మనో నిగ్రహంతోనే మనశ్శాంతి | devotional information by vidhusekhara bharati swamy | Sakshi
Sakshi News home page

మనో నిగ్రహంతోనే మనశ్శాంతి

Published Sun, Apr 29 2018 12:47 AM | Last Updated on Sun, Apr 29 2018 12:47 AM

devotional information by vidhusekhara bharati swamy  - Sakshi

సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆదిశంకరుల వారు దేశం నలుమూలలా నెలకొల్పిన పీఠాలలో దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రసిద్ధమైనది. ఆ పీఠానికి 36వ అధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారి ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి. వారి విజయ యాత్రలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌ నల్లకుంటలోని శంకరమఠంలో వేంచేసి ఉన్నారు. సాక్షికి ప్రత్యేకంగా వారు అందించిన అనుగ్రహ ఉపదేశ సారాంశం ప్రశ్నోత్తరాల రూపంలో క్లుప్తంగా....

ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం... వీటిలో ప్రస్తుతకాలానికి ఏది అనుసరణీయం?
ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది. కల కంటున్నంతవరకు అది కల అని తెలియదు.

బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే.  కాబట్టి ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతానికి చేరుకోవాలి.

ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధనలలో ఏది మంచిది?
ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా, ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే. కాని, రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యం మాత్రం ఒకటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా రాదు. ఈశ్వరుడి ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువూ అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలూ అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.

హిందూ మతంలో ఇందరు దేవుళ్లు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి?
మనం వినాయక చవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని,  శివరాత్రికి శివుణ్ణి... ఇలా ఏ పర్వదినానికి  తగ్గట్టు ఆ దేవుడు లేదా దేవతా రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడని, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు.

మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే ఏం చేయాలి?
ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటినుంచి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, భారత, భాగవత కథలు చెప్పాలి. ఇలాంటి కథలవల్ల వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. బాల్యం నుంచి స్వధర్మాన్ని అలవరచాలి. మంచి సంస్కారం కలిగితే, అదే ధర్మాన్ని ఆచరింపజేస్తుంది. పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా, స్వధర్మాన్ని అలవరచాలి.  

మాధవ సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మరి మానవ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఉపకారగుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి, తాను మనిషి అనిపించుకోవడానికి కూడా యోగ్యుడు కాడు. ప్రస్తుతం లోకంలో మానవ సేవా జరుగుతోంది, మాధవ సేవా జరుగుతోంది. భగవత్ప్రీతికరమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి.

కష్టాలలో ఉన్నవాళ్లకి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్ధమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసే ఈ పని ప్రపంచం మొత్తానికి తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు.

మనిషికి ధర్మాధర్మ విచక్షణ ఎలా వస్తుంది?
ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియాలంటే బాల్యం నుంచే పెద్దలు తగిన శిక్షణ ఇవ్వాలి. ధర్మాధర్మాల గురించి తెలియజెప్పాలి. రామాయణ భారత భాగవతాదుల గురించి చెప్పాలి. రామాయణంలో ఉండే 24000 శ్లోకాలు, మహాభారతంలో ఉండే లక్షశ్లోకాలు.. అన్నీ కలిపి ఏమి చెబుతున్నాయి... రాముడిలాగా ఉండాలి.

రావణుడిలాగా ఉండకూడదు. యుధిష్ఠిరుడిలాగా ఉండాలి. దుర్యోధనుడిలాగా ఉండకూడదు అనే కదా... ఆయా కథలు వారికి తెలిస్తే, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఎలా ఉంటే మంచిదో, ఏ విధంగా ప్రవర్తించడం చెడో అనే విచక్షణ వస్తుంది.

ఆదిశంకరులవారి రచనలలో ఉత్కృష్టమైనది ఏది?
ఆయన రచనలన్నీ ఉత్కృష్టమైనవే. లోకంలో ఉండే మనుషుల అర్హతను బట్టి, వారి పరిజ్ఞానాన్ని బట్టి, ఎవరికి ఏ రచన వల్ల అధిక ప్రయోజనమో, ఆ విధమైన రచనలు చేశారు ఆది శంకరులవారు. శాస్త్రజ్ఞానం ఉండి, శాస్త్రాలలో చెప్పిన గంభీరమైన విషయాలను అర్థం చేసుకోగల  మేధాశక్తి ఉన్న వారికి బ్రహ్మసూత్ర భాష్యం, ప్రస్థానత్రయం అందించారు.

సామాన్యమైన విషయాలను అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం, మేధాశక్తి ఉన్న వారికోసం వివేక చూడామణి, శతశ్లోకి వంటి గ్రంథ రచన చేశారు. ఇక సాధారణమైన వారికోసం శ్లోకాలు, స్తోత్రాలు వంటి వాటిని అందించారు. ఈ రకంగా ఆయన రచించిన గ్రంథాలన్నీ ఉత్కృష్టమైనవే.

ఆదిశంకరుల జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి?
ఆదిశంకరులవారు సాక్షాత్తూ ఈశ్వరుని అవతారం... కాబట్టి శంకర జయంతినాడు వారిని విశేషంగా పూజించాలి. వారి అష్టోత్తర శతనామాలు చెప్పుకుని, వారి సన్నిధిలో... వారి చరిత్రను చెప్పే శంకర విజయాన్ని పారాయణ చేయాలి. వారి ఉపదేశాలను జనబాహుళ్యానికి తెలిసే విధంగా చేయాలి. మహాపురుషులందరి జయంతులు, వర్థంతుల సందర్భంలో కూడా ఇదే చేయాలి.

అశాంతి తొలగి పోవాలంటే...?
మన అశాంతికి మూల కారణం మన మనస్సే. అశాంతి తొలగి పోవాలంటే బాహ్యపదార్థాల వల్ల కాదు. మానసికంగా ఒక పదార్థం కావాలి. ఆ పదార్థమే తృప్తి. భగవంతుడు మనకు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఒక మనిషి ఇంకో మనిషిని హింసించడమో, ఇంకేదైనా తప్పు చేయడమో చేస్తున్నాడంటే మూడు కారణాలున్నాయి. అవి ఒకటి– కామం, అంటే దురాశ. రెండవది. క్రోధం. మూడవది లోభం.

ఈ మూడూ నరకానికి వెళ్లడానికి మూడు ద్వారాలు. ఒక మనిషి ఒక వస్తువు కావాలి అనుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తాడు. సన్మార్గంలో అది లభించకపోవడం వల్ల తప్పుడు మార్గాన్ని అనుసరిస్తాడు. అందులో భాగంగా ఇంకొకరితో విరోధం ఏర్పడుతుంది. అప్పుడు అశాంతి చెలరేగుతుంది. కాబట్టి ఆశ అనే గుర్రాన్ని తృప్తి అనే కళ్లెంతో అదుపు చేయాలి. నాకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడున్నాడు, ఆయనే ఆదుకుంటాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అశాంతి అనేది ఉండదు.  

వేదాలు, స్మృతులు– వీటికి తేడా ఏమిటి? వీటిలో దేనిని అనుసరించాలి?
శాస్త్రాలన్నింటికీ మూల ప్రమాణం వేదమే. వేదం స్వతః ప్రమాణం. దానికి మించింది మరొకటి లేదు. వేదాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డదే స్మృతి. ఇది స్వయంగా ఉపదేశం చేయదు. వేదంలో ఉన్నదాన్నే ఉపదేశిస్తుంది. ఏదైనా ఒక విషయంలో స్మృతి, వేదం వేర్వేరుగా చెప్పాయంటే, స్మృతిని వదిలేసి, వేదాన్నే అనుసరిస్తాం.

విగ్రహారాధన ఎందుకు?
భగవంతుడు అణువణువులోనూ ఉన్నాడు. కానీ, ఆయన్ని చూడగలిగే జ్ఞానం అందరికీ లేదు. అందుకే ఆలయాలు, ఆ ఆలయాలలో విగ్రహాలను ఏర్పాటు చేశారు పెద్దలు. ప్రహ్లాదుడు మహా భక్తుడు కాబట్టి అన్నింటిలోనూ దేవుణ్ణి చూడగలిగాడు, దేవుడి ఉనికిని ప్రశ్నించిన తండ్రికి స్తంభంలోనే దేవుణ్ణి చూపగలిగాడు. అందరికీ అది సాధ్యం కాదు కదా. అందుకోసమే విగ్రహారాధనలు నేటికీ వర్థిల్లుతున్నాయి.

అశాంతి, అరాచకాలను ఎదుర్కోవాలంటే...?
అశాంతి, అరాచకాలకు కారణం అపరాధాలు పెరిగిపోవడమే, లౌకికంగా చెప్పాంటే తగిన చట్టాలు రూపొందించి, కఠనంగా అమలు చేయాలి. అసలు అపరాధమే జరగకుండా ఉండాలంటే అహంకారాన్ని జయించాలి, కామాన్ని, క్రోధాన్ని పోగొట్టుకోవాలి, ప్రతి మనిషీ సద్గుణాలు అలవరచుకోవాలి. మనస్సును మలినం చేసే సాధనాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. వీటిని నిషేధిస్తే కానీ సగం చిక్కులు, చికాకులు తొలగవని మా అభిప్రాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement