
పగలు సూర్యుడు.. రాత్రి చంద్రుడు
వాళ్లు ఆడపిల్లలే కదా, చదువుకుంటే ఎంత? చదువుకోకపోతే ఎంత?’’ అనే నొసటి చిట్లింపులు, పెదవి విరుపులే తన అక్కచెల్లెళ్లను...
కూతురి కోసం
‘‘వాళ్లు ఆడపిల్లలే కదా, చదువుకుంటే ఎంత? చదువుకోకపోతే ఎంత?’’ అనే నొసటి చిట్లింపులు, పెదవి విరుపులే తన అక్కచెల్లెళ్లను ప్రాథమిక విద్యకు కూడా దూరం చేశాయి. ఎంతైనా వాడు మగపిల్లాడు, ఎట్లాగైనా బతగ్గలడు అనే పెద్దవాళ్ల మెట్టవేదాంతం అతన్ని హైస్కూల్ చదువుతో సరిపెట్టుకునేలా చేసింది. దాంతో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ, జీవితాన్ని ఎలాగో డ్రైవ్ చేస్తున్నాడు ముంబైకి చెందిన 34 ఏళ్ల గౌరవ్ మణియార్. కేవలం ఆడపిల్లలు అనే కారణంగానే తన తోబుట్టువులు చదువుకు దూరం కావడం అతన్ని కలచి వేసింది. తన ఒక్కగానొక్క కూతురును మాత్రం ఆమె మేనత్తల్లాకాకుండా బాగా చదివించాలనుకున్నాడు. అది కూడా మంచి స్కూలులో నాణ్యమైన విద్య అందించాలనుకున్నాడు.
అయితే ఒక క్యాబ్‌డ్రైవర్‌గా తనకొచ్చే అంతంతమాత్రం ఆదాయంతో కూతురును మంచి బడిలో చదివించాలంటే సాధ్యమయ్యే పని కాదు... అందుకోసం తన నిద్రను కూడా త్యాగం చేశాడు. పగలనకా, రాత్రనకా డ్యూటీలు చేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాడు. పగలు ఎల్‌ఈడీ లైట్లు అమ్మే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ, రాత్రిపూట క్యాబ్‌ను నడిపిస్తూ తన ముద్దుల కూతురు ప్రీత్‌కు కావలసినవన్నీ సమకూరుస్తూ, ఆమెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ప్రీత్ ఇంకొంచెం పెద్దయ్యాక, ఆమె కోరితే విదేశాలకైనా పంపించి చదివిస్తానంటున్నాడు.
అయితే ఒక తండ్రి, తన పిల్లలను చదివించడం కోసం కష్టపడటమనేది మామూలు విషయమే కదా అని తేలిగ్గా చప్పరించేసేవాళ్లు ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేంటంటే, ఒక సంప్రదాయ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన మణియార్, ఆడపిల్లలకు చదువులెందుకు అని, వాళ్లను బడికి పంపకుండా తమ పెద్దలు చేసిన తప్పును తిరిగి తాను చేయలేదు. పెద్దచదువులు చదివించేందుకు ఆడపిల్లలైతేనేంటి, మగపిల్లలైతే ఏంటి, అందరూ సమానమే కదా అనుకున్నాడు. తాను అనుకున్నది చిత్తశుద్ధితో చేస్తున్నాడు. మన రాజకీయనాయకులు, ప్రభుత్వాధినేతలు మణియార్‌లా ఆలోచించి ఉంటే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ఇంతకాలం పట్టి ఉండేది కాదేమో!