క్యాన్సర్లను తరిమేసే కరివేపాకు
గుడ్‌ఫుడ్
కూరలో కరివేపాకు అంటూ దాని పేరిట ఒక సామెతే వెలిసింది. కానీ కరివేపాకు అంత తీసివేయదగినది ఎంతమాత్రమూ కాదు. దానితో ఒనగూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపతో సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే...
►కరివేపాకులో క్యాన్సర్లను తరిమేసే గుణం ఉంది. కాబట్టే ఉత్తరాది వారితో పోలిస్తే... కూరలతో పాటు చాలా వంటకాల్ని తాలింపు పెట్టుకునే అలవాటు ఉన్నందున దక్షిణాది ప్రాంతాలవారికి జీర్ణసంబంధిత క్యాన్సర్ల వంటి కొన్ని రకాల విస్తృతి చాలా తక్కువ. కరివేపాకుతో ల్యూకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్లు సైతం దూరమవుతాయి. కరివేపలో క్యాన్సర్లతో పోరాడే, నివారించే గుణం అందని జపాన్‌లోని మెజియో యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ నిపుణులు ఆధారాలతో సహా నిరూపించారు.
►కరివేపలో డయాబెటిస్‌తో పోరాడే గుణం కూడా ఉంది. ఈ విషయాన్ని చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలెక్యులార్ బయాలజీ విభాగం సైతం తమ అధ్యయనాల్లో నిరూపించింది.
►మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పాళ్లను కరివేపాకు గణనీయంగా తగ్గిస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ కేరళ’లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ పరిశోధకులు తేల్చి చెప్పారు.
►కరివేపాకులో విటమిన్–ఏ పాళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మన ఆహారాల్లో కరివేప వాడేవారి చూపు చాలాకాలం పాటు బాగుంటుంది.
►కరివేప కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి, సిర్రోసిస్ బారినుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. హెపటైటిస్ వంటి సమస్యలను నుంచి కూడా రక్షిస్తుంది.
►చర్మసౌందర్యాన్ని ఇనుమడింపజేయడంలో కరివేపాకు భూమిక చాలా ఉందని తేలింది. జుట్టు బాగా పెరిగేందుకు కూడా దోహదపడుతుంది.
► ఒత్తిడిని అధిగమించడంలోనూ బాగా ఉపయోగపడుతుందని తేలింది.