ఆ దేవుడు నా మాట విన్నాడు : నమిత | Couples EXCLUSIVE Interview Namitha And Veerandra | Sakshi
Sakshi News home page

ఆ దేవుడు నా మాట విన్నాడు : నమిత

Published Mon, Jan 15 2018 1:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Couples EXCLUSIVE Interview Namitha And Veerandra - Sakshi

తూర్పు పడమరలు ఆపోజిట్‌. ఈ తూర్పూ పడమరలు అఫెక్షనేట్‌! సూరత్‌ అమ్మాయి నమిత.. శ్రీకాకుళం అబ్బాయి వీర.. ఇరు దిక్కుల తమ బాంధవ్యానికినలుదిక్కుల నుంచి ఆశీర్వచనాలు కోరుకుంటున్నారు.

‘నేను సినిమా హీరోయిన్‌ని.. పెళ్లవుతుందా?’ అని ఆలోచించిన రోజులేమైనా?
చాలా ఆలోచించేదాన్ని. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా, పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలని ఉండేది. మంచి లైఫ్‌ పార్టనర్‌ రావాలని కోరుకునేదాన్ని. మాకు బోలెడంత మంది పిల్లలు ఉండాలనుకునే దాన్ని. ఓ అమ్మాయికి ఉండే ‘జెన్యూన్‌’ ఫీలింగ్స్‌ ఇవి. నా ఆలోచనల్లో నిజాయితీ ఉంది కాబట్టే ‘వీర’ లాంటి జెన్యూన్‌ పర్సన్‌ని భర్తగా పొందే అర్హత నాకు ఉందనిపించింది. 

బోలెడంత మంది పిల్లలు కావాలనే కోరిక ఉందన్నారు. మరి మమ్మీగా ఎప్పుడు ప్రమోషన్‌?
ఆల్రెడీ నా అన్న కూతురికి నేను అమ్మనే. ఇంట్లో ఉన్న పెట్స్‌కి మమ్మీనే. అయితే ఫిజికల్‌గా బర్త్‌ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకని కొంచెం టైమ్‌ తీసుకోవాలనుకుంటున్నాను.

‘మిస్‌’ నమిత నుంచి ‘మిసెస్‌’ నమిత అయ్యాక జీవితం ఎలా ఉంది?
చాలా కలర్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక మంచి స్పేస్‌లో ఉన్నాననే భరోసా ఏర్పడింది.

వీర మీకు మంచి జీవిత భాగస్వామి అవుతారని మీకు ఎప్పుడు అనిపించింది?
ఒక అబ్బాయి గురించి ఆలోచించినప్పుడు ‘ఇతను మంచి భర్త మాత్రమే  కాదు.. మంచి తండ్రి కూడా అవుతాడు’ అనే ఫీలింగ్‌ కలిగిందంటే.. అతను మంచి జీవిత భాగస్వామి అవుతాడని నా నమ్మకం. వీరతో పరిచయం నాకా ఫీలింగ్‌ని కలిగించింది. ఏదైనా స్ట్రయిట్‌ ఫ్రమ్‌ హార్ట్‌ మాట్లాడతాడు. డ్రామా యాడ్‌ చేయడు. చాలా జెన్యూన్‌ పర్సన్‌. తన సమక్షంలో ఉన్నప్పుడు ఓ ‘ప్రొటెక్టివ్‌’ ఫీల్‌ కలుగుతుంది. ఏ భయమూ లేకుండా మిగతా జీవితాన్ని గడిపేయొచ్చనే నమ్మకం ఏర్పడింది. మా ఇద్దరిదీ ‘సోల్‌ కనెక్షన్‌’ అనిపించింది. అందుకే తను ప్రపోజ్‌ చేయగానే పెళ్లికి ఒప్పుకున్నాను.

శ్రీకాకుళం అబ్బాయితో సూరత్‌ అమ్మాయి పెళ్లి! ఇంట్లోవాళ్లు ఏమీ అనలేదా?
జనరల్‌గా కొంతమంది పేరెంట్స్‌ సినిమాల్లోకి వెళతానంటే ఒప్పుకోరు. కానీ నా పేరెంట్స్‌ నేనేం చేసినా కాదనలేదు. సినిమాల్లోకి వెళ్తానంటే సపోర్ట్‌ చేశారు. పెళ్లి గురించి చెప్పినప్పుడూ సపోర్ట్‌ చేశారు.

తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు?
ఏడాదికి రెండుసార్లయినా నేను తిరుపతి వెళతాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు బలమైన నమ్మకం. ఆ దేవుడు నా మాటలు వింటాడని నమ్ముతాను. నాకు బెటర్‌ లైఫ్‌ ఇస్తాడని నమ్మాను. నిజంగానే అదే జరిగింది. అందుకే ఆ దేవుడి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వీర కూడా ఓకే అన్నాడు.

హీరోయిన్స్‌ని ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. సమాజం ఇలా ఉన్నప్పుడు వీర మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం ఎలా అనిపించింది?
మీరన్నది కరెక్టే. అయితే అందరూ అలా ఉండరు. వీరలాంటి వాళ్లు కూడా ఉంటారనడానికి మా పెళ్లి ఓ ఎగ్జాంపుల్‌. అయినా చేసే ప్రొఫెషన్‌ని బట్టి ఎవరినీ జడ్జ్‌ చేయకూడదు. వీర, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్పుడు చాలా ఆలోచించాం. ఎందుకంటే జీవితాంతం కలిసి బతకాల్సిన వాళ్లం. ‘నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని తను ప్రపోజ్‌ చేసినప్పుడు నా కల నిజమైంది అనిపించింది. ‘నో’ చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. ఎందుకంటే పరిచయమైన ఏడాదికి తను నాకు ప్రపోజ్‌ చేశాడు. అంటే.. నన్ను అర్థం చేసుకున్నాడనే కదా.

ప్రేమ అంటే మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించడమే. మీరు బొద్దుగా ఉంటారు కాబట్టి బరువు తగ్గమని వీర సజెస్ట్‌ చేశారా?
యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నదానికన్నా ఓ పది కిలోలు తక్కువగా ఉండేదాన్ని. నాకు నోస్‌ అలర్జీ ఉండేది. ఎప్పటినుంచో ఉన్నప్పటికీ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పెళ్లికి రెండు నెలల ముందు సీరియస్‌ అయింది. దాంతో నేను బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. వర్కవుట్స్‌ చేయడానికి కుదిరేది కాదు. వెయిట్‌ చాలా పెరిగాను. ‘ఇలా అయిపోతున్నాను’ అంటే ‘ఏం ఫర్వాలేదు. పెళ్లి తర్వాత వర్కవుట్స్‌ చేసి, తగ్గుదువుగాని. లేకపోయినా ఓకే’ అని వీర అన్నాడు. మ్యారేజ్‌ అయ్యాక వర్కవుట్స్‌ మొదలుపెట్టాను. నాలుగు కిలోలు తగ్గాను. హెల్త్‌ గురించి కేర్‌ తీసుకోవాలి కాబట్టి నా అంతట నేనే తగ్గడం మొదలుపెట్టాను.

మీకు గ్లామర్‌ క్వీన్‌ అనే ఇమేజ్‌ ఉంది. ఇకముందు కూడా ఆ ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్స్‌ చేస్తారా? అసలు సినిమాలు కంటిన్యూ చేస్తారా?
సినిమాలు మానేయడం ఎందుకండి? పెళ్లయితే జాబ్‌ మానేయాలని రూలేం లేదు కదా. అలాగే  క్యారెక్టర్స్‌ సెలెక్ట్‌ చేసుకునే విషయంలో కూడా ఏ మార్పూ ఉండదు. వీర నన్ను సినిమాలు మానేయమని చెప్పలేదు. క్యారెక్టర్‌ గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్‌ చేస్తే నో ప్రాబ్లమ్‌. ఫర్‌ ఎగ్జాంపుల్‌ హాలీవుడ్‌ మూవీ ‘సూసైడ్‌ స్క్వాడ్‌’లో మార్గెట్‌ రాబీ చేసిన క్యారెక్టర్‌ని తీసుకుంటే చాలా గ్లామరస్‌గా ఉంటుంది. సేమ్‌ టైమ్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్స్‌ వస్తే చేస్తాను.

మీ అత్తమామల్ని ఏమని పిలుస్తున్నారు.. వీరాగారికి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఉన్నారా?
అత్తయ్యగారూ, మామయ్యగారూ అని పిలుస్తున్నాను. వీరాకి ఒక చెల్లెలు ఉంది. తను నాకు ‘ఆడొపచు’.. ఏంటో సరిగ్గా నోరు తిరగడంలేదు. చిన్నమ్మాయి. పాతికేళ్లు కూడా లేవు. వదినా అంటూ నాతో బాగుంటుంది. 

‘ఎఐఎడిఎంకె’ పార్టీలో ఉన్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ, తమిళనాడు రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. మీరేమైనా పార్టీ మారాలనుకుంటున్నారా?
ప్రస్తుతానికి ఎఐఎడిఎంకేలో ఉన్నాను. భవిష్యత్తులో వేరే పార్టీకి మారతానా.. అనేది ఇప్పుడు చెప్పలేను. తమిళనాడులో రాజకీయాల పరిస్థితి అయోమయంగా ఉంది. చూడాలి. మంచి మార్పు రావాలి. ప్రజలకు మేలు జరగాలి.

రజనీకాంత్‌గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సీఎం అయితే న్యాయం చేస్తారనుకుంటున్నారా?
రజనీకాంత్‌గారు సూపర్‌ స్టార్‌. ప్రజల గుండెల్లో బోలెడంత స్థానం సంపాదించుకున్నారు. కానీ, ఆయన రాజకీయాల్లోకి వస్తే న్యాయం చేస్తారా? ఏం చేస్తారు? అనేది ఇప్పుడే చెప్పలేను. జడ్జ్‌ చేయలేం.

ఆడొపచు కాదు.. ఆడపడుచు అంటారు.
ఓహ్‌.. ఆడపడుచు.. ప్రాక్టీస్‌ చేస్తా. (నవ్వుతూ)

మాది ఆత్మబంధం : వీర



బీచ్‌ ఒడ్డున క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేసి, నమితకు లవ్‌ ప్రపోజ్‌ చేశారట.. ఐడియా బాగుంది!

థ్యాంక్స్‌ అండీ.. 2016 సెప్టెంబర్‌ 6న మా ఇద్దరి కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా నమితకు, నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్పుడు నమిత ఆలోచనలు, అభిరుచులు తెలిశాయి. ఇలా ప్రపోజ్‌ చేస్తే తనకు నచ్చుతుందని గ్రహించాను. బేసిక్‌గా నేను రైటర్‌ని. పొయెటిక్‌గా నా లవ్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేయాలనుకున్నా. కోవలమ్‌ బీచ్‌ బెస్ట్‌ అనిపించింది. ఫస్ట్‌ టైమ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత విపరీతమైన గాలి! దాంతో కుదరలేదు. సెకండ్‌ టైమ్‌ వర్షం వచ్చింది. ఆ ప్లాన్‌ కూడా వర్కవుట్‌ కాలేదు. థర్డ్‌ టైమ్‌ ప్రకృతి సహకరించింది (నవ్వుతూ). పైగా ఆ రోజు ఫుల్‌ మూన్‌ డే. పండు వెన్నెల సాక్షిగా నమితకు ప్రపోజ్‌ చేశాను. ఓకే చెప్పింది. 2017 నవంబర్‌లో పెళ్లి చేసుకున్నాం.

నమితగారిలో మీకు నచ్చిన విషయాలేంటి?
నేనేదైనా ఓపెన్‌గా మాట్లాడతాను. తనూ అంతే. ఇద్దరి ఆలోచనలూ చాలా క్లియర్‌గా ఉంటాయి. కొన్ని థాట్స్‌ కలిశాయి. కలిసి జీవించడానికి ఇది చాలనిపించింది. బేసిక్‌గా తను చాలా మంచి అమ్మాయి.

మీ ఇద్దరూ లవ్‌లో పడక ముందు వేరేవాళ్లతో లవ్, బ్రేకప్‌ ఇన్సిడెంట్స్‌ ఉన్నాయి. వాటి గురించి ఓపెన్‌గా మాట్లాడుకున్నారా? ఓ బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆ బ్రేకప్‌ మీకు నేర్పించిందా?
యస్‌. నేనూ ఒక అమ్మాయిని ప్రేమించాను. విడిపోయాను. నమిత లైఫ్‌లో కూడా ఇలాంటి ఓ ఇన్సిడెంట్‌ ఉంది. వాటి గురించి మేం మాట్లాడుకున్నాం.  గతం గతః అనుకున్నాం. భవిష్యత్తులో కలిసి నడవాలనుకున్నాం. ఓ బ్రేకప్‌ మంచి లెసన్‌ అవుతుంది. ఆ లెసన్‌ ఇప్పటి బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే  క్లారిటీ ఇచ్చింది.

జనరల్‌గా గ్లామరస్‌ ఫీల్డ్‌లో ఉన్న అమ్మాయిలను ఆరాధిస్తారు కానీ ‘మంచి’గా ఆలోచించే మనసు చాలామందికి ఉండదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు కూడా...
మా ఇంట్లో నా ఇష్టాలను కాదనరు. క్లారిటీతో ఉంటాననే నమ్మకం వాళ్లకు ఉంది. మీరన్నట్లు హీరోయిన్‌లను అందరూ ఆరాధిస్తారు. కానీ పెళ్లి చేసుకోమంటే ఆ ఆరాధించేవాళ్లే ముందుకు రారు. ‘వాళ్లు అలా అట.. ఇలా అట’ అని ఊహించుకుంటారు. అబ్బాయిల గురించి కూడా అలాగే అనుకుంటారు. కానీ నేనేంటో నమితకు తెలుసు. తనేంటో నాకు తెలుసు. మాది ‘ఆత్మబంధం’.

మీరు శ్రీకాకుళం (ఈస్ట్‌) అబ్బాయి. నమిత వెస్ట్‌ (సూరత్‌) అమ్మాయి. ఉంటున్నదేమో చెన్నైలో. మరి.. ఒకరి సంప్రదాయాలకు ఒకరు అలవాటయ్యారా?
నమిత ఇప్పుడు సౌత్‌ అమ్మాయి. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది కాబట్టి, ఇక్కడి సంప్రదాయాలు బాగా తెలుసు. నాకు వాళ్ల ట్రెడిషన్స్‌ తెలియదు. వాళ్ల సంప్రదాయాలు ఎలా ఉంటాయో పెళ్లప్పుడు కొంచెం తెలిసింది. ఈస్ట్, వెస్ట్‌.. అండర్‌ వన్‌ రూఫ్‌. మనసులు కలిస్తే చాలండి. భాష, ప్రాంతం అడ్డుకావు.

కొత్త అల్లుణ్ణి ఇంటికి పిలుస్తుంటారు అత్తింటివాళ్లు. మిమ్మల్ని పిలిచారా?
సూరత్‌ రమ్మని మా అత్తయ్య, మావయ్య పిలిచారు. కానీ మేం వెళ్లలేదు. బేసిక్‌గా నేనలా ఫార్మాలిటీస్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసే అల్లుణ్ణి కాదు (నవ్వుతూ). చెన్నైలో చాలా పనులు ఉండటంవల్ల ఇంకోసారి వెళ్దామనుకున్నాం.

మీ అయిష్టాన్ని నమితగారి కోసం ఇష్టంగా మార్చుకున్నది ఏదైనా?
నమితకు పిజా, చాక్లెట్స్‌ ఇష్టం. నాకు అవంటే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు ఇష్టంగా మార్చుకున్నాను. చాక్లెట్స్‌ తింటున్నాను.
 
మీ బ్యాగ్రౌండ్‌ ఏంటి?
మా నాన్నగారు, అంకుల్‌ మయూరి ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఉండేవారు. నేను ఆర్టిస్ట్‌ని, ప్రొడ్యూసర్‌ని, రైటర్‌ని. ఇప్పుడు నేను, నమిత కలిసి ఒక కాన్సెప్ట్‌ అనుకున్నాం. మంచి కథలతో వచ్చే కొత్త డైరెక్టర్స్‌కి చాన్స్‌ ఇవ్వాలనుకుం టున్నాం. అలాగే, డబ్బుండి కూడా సినిమాలు ఎలా తీయాలో తెలియని ప్రొడ్యూసర్స్‌కి హెల్ప్‌ చేయాలనుకుంటున్నాం. వాళ్లు ఏ మాత్రం నష్టపోని విధంగా ఓ కాన్సెప్ట్‌ డిజైన్‌ చేశాం. సో.. నిర్మాతలను కూడా ఎంకరేజ్‌ చేద్దామనుకుం టున్నాం. నమిత అండ్‌ వీరని ట్రస్ట్‌ చేస్తే చాలు. టాలెంట్‌ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎలా కలవాలో తెలియకపోతే veera.official∙అనేది నా ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌. దాని ద్వారా సంప్రదించవచ్చు.

నమితగారితో కలిసి మీరు యాక్ట్‌ చేశారా?
మేమిద్దరం కలిసి ‘మియా’ అనే మలయాళ సినిమాలో భార్యాభర్తలుగా యాక్ట్‌ చేశాం. నేను విడిగా తమిళ్, మలయాళ సినిమాల్లో నెగటివ్, పాజిటివ్‌ క్యారెక్టర్స్‌ చేస్తుంటాను.

ఇప్పుడు మీరు, నమితగారు కలిసి నటిస్తారా?
తప్పకుండా చేయాలని ఉంది. ఓ కాన్సెప్ట్‌ తయారు చేయించాం. 

                                                  (భర్త వీరతో నమిత )

ఇంటర్వ్యూ: డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement