వెంట్రుకళ!
ట్రెండ్
ఛాతి మీద వెంట్రుకలు ‘మగటిమి’ని ప్రతిబింబిస్తాయనేది చాలామంది పురుషుల నమ్మకం. అదిసరేగాని, ఇలా ఎంత కాలమని వాటిని చూసి మురిసిపోవడం? అందుకే ఛాతి వెంట్రుకలను రకరకాల డిజైన్లుగా మలుచుకొని మురిసిపోతున్నారు బ్రిటన్‌లోని పురుషులు. ఇప్పుడు ఇదొక ట్రెండుగా కూడా మారింది. వెంట్రుకలతో రకరకాల డిజైన్లు రూపొందించడానికి ‘స్టార్ స్టైలీస్ట్‌లు’ కొందరు దుకాణాలు కూడా తెరిచారు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీం హెయిర్ స్టయిల్‌ను రూపొందించిన డేనియల్ జాన్‌సన్‌కు ఇప్పుడు ‘కత్తెర’ నిండా పని. ఆయన ముందు పురుషులు బారులు తీరుతున్నారు.
ఇప్పుడు చెస్ట్ కళారూపాలు సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు జంతువుల ఆకారంలో, కొందరు తమకు ఇష్టమైన సెలబ్రిటీల పోలికలతో తమ ఛాతీ రోమాలను ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నారు. అయితే ఇలా ట్రిమ్మింగ్ చేయించుకోవడం అంత వీజి ఏమీ కాదు. చాలా ఓపిక కావాలి. రెండున్నర గంటల సమయాన్ని దీని కోసమే వెచ్చించాలి. కళారూపాలను ట్రిమ్ చేయడానికి నాలుగు రకాలైన సాధనాలు వాడుతారు.
‘‘చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. ఏమరుపాటుగా ఉంటే...రక్తం కళ్ల చూడాల్సి వస్తుంది’’ అంటున్నాడు డిజైనర్ జాన్‌సన్.
ఈ ట్రెండ్ రేపోమాపో మన దేశానికి కూడా వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.