బాదం ఆరోగ్యానికి మంచిది. నిజమే... రోజూ పది బాదం పప్పులు తినాలి. అదీ నిజమే... కానీ మర్చిపోతుంటాం. బాదం ఖీర్... బాదం మిల్క్ తాగడమూ మంచిదే. రోజూ తియ్యగా తాగలేం. మరేం చేద్దాం? బాదం రుచిని కొంచెం కారంగా ఎంజాయ్ చేస్తే! చాలా బాగుంటుంది. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా...మరో టిక్కా! మన వంటింట్లో ఈ వారం ఇలా ట్రై చేద్దాం. ‘బాదం ధర తెలుసా’ అని అడక్కండి. మటన్ ధర కంటే తక్కువే. పైగా మనం వీటికోసం వాడేది కిలోల్లో కాదు... గ్రాముల్లోనే.
చనా మసాలా ఆల్మండ్..
కావలసినవి..
బాదం పప్పులు– 50 గ్రాములు (నానబెట్టి పొట్టు తీయాలి);
ఉల్లిపాయ –1 (తరగాలి);
అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి);
పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;
ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్;
దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క;
చనా మసాలా – టేబుల్ స్పూన్ ;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.
తయారీ..
బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేయాలి.
అవి వేగేటప్పుడు దాల్చిన చెక్క, చనా మసాలా, ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి.
చివరగా బాదంపప్పులు వేసి కలిపి వేడెక్కి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి.
ఇది రోటీలోకి రుచిగా ఉంటుంది. గ్రేవీ కావాలంటే చివరగా అర కప్పు నీటిని పోసి, చిటికెడు ఉప్పు కలపాలి.
కూర ఉడకడం మొదలైన తర్వాత చిక్కదనం చూసుకుని దించేయాలి.
నద్రు ఔర్ బాదం కీ సీఖా, పనీర్ బాదమ్ టిక్కీ
నద్రు ఔర్ బాదం కీ సీఖా..
కావలసినవి..
బాదం పప్పులు– 80 గ్రాములు (పలుచగా తరగాలి);
తామర తూడు – 300 గ్రాములు;
పచ్చిమిర్చి – 4;
అల్లం – 5 గ్రాములు;
వెల్లుల్లి – 10 గ్రాములు;
శనగపిండి – 30 గ్రాములు;
ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
బంగాళదుంప– 1 (మీడియం సైజు);
చీజ్ – 50 గ్రాములు (తురమాలి);
యాలకుల పొడి – పావు టీ స్పూన్;
జాపత్రి – పావు టీ స్పూన్ ;
ఉల్లిపాయలు – 2 (తరగాలి) ;
కోవా – టేబుల్ స్పూన్ ;
కుంకుమ పువ్వు – ఆరు రేకలు;
నూనె – 2 టేబుల్ స్పూన్‌లు
తయారీ..
తామర తూడును శుభ్రంగా కడిగి తరిగి మరుగుతున్న నీటిలో వేసి నాలుగైదు నిమిషాల తర్వాత తీసి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టాలి
బంగాళదుంపను ఉడికించి పొట్టు వలిచి, చిదిమి పక్కన పెట్టాలి
కుంకుమ పువ్వును పావు కప్పు గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలి
అల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టాలి
శనగపిండి నూనె లేని బాణలిలో పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టాలి
ఇప్పుడు బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి తామర తూడులను గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి
ఒక పాత్రలో చీజ్ తురుము, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, యాలకుల పొడి, జాపత్రి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, కుంకుమ పువ్వు కలిపిన నీటిని వేయాలి. బంగాళదుంప, కోవా, ఉల్లిపాయ ముక్కలు వేయాలి
తామర తూడు ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పై దినుసులున్న పాత్రలో వేసి అన్నీ సమంగా కలిసేటట్లు ముద్దగా కలపాలి
ఈ మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి పొడవుగా చేయాలి. మనకు కావల్సిన సైజులో కబాబ్‌లుగా కట్ చేసుకోవాలి
బాదం పలుకులను ఒక ప్లేట్‌లో వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కో కబాబ్‌ని బాదం పలుకులలో అద్ది పక్కన పెట్టాలి.
ఇలా అంతటినీ చేసుకోవాలి.. పైన తామర తూడు వేయించిన బాణలిలోనే మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఒక్కో కబాబ్‌ని పెట్టి మీడియం కంటే తక్కువ మంట మీద ఉంచాలి.
కొంతసేపటికి కబాబ్ ఒకవైపు కాలి గోధుమరంగులోకి మారుతుంది.
అప్పుడు జాగ్రత్తగా తిప్పుతూ అన్నివైపులా దోరగా కాలేవరకు ఉంచాలి. ఇలాగే అన్నింటినీ కాల్చుకోవాలి. వీటికి పుదీన చట్నీ మంచి కాంబినేషన్.
పనీర్ బాదమ్ టిక్కీ..
కావలసినవి..
పనీర్– 2 కప్పులు;బాదం పలుకులు – అర కప్పు;
ఉడికించిన బంగాళదుంప – అర కప్పు;
నూనె– 2 టేబుల్ స్పూన్‌లు;
జీలకర్ర– టీ స్పూన్;
పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్‌లు;
అల్లం తరుగు – 2 టీ స్పూన్‌లు;
పసుపు – అర టీ స్పూన్;
మిరపొ్పడి– అర టీ స్పూన్;
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్‌లు;
కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్;
ఉప్పు – టీ స్పూన్
తయారీ..
పనీర్‌ను ఒక పాత్రలో వేసి పొడిపొడిగా చిదమాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి సమంగా కలిసేటట్లు చిదమాలి
బాణలిలో టీ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేగిన తర్వాత పైన పనీర్, బంగాళదుంప మిశ్రమంలో వేయాలి.
అదే బాణలిలో మిగిలిన నూనెలో మిరపొ్పడి, ఉప్పు వేసి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత అందులో మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేయాలి.
ఇందులో పనీర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి ఫొటోలో కనిపిస్తున్నట్లు ప్యాటీలుగా వత్తాలి.
వత్తిన ప్యాటీలను బాదం పలుకులున్న ప్లేట్‌లో అద్దాలి
అడుగు వెడల్పుగా ఉన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఒక్కో ప్యాటీని ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి.
ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి రెండవ వైపు కూడా కాలనివ్వాలి.
లోపల చక్కగా ఉడికి పైన కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
వీటిని వేడిగా ఉండగానే కెచప్ లేదా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా!
Comments
Please login to add a commentAdd a comment