పంటల వంటలు | Crops Dressings | Sakshi
Sakshi News home page

పంటల వంటలు

Published Mon, Sep 7 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

పంటల  వంటలు

పంటల వంటలు

దేహంలోని కణకణానికి...
ఆహార గుణానికి...
ఆరోగ్య ధనానికి ఏకైక మంత్రం చిరుధాన్యం!
ఊదలు, వరిగలు, సామలు, ఆరికెలు, సజ్జలతో ఎంతో రుచికరంగా
కేకు, ఆపం, పుట్టు, పలావు, గారెలు తయారు చెయ్యొచ్చు.
ఈ పంటల వంటను ఆరగించి
ఆరోగ్యంగానూ ఉండొచ్చు.  

 
వరిగ పుట్టు

 
తయారీకి పట్టే సమయం: 30 ని.లు ఇద్దరికి సరిపోతుంది
కావలసిన పదార్థాలు: వరిగ బియ్యం-1 గ్లాసు, కొబ్బరి తురుము-అర కప్పు, ఉప్పు-అర చెంచా
 తయారు చేసే విధానం:  వరిగ బియ్యం 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుని, వడగట్టి, గుడ్డమీద నీడలో 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి.  కొంచెం తడిగా ఉండగానే దీనిని మరపట్టించుకోవాలి.  దీనిని బాణలిలో నూనె లేకుండా తేమ అంతా పోయి పొడిగా అయ్యేవరకూ వేయించుకోవాలి.  తరువాత దీనిని తేమ తగలకుండా ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టు చేసుకోవచ్చు.  వెడల్పాటి పళ్లెం తీసుకుని, పైన తయారు చేసుకున్న పొడిని పళ్లెంలో పరుచుకుని, దీనికి అర చెంచా ఉప్పు కలుపుకుని, కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ వేళ్లతో బాగా వత్తుకుంటూ పొడిపొడిగా, తేమగా కలుపుకోవాలి. ప్రతి రేణువు తేమని పీల్చుకోవాలి కాని పొడిగా ఉండాలి. చేత్తో నొక్కితే ముద్దగా అయేటట్టు, నలిపితే పొడిపొడిగా అయ్యేట్టు కలుపుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు దీనిని పుట్టు తయారు చేసే గొట్టంలో కొంచెం కొబ్బరి కోరు, కొంచెం పైన తయారు చేసుకున్నట్టు పుట్టు పిండిని, మరలా కొంచెం కొబ్బరి కోరు, కొంచెం పుట్టు పిండిని పొరలు పొరలుగా నింపుకుని, ఆవిరి మీద 6 నుంచి 7 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో బలమైన, రుచికరమైన వరిగ పుట్టు తయారవుతుంది. దీనిని శనగల కూరతో తింటే బాగుంటుంది.
 
సజ్జ గారెలు

 
తయారీకి పట్టే సమయం: 25 ని.లు మొత్తం 12-15 గారెలు తయారవుతాయి
కావలసిన పదార్థాలు: సజ్జపిండి-1 కప్పు, ఉల్లితరుగు-పావు కప్పు, జీలకర్ర-1 చెంచా, కారం-1 చెంచా, పచ్చిమిర్చి తరుగు-1 చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద-1 చెంచా, కరివేపాకు-1 రెమ్మ, ధనియాల పొడి-అర చెంచా, నూనె-గారెలు వేయించుకునేందుకు సరిపడా, ఉప్పు-తగినంత
 తయారు చేసే విధానం:  ఒక వెడల్పాటి పాత్రలో సజ్జపిండి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసుకుని తగినంత ఉప్పు చేర్చి, సరిపడ నీళ్లతో చపాతీ పిండిలా కలుపుకోవాలి.   అరిటాకు మీద కానీ, పలుచటి తడిబట్ట మీద కానీ, పైన తయారు చేసుకున్న సజ్జ పిండితో గారెలు వత్తుకుని, నూనెలో రెండువైపులా దోరగా వేయించుకుంటే సజ్జగారెలు తయారవుతాయి.
 
 
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
 
ఇటీవలి కాలంలో జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల... మధుమేహం, బీపీ వంటి జీవన శైలి రుగ్మతల వల్ల తృణధాన్యాల వాడకంపై మొగ్గుచూపుతున్నారు. బియ్యంలోకన్నా ఎక్కువగా బీకాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, పీచుపదార్థాలు తృణధాన్యాలలోనే అధికంగా లభ్యమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.  రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలను ఏదో ఒక రకంగా ఆహారంలో భాగం చేసుకుంటే వాటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన శరీరానికి పడతాయి. ఇలాంటి తృణధాన్యాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తే రుచికి రుచీ, కొత్తదనానికి కొత్తదనమూ ఆరోగ్యానికి ఆరోగ్యమూ!
 - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్
 
ఊద కేక్

 
తయారు చేయుటకు పట్టే సమయం: 40 ని.లు ఆరుగురికి సరిపోతుంది
కావలసిన పదార్థాలు: ఊద పిండి - ముప్పావు కప్పు, గోధుమపిండి-పావు కప్పు, పటికబెల్లం పొడి-1 కప్పు, వెన్న లేక నెయ్యి-అర కప్పు, పాలు-అర కప్పు, బేకింగ్ పౌడర్-1 చిన్న చెంచా, సోడా ఉప్పు-1/2 టీ చెంచా, యాలకులు-1 చిన్న చెంచా, దాల్చినచెక్క పొడి-1 చిన్న చెంచా

తయారు చేయు విధానం:  ఊదపిండి, గోధుమపిండి, బేకింగ్ పౌడర్, సోడా ఉప్పు, యాలకులు, దాల్చినచెక్క పొడి అన్నీ కలుపుకుని జలిలంచి పక్కన పెట్టుకోవాలి.  వెడల్పాటి పాత్రలో వెన్న/నెయ్యి తీసుకుని దానికి పటిక బెల్లం పొడి కలుపుకుని మధ్యమధ్యలో కొంచెం కొంచెం పాలు కలుపుతూ బాగా నురగ బయటికి వచ్చేదాకా చిలక్కొడుతూ ఉండాలి.  తర్వాత ఈ మిశ్రమానికి తయారుగా జల్లించి పెట్టుకున్న ఊదపిండిని కొంచెం, కొంచెం కలుపుతూ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. పిండి అంతా కలిపిన తర్వాత 2 నిమిషాలు మిశ్రమాన్ని బాగా కలియపెట్టాలి.  వెడల్పాటి అంచు ఉన్న పళ్లానికి వెన్న లేక నెయ్యి రాసి పైన తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పోసుకుని పైనుంచి మనకు నచ్చిన డ్రైఫ్రూట్స్ జల్లుకుని, ఇడ్లీ పాత్రలో 20 నిమిషాలు ఆవిరి పట్టుకుంటే కమ్మని ఊద కేక్ తయారవుతుంది.
 
సామ ఆప్పమ్
 
తయారీకి పట్టే సమయం: 20 ని.లు (నాన-పులియ పెట్టుకోవటానికి పట్టే సమయం కాకుండా) 10 ఆపాలు తయారవుతాయి
 కావలసిన పదార్థాలు: సామలు-1 గ్లాసు, అటుకులు-పిడికెడు, కొబ్బరి తురుము-2 పిడికిళ్లు, ఈస్ట్-చిన్న చెంచా, పటికబెల్లం పొడి-ఒక చెంచా, ఉప్పు-తగినంత, నూనె లేక నెయ్యి-తగినంత

తయారు చేయు విధానం:  సామ బియ్యం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.  అరగ్లాసు వేడినీళ్లు తీసుకుని దానిలో ఈస్ట్, పటికబెల్లం పొడి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.  5 నిమిషాలు నానబెట్టుకున్న అటుకులు, కొబ్బరి తురుము కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.  ఇప్పుడు దీనికి బాగా నానిన సామ బియ్యం, ఈస్ట్ కూడా చేర్చి, బాగా మెత్తగా రుబ్బుకోవాలి.  మెత్తగా రుబ్బుకున్న ఈ ఆప్పమ్ మిశ్రమాన్ని 6 గంటలు పక్కన పెట్టుకోవాలి.   6 గంటల తర్వాత ఈ పిండిలో తగినంత ఉప్పు చేర్చుకుని, ఆప్పమ్ చట్టిలో (బాణలిలో) పోసుకుని, కొంచెం నెయ్యి కాని నూనె కాని వేసి, పైన మూతపెట్టి చిన్న మంటమీద కాల్చుకోవాలి.  ఆప్పమ్ ఒక పక్క మాత్రమే కాల్చుకోవాలి. ఇది చాలా మృదువుగా, రుచిగా ఉంటుంది.  కొబ్బరి పాలు కాని, కొబ్బరి చట్నీతో కాని తినవచ్చు.
 
ఆరిక పలావు

 
 తయారీకి పట్టే సమయం: 40 ని.లు ఇద్దరికి సరిపోతుంది.
కావలసిన పదార్థాలు: ఆరికలు-1 కప్పు, ఉల్లిపాయలు-1, పచ్చిమిర్చి-3, కూరగాయలు-1 కప్పు (క్యారెట్, బఠాణి, బంగాళదుంప, బీన్స్), అల్లం వెల్లుల్లి ముద్ద-1 పెద్ద చెంచా, షాజీరా-1/2 చెంచా, ధనియాల పొడి-2, నూనె-3 చెంచాలు, నిమ్మరసం-2 చెంచాలు, పుదీనా-1 కట్ట, నెయ్యి-1 చెంచా, ఉప్పు-తగినంత

పలావు మసాలా దినుసులు: పలావు ఆకులు-2, దాల్చిన చెక్క-1, లవంగాలు-4, యాలకులు-2, మిరియాలు-1/2 చెంచా, సోంపు-1/2 చెంచా, జాపత్రి-1
తయారు చేయు విధానం:  ఆరిక బియ్యం రెండు గంటలు నానబెట్టుకోవాలి.
పలావు దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించుకుని, వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.  మందపాటి గిన్నెలో నూనె పోసుకుని వేడి అయిన తర్వాత షాజీరా, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కూరగాయ ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చుకుని, పచ్చివాసన పోయేదాకా కలియబెడుతూ ఉండాలి. తర్వాత దీనికి పలావు దినుసులన్నీ వేసి, మరిగించి, వడకట్టి పెట్టుకున్న నీళ్లు చేర్చి మూతపెట్టి సన్నటి మంటమీద పలావు వండుకోవాలి. మధ్యలో ఒకటి, రెండుసార్లు గరిటతో జాగ్రత్తగా కలియబెట్టుకోవాలి. దించే ముందు ధనియాల పొడి, నిమ్మరసం, నెయ్యి చేర్చి ఒకసారి పూర్తిగా కలియపెట్టుకుని, పుదీనా చల్లుకుంటే మంచి సువాసన, రుచికరమైన ఆరిక పలావు తయారవుతుంది.
 
సేకరణ
‘చిరుధాన్య రుచి’ పుస్తకం నుంచి.
పుస్తక రచయిత నిర్వాణ రాంబాబు
ఎడిటర్, పబ్లిషర్  కె.క్రాంతికుమార్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement