
ఒక ఊరిలో ఒక దేవాలయముంది. ఆ ఊళ్లో ఒక సాధువు ఉండేవాడు. అతను రోజూ తన పొట్టకు సరిపడా భిక్షాటన చేసుకుని మిగతా సమయం అంతా దేవాలయంలో ధ్యానంతో గడుపుతూ, రాత్రి నిద్రపోవటానికి ముందు దేవుని దగ్గరకు వెళ్లి ఏడుస్తూ, ఏదో మొరపెట్టుకుంటున్నట్లుగా భగవంతుణ్ణి వేడుకునే వాడు. ఇది రోజూ గమనిస్తున్న ఆ గుడి పూజారికి ఆ సన్యాసి రోజూ దేవుని ఏమని కోరుకుంటాడో తెలుసుకోవాలనిపించింది. ఒకరోజున ఆ సాధువును సమీపించి ‘‘బాబా! మీరు గొప్ప దైవభక్తి సంపన్నులు. మీకు ‘నా’ అన్న వారు ఎవరూ లేరు. మీరు రోజూ దేవుణ్ణి ఎవరికోసం ప్రార్థిస్తారు? ఏమని ప్రార్థిస్తారు’ అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి చిరునవ్వుతో ‘‘నేను ఏమీ అడక్కుండానే ఎంతో కరుణ తో అవసరమైన దానికంటే ఎక్కువగా కురిపిస్తూ నా అవసరాలన్నీ తీర్చాడు భగవంతుడు.
ఒక్కొక్క అవసరాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా.. అందుకోసమే రోజంతా – నా అవసరం ఎలా తీర్చాడో అందుకు ఒక్కొక్క అవసరానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా – ఆయన తీర్చిన నా అన్ని అవసరాలకు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయలేక పోతానేమో అని ఆందోళనగా ఉంది’’ అని సమాధానం చెప్పాడు. పూజారి ఆశ్చర్యంతో ‘‘అయితే మీరు భగవంతుణ్ణి ఏమీ కోరరా?’’ అనడిగాడు. ‘‘భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయటానికే రోజంతా సరిపోతుందే! ఇక కోరికలు కోరే తీరికెక్కడ? అడక్కుండానే అన్ని కోర్కెలు తీరుస్తుంటే తిరిగి కోరికలు తీర్చమని కోరాలా! ఏవి తీర్చాలో ఆయనకు తెలియదా!’’ అన్నాడు. సాధువు సమాధానంతో పూజారిలో జ్ఞానం మేల్కొంది. నిజమైన పూజ అంటే ఏమిటో అర్థమైంది.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment