోటీ కప్‌డా ఔర్ మకాన్’లో మంచి వేషం ఇచ్చి అతడు నిలదొక్కుకునేలా చేశాడు.  కెరీర్ తొలిరోజుల్లో ఉండగా ధర్మేంద్ర ఒక దశలో వేషాలు రాక విసుగెత్తిపోయి సొంత ఊరికి వెళ్లడానికి సిద్ధమై పోతే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇచ్చి ఈ ఒక్క నెల ఆగు... అప్పుడు కూడా అవకాశం రాకపోతే వెళ్దువుగాని అని ఆపాడు. ఆ నెలే ధర్మేంద్రకు హీరో అవకాశం వచ్చింది. ఆ సంగతి ఇప్పటికీ ధర్మేంద్ర కృతజ్ఞతగా చెప్పుకుంటాడు.
     
మిస్టర్ భారత్ అనే బిరుదు మనోజ్ కుమార్‌కు గొప్ప గౌరవమే. కాని దానిని నిలబెట్టుకోవడం ఒక్కోసారి భారమైంది కూడా. అతడు సిగరెట్ తాగుతున్నా వచ్చి అంత పెద్ద బిరుదు ఉన్నవాడివి నిర్బాధ్యతగా ఉంటావా అని మందలించేవారు ఎదురయ్యేవారు. సినిమాల్లో రొమాన్స్ చేయడానికి వీలయ్యేది కాదు. అల్లరి చిల్లరి వేషాలూ వేసే అవకాశం పోయింది. కాని మనోజ్ ఇవన్నీ ఇష్టంగానే స్వీకరించాడు. ఎందుకంటే ప్రపంచానికి ముద్దుబిడ్డ- భారత్. భారత్‌కు ముద్దు బిడ్డ- మిస్టర్ భారత్.జై భారత్. - నెటిజన్ కిశోర్
 
టాప్ టెన్
ఓ కౌన్ థీ     1964
షహీద్     1965
హిమాలయ్ కి గోద్ మే     1965
గుమ్‌నామ్    1965
దో బదన     1966
 ఉప్‌కార్     1967
పూరబ్ ఔర్ పశ్చిమ్    1968
రోటీ కప్‌డా ఔర్ మకాన్     1974
దస్ నంబరి     1976
క్రాంతి     1981
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement