చిదిమి దీపం పెట్టుకోగలం చీకటి దీపాన్ని పెట్టుకోలేం!
అందమైన లోకం
వెలుగునివ్వని మనిషి కారణంగా సాటి మనిషి జీవితం చీకటిమయం అవుతుంది తప్ప ఏ దేవుడో పైనుంచి చీకటి బాణాన్ని సంధించి మానవ జీవితాన్ని దుఃఖమయం చెయ్యడు.
దీపం పక్కన దీపం... దీపం పక్కన దీపం... చూడ్డానికి ఆ వరుస ఎంతో బాగుంటుంది. దీపాలు గ్యాప్‌లు ఇస్తూ ఆరి వెలిగి, ఆరి వెలుగుతుంటే ఇంకా బాగుంటుంది. ఆ వరుసలో, ఆ గ్యాప్‌లో జీవితానికి అవసరమైన సందేశం ఏదో మనసుకు అందుతుంటుంది. సంతృప్తి ఏదో మనసు నిండా పరచుకుంటుంది. అందుకే ఒకటే దీపం ఉంటే సరిపోదు. పక్క దీపం ఉండాలి. దీపాలన్నీ అలా వెలుగుతూ ఉండిపోతే ఏం అనిపించదు. ఆరి వెలుగుతుండాలి.
చీకటి వెలుగులు అంటుంటాం కానీ, నిజానికి లోకంలో చీకటనేదే లేదు. వెలుగు మాత్రమే ఉంది. వెలుగు లేకపోవడమే చీకటి. ఇది తాత్వికులు చెప్పవలసిన మాటే అయినా, మామూలు మనుషులను కూడా అప్పుడప్పుడు అధాటున ఈ చీకటి నిర్వచనం అకస్మాత్తుగా వెలుగై కమ్ముకుంటుంది.
లోకంలోని చీకటైనా, మనసులోని చీకటైనా వెలుగు లేకపోవడం వల్ల వచ్చేదే! వెలుగునివ్వని మనిషి కారణంగా సాటి మనిషి జీవితం చీకటిమయం అవుతుంది తప్ప ఏ దేవుడో పై నుంచి చీకటి బాణాన్ని సంధించి జీవితాన్ని దుఃఖమయం చెయ్యడు. భర్త ప్రేమ లేకపోవడం భార్యకు చీకటి. తండ్రి లాలన పాలన లేకపోవడం బిడ్డలకు చీకటి. రెక్కలొచ్చిన పిల్లల ఆదరణ లేకపోవడం వృద్ధులైన తల్లిదండ్రులకు చీకటి. ఈ చీకటి ఎవరికివాళ్లు పోగొట్టుకోగలిగినది కాదు. వెలుగునిచ్చే బాధ్యత ఉన్నవాళ్లు పోగొట్టవలసినది.
సృష్టిలో వెలుగునివ్వని ప్రాణీ ఏదీ లేదు. సూర్యచంద్రులు, నక్షత్రాలకు మాత్రమే ఆ శక్తి పరిమితం కాదు. అప్పుడే పుట్టిన పసికందు సైతం కన్ను తెరిచి, వంశవృక్షం మొత్తానికీ సీరియల్ సెట్‌లా వెలుగునిస్తుంది. అదే పసికందు నవ్వి వెలుగునిస్తుంది. నడిచి వెలుగునిస్తుంది. తొలి పలుకుతో వెలుగునిస్తుంది. చదివి, వృద్ధిలోకి వచ్చి తను పుట్టిన కుటుంబానికి, తనకు ఏర్పడిన కుటుంబానికి తన రిలేషన్ ఏమిటో ఆ రిలేషన్‌తో వెలుగును ఇస్తుంది. సమాజంతో తనకెలాంటి బంధం ఏర్పడుతుందో ఆ బంధంతో సమాజానికి వెలుగును ఇస్తుంది.
సైనికుడు బోర్డర్‌లో భద్రతతో దేశానికి వెలుగును ఇస్తాడు. నాయకుడు ఒక ఆర్డర్‌లో దేశాన్ని ఉంచి ప్రజలకు వెలుగునిస్తాడు. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఆధ్మాతికవేత్తలు, వైద్య నిపుణులు, కళాకారులు.. ఇంకా.. కార్మికులు, కర్షకులు, శ్రామికులు.. పరిశోధనలతో, బోధనలతో, ప్రబోధనలతో, కళానివేదనలతో, చికిత్సలతో, కష్టఫలితంతో లోకాన్ని వెలిగిస్తూ ఉంటారు. సరే. వీళ్లంతా లోకహితులు. కాబట్టి వెలుగుల్ని పంచుతారు. మరి లోకకంటకులు? ఈ ఉగ్రవాదులు, యుద్ధవాదులు.. లోకం పుట్టినప్పటి నుంచీ వీళ్లు పంచినదీ, పంచుతున్నదీ చీకటినే కదా! కాదు. చీకటిని ఎవరూ పంచలేరు. చీకటిని ఎవరూ పరచలేరు. విస్తరించే శక్తి చీకటికి లేదు. చిదిమి దీపం పెట్టుకోగలమే కానీ, చీకటి దీపం పెట్టుకోలేం. లోక కంటకులు నడిచేదారి చీకటి దారి కావచ్చు. ఎటు తిరిగీ వాళ్లు వెలుగులోకి రావలసిందే. వేరే దారిలేదు. లోకహితులన్న వాళ్లు కూడా.. ఈ లోక కంటకులన్న వాళ్లకు వెలుగు దారి చూపించవలసిందే. తప్పుకుని వెళ్లేదారి లేదు. తప్పుకుని వెళ్లారా... వీళ్లు... ప్రేమ ఇవ్వలేని భర్తతో, లాలన పాలన చూడని తండ్రితో, వృద్ధ తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిన పిల్లలతో సమానం!
చీకటిని చూసి భయపడతాం కానీ, నిజానికి వెలుగును పంచనివాళ్లను చూసి భయపడాలి. వరుస దీపాలు, వెలిగి ఆరుతుండే దీపాలు ఇచ్చే సందేశం కూడా ఇదే. చిన్న నవ్వుతోనైనా నీ చుట్టూ ఉన్నవాళ్లను వెలిగించమనీ, నువ్వు వెలిగించని క్షణమే... నీ వాళ్లకది చీకటి క్షణమనీ!! రైటీగా ఈసారి దీపావళికి తీసుకుందాం. బరువు తగ్గి... వచ్చే దీపావళిని మరింత తేలిగ్గా, ఆహ్లాదంగా జరుపుకుందాం.
మాధవ్ శింగరాజు