
పెళ్ళి చేసి చూడు!
• కరెన్సీ కష్టాలు
‘ఇల్లు కట్టి చూడు’ అన్న మాటేమో కానీ... ఇప్పుడు కష్టం తెలియాలంటే... కచ్చితంగా ‘పెళ్ళి చేసి’ చూడాలి. ఉన్న పెద్ద నోటు చెల్లదు... చెల్లే పెద్ద నోటు చేతికి రాదు! బ్యాంకులో డబ్బుంది... చేతిలోనే డబ్బు లేదు! అందుకే, ఆడపిల్ల పెళ్ళితో మధ్యతరగతి తండ్రి కష్టాలకు అంతు లేదు. తరగని ఏ.టి.ఎం. క్యూలు... దొరకని కరెన్సీ సాక్షిగా... ఇప్పుడన్నీ ‘క్యాష్’ లెస్ మ్యారేజ్‌లు... కరెన్సీ కష్టాలతో ‘జోష్’ లెస్ మ్యారేజ్‌లు!
డిసెంబర్ 9... ప్రవీణ్‌కీ, రమ్యకీ పెళ్ళి. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని, పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటున్నారు. మూడేళ్ళ ప్రేమ ఫలిస్తున్నందుకు నిజానికి ఇద్దరూ చాలా సంతోషంగా ఉండాలి. కానీ, ఇద్దరూ చాలా టెన్షన్‌గా ఉన్నారు. పెళ్ళి దగ్గర పడుతోందన్న ఉత్సాహం కన్నా, తేదీ దగ్గర కొస్తోందన్న టెన్షన్ వాళ్ళ ముఖాల్లో కనపడుతోంది. కారణం... కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 8వ తేదీ రాత్రి కేంద్ర సర్కారు హఠాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వాళ్ళకు ఒక్కసారిగా టెన్షన్ తెచ్చి పెట్టింది. పెళ్ళి ఖర్చుల కోసం అప్పటికే పెద్ద మొత్తంలో డ్రా చేసిన డబ్బు బయట తీసుకొనేవాళ్ళు లేరు. బ్యాంకులో ఆ మొత్తం మళ్ళీ డిపాజిట్ చేయడానికి చిక్కులు... కొత్త కరెన్సీ కోసం తిప్పలు... ఈ ఇబ్బందులతో వాళ్ళు ఇప్పుడు తమ పెళ్ళిని ముందు అనుకున్నట్లు ఘనంగా కాకుండా, తక్కువ మంది అతిథుల మధ్య సింపుల్‌గా చేసుకొనే పనిలో పడ్డారు.
మీకు తెలుసా?
ఇవాళ ఇండియాలో పెళ్ళి ఖర్చు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దాదాపు రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల దాకా అవుతోందని అంచనా సగటు భారతీయులు తమ జీవితకాలంలో పోగు చేసుకొనే సంపదలో దాదాపు 5వ వంతు పెళ్ళి ఖర్చుకే పెడుతుంటారట! మన దేశంలో ఏటా బంగారానికి ఉండే డిమాండ్‌లో దాదాపు 50 శాతం పెళ్ళిళ్ళకు ఉండేదే!
బ్యాంకులో ఉంది... చేతికి రాదు!
ఒక్క ఈ జంటే కాదు... దేశం మొత్తం మీద ఇలా పాత నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న పెళ్ళిళ్ళు కొన్ని వేలు ఉన్నాయి. అందులోనూ ఆడపిల్ల తల్లితండ్రుల అవస్థలైతే చెప్పనే అక్కర్లేదు. విజయవాడలో పుట్టి, సినీ పరిశ్రమకు దగ్గరగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ప్రసాద్ దంపతులు అందుకు ఓ ఉదాహరణ. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి! కట్నకానుకలు అడగని మగపెళ్ళివాళ్ళు అడిగిందల్లా - పెళ్ళి కాస్తంత ఘనంగా చేయమని! అందుకు ప్రసాద్ దంపతులు ఆనందంగా సిద్ధపడ్డారు.
ఏర్పాట్లు కూడా చేసుకుంటూ వచ్చారు. అన్నీ కుదుర్చుకొని, పెళ్ళి శుభలేఖలు కూడా కొట్టించి, పంచుతున్న సమయంలో ‘పెద్ద నోట్ల రద్దు’ వార్త వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మోడీ గారి ‘డీమానిటైజేషన్’ సినిమాతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్యాంకు నుంచి అప్పటికే ఈ ఆడపెళ్ళివారు తెచ్చుకున్న పెద్ద నోట్లు చెల్లవు. అక్టోబర్‌లోనే పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోవడంతో, పెళ్ళి ఖర్చుల కోసం బ్యాంకు నుంచి ముందే డబ్బు తీసి పెట్టుకున్న ప్రసాద్ లాంటి వాళ్ళ పాట్లు అన్నీ ఇన్నీ కావు. వాటిని బ్యాంకులో వేసేసినా, అంత మొత్తం కొత్త నోట్లివ్వరు. ఇంట్లో క్యాష్ లేదు. ఏ.టి.ఎం.లో కరెన్సీ రాదు.
ఆలస్యంగా కళ్ళు తెరిచిన ప్రభుత్వం పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు బ్యాంకు నుంచి కొత్తగా రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చని అనుమతించింది. అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) పెట్టిన సవాలక్ష షరతులతో అదీ చాలా కష్టంగా మారింది. ‘పెద్ద నోట్ల ఉపసంహరణ’ కన్నా ముందే బ్యాంకు ఖాతాలో అంత మొత్తం ఉంటేనే, ఈ రెండున్నర లక్షలు విత్ డ్రా చేయడానికి అనుమతిస్తారు. లేదంటే కుదరదు.
అందుకే, పారితోషికం డబ్బు ఇవ్వాల్సినవాళ్ళు చెక్ రూపంలో ఇప్పుడు ఇచ్చినా, ఆ మొత్తం నవంబర్ 8 కన్నా ముందరే ప్రసాద్ బ్యాంకు ఖాతాలో లేదు కాబట్టి, పెళ్ళి ఖర్చుకు రూ. 2.5 లక్షల లెక్కలో ఆ మొత్తం విత్ డ్రా చేయలేని పరిస్థితి ఆ మధ్యతరగతి మనిషికి తలెత్తింది. పిల్ల పెళ్ళి కోసం ఇప్పుడా ఆడపిల్ల తండ్రి తల తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల ఇళ్ళల్లోని పెళ్ళిళ్ళకు మాత్రం ఈ కరెన్సీ కష్టాలేవీ అంటలేదు. గత నాలుగు వారాల్లో పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఆర్భాటంగా జరిగిన ఆడంబర వివాహాలు, మీడియాలో వచ్చిన వాటి వార్తలే అందుకు ఉదాహరణ.
కుటుంబమంతా క్యూలోనే!
బ్యాంకు ఖాతాలో డబ్బున్నా, వారానికి 24 వేల రూపాయలకు మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేదన్న బ్యాంకు నిబంధన. దాంతో, పెళ్ళిళ్ళు ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇంట్లో ఎవరెవరికి ఖాతా ఉంటే, వారంతా వారం వారం క్యూలో నిలబడి డబ్బులు తెస్తున్న సంఘటనలూ ఉన్నాయి. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్న విశాఖపట్నంలోని ప్రభుత్వోద్యోగి నవీన్ కుటుంబం ఇప్పుడు ఆ పనే చేస్తోంది. సీతమ్మధారలోని బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరగడం, క్యూలో గడపడం నిత్యకృత్యమైపోయింది.
మ్యారేజ్... ఓ మెగా ఇండస్ట్రీ!
దేశంలో ఇవాళ వివాహాలు, దాని చుట్టూ జరిగే ఖర్చులు, కొనుగోళ్ళు, వగైరా అంతా ఓ అతి పెద్ద ఇండస్ట్రీ. మన ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ పరిమాణం దాదాపు రూ. 1 లక్ష కోట్ల నుంచి 1.25 లక్షల కోట్లని అంచనా ఈ పరిశ్రమ ఏటా 25 నుంచి 30 శాతం మేర పెరుగుతోంది ఇవాళ మన భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది 29 ఏళ్ళ లోపు వయసు వాళ్ళే! అంటే, రాగల అయిదు నుంచి పదేళ్ళలో ఈ మ్యారేజ్ మార్కెట్ సైజు ఇంకా ఇంకా పెరుగుతుంది పెళ్ళిళ్ళ సీజన్‌లో... ఏటా 3 లక్షల పైగా ఉద్యోగాలు, ఉపాధి వస్తాయట!
పెళ్ళికి పెద్ద అప్పు మిగిలింది!
పెద్ద నోట్ల ఉపసంహరణ దెబ్బ మధ్యతరగతి వాళ్ళ ఇంటిలో పెళ్ళిళ్ళ మీదే కాదు... దిగువ శ్రేణి ఇళ్ళల్లో పెళ్ళిళ్ళపైనా పడింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల పెళ్ళిళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించిన సంక్షేమ పథకాల డబ్బులు కూడా ఇప్పుడు బ్యాంకుల్లో ఇరుక్కుపోయాయి. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాలు (ఓ.బి.సిలు), ముస్లిమ్ కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్ళి జరుగుతుంటే, వాళ్ళ తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి లక్షన్నర రూపాయల లోపు అయితే, ‘షాదీ ముబారక్’, ‘కల్యాణ లక్ష్మి’ పథకాల ద్వారా రూ. 51 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.
దళారుల ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఆన్‌లైన్‌లో చెల్లిస్తుంటుంది. సర్వసాధారణంగా సరిగ్గా పెళ్ళికి కొద్ది రోజుల ముందే లబ్ధిదారులు ఈ డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి లబ్ధిదారుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ బ్యాంకుల్లో నగదు నిల్వలే తక్కువ. ఉన్న డబ్బులు, కొత్త కరెన్సీ వచ్చినంత వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఏ.టి.ఎం.లు ఏ మాత్రం పనిచేస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో, దిగువ తరగతి వాళ్ళు తిప్పలు పడుతున్నారు.
ఖర్చు తడిసిమోపెడు!
చెక్కులు, డిజిటల్ చెల్లింపుల ద్వారా కల్యాణం కథ నడిపించవచ్చుగా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కానీ, ఇవాళ్టికీ మన దేశంలో పెళ్ళిళ్ళు అంటే, దాదాపు 70 - 75 శాతం చెల్లింపులు నగదు రూపంలోనే జరుగుతాయి. కల్యాణ మండపాల సంగతికొస్తే - నగరంలో ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటికి 14 నుంచి 30 శాతం దాకా పన్ను పడుతుంది. అందుకే, అవి నిర్ణీత రుసుములో కొంత వరకే చెక్కు రూపంలో తీసుకొని, మిగతాది నగదు రూపంలో తీసుకుంటూ వచ్చాయి. తీరా ఇప్పుడు అంతా చెక్కుగా తీసుకోవాల్సి వచ్చేసరికి, వాటికి అదనంగా పన్ను పడుతోంది.
అందుకే, అవి కొత్తగా పడుతున్న ఆ అదనపు భారం కూడా పెళ్ళివారే భరించాలంటూ, అదనపు రుసుము డిమాండ్ చేస్తున్నాయి. అసలే చేతిలో డబ్బుకు కటకటలాడుతున్న పెళ్ళింటివాళ్ళకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటి ఇబ్బందులు పడలేక... కేంద్ర సర్కారు వారి హఠాత్ నిర్ణయంతో చాలామంది తమ ఇంట్లో పెళ్ళిళ్ళను జనవరి, ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు.
ఆడంబరానికి అనుకోని బ్రేక్!
అనుకోకుండా వచ్చిన కరెన్సీ కష్టాలతో అక్కడక్కడా ఊహించని కొంత మంచి కూడా జరుగుతున్నట్లుంది. సంగీత్‌లు, రిసెప్షన్‌లు అంటూ ఇటీవల ఒకటికి మూడు రోజుల పాటు ఆడంబరంగా చేస్తున్న వేడుకల జోరుకు తాజా దెబ్బతో కొంత బ్రేక్ పడింది. వంద రకాల వెరైటీలతో తినేవాళ్ళ కన్నా వేస్టేజ్ ఎక్కువగా సాగుతున్న విందుల విషయంలో వధూవరుల కుటుంబాలు ఆగి, ఆలోచించడం మొదలుపెట్టాయి. సర్వసాధారణంగా అతి భారీ ఖర్చుతో సాగే పంజాబీ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు ఆదా బాట పట్టాయి. మధ్యతరగతి కుటుంబాలు తమ ఇంటి పెళ్ళిళ్ళను హోటళ్ళ నుంచి గురుద్వారాలకూ, మందిర్‌లకూ మార్చేస్తున్నాయి. పనిలో పనిగా, ‘షాగన్‌లు (బహుమానంగా డబ్బు ఉంచిన కవర్లు) వద్దు’ అంటూ శుభలేఖలతో పాటు చిన్న కాగితం కూడా పెట్టేస్తున్నారు. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. అలంకరణలు తగ్గిస్తున్నారు. అలా ఖర్చు దాదాపు 20 నుంచి 40 శాతం దాకా తగ్గించుకుంటున్నట్లు ఒక అంచనా.
కొత్త రకం మ్యారేజ్ ట్రెండ్స్!
మారిన పరిస్థితులకు తగ్గట్లు కొన్ని పెళ్ళిళ్ళలో పద్ధతులూ చకచకా మారుతున్నాయి. శుభలేఖల ప్రింటింగ్ ఖర్చు లేకుండా ‘ఇ-కార్డులు’గా మెయిల్, వాట్సప్ చేస్తున్నారు. ఒకవేళ శుభలేఖలు ప్రింట్ కొట్టించినా, ‘పే టి.ఎం’, ‘అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌లు’, ‘సోడెక్సో’ల ద్వారా, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా కానుకల్ని స్వీకరిస్తామంటూ శుభలేఖల్లోనే ‘గమనిక’ రాయడం లేటెస్ట్ ట్రెండ్. కొన్ని పెళ్ళి మండపాల్లో నగదు గిఫ్ట్స్ తీసుకోవడానికి స్వైప్ మిషన్లు వెలిశాయి. మండపంలో స్వైప్ మిషన్ చేత పట్టుకొని కూర్చొన్న వధూవరుల ఫోటోలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. పెళ్ళిళ్ళలో ఆన్‌లైన్‌లో కానుకలు ఇవ్వడమనే ట్రెండ్ విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి నగరాల్లో క్రమంగా ఊపందుకుంటోంది.
అయితే, ప్లాస్టిక్ మనీ, ఇ-వ్యాలెట్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాంటివి పెద్దగా అలవాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెళ్ళి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దేశంలోని బ్యాంకుల్లో దాదాపు 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ మాటకొస్తే, బ్యాంకులు దండిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో చాలామంది జనానికి కూడా ఇప్పటికీ మొబైల్ పేమెంట్స్ లాంటివీ తెలీవు. కెన్యా లాంటి దేశంలో కూడా నూటికి 53 మందికి మొబైల్ పేమెంట్స్ గురించి అవగాహన ఉంటే, మన దేశంలో నూటికి 12 మందికే దాని గురించి తెలుసు. కెన్యాలో 31 శాతం మంది ఆ రకం చెల్లింపుల విధానం పాటిస్తుంటే, మన దగ్గర కేవలం 5 శాతం మందే మొబైల్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితుల నేపథ్యం, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉన్న నగదు కొరత మూలంగా... ఇప్పుడు ‘పెళ్ళి చేసి చూడు’ అన్నది అసలు సిసలు సవాలుగా మారింది. ఇంట్లో పెళ్ళితో ఆనందం కన్నా, ఆందోళన పెరిగింది. క్యాష్ లెస్ పెళ్ళి... జోష్ లెస్ మ్యారేజ్ అయింది.
- రెంటాల జయదేవ