అమ్మ అమ్మే | Devotional Stories of Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

అమ్మ అమ్మే

Published Sun, Dec 8 2019 12:22 AM | Last Updated on Sun, Dec 8 2019 12:22 AM

Devotional Stories of Chaganti Koteswara Rao - Sakshi

లోకంలో మాతృత్వమనేది సమస్త ప్రాణులలో ప్రకాశిస్తుంది. ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది. మగపిల్లి వచ్చి ఎక్కడ చెనుకుతుందోనని తన పిల్లల్ని నోట కరుచుకుని వాటికి ఏ మాత్రం అపాయం కలుగకుండా గోడల్ని కూడా ఎక్కి దూకుతూ చాలా ప్రదేశాల్ని మారుస్తూ వాటికి కాప కాస్తూ వాటిని వృద్ధిలోకి తెస్తుంది. ఎవరు నేర్పారు తల్లిపిల్లికి నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోవాలని?  ఇది మగపిల్లికి చేతకాదు. కోడిపుంజుకు పొదగడం కానీ, ఆపద సమయాల్లో తన ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లలను తన రెక్కల కింద భద్రపరచడం కానీ తెలియదు. అది కోడి పెట్టకే సాధ్యం. ఎద్దు పాలివ్వదు, దూడను పోషించదు. కానీ ఆవుకు మాత్రమే అది సాధ్యపడుతుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్లుగా... మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. ఆ మొగ్గే పువ్వయ్యేటప్పటికి అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు.

కన్యగా ఉండగా ఏమీ తెలియని ఒక ఆడపిల్ల మాతృత్వాన్ని  పొంది ‘అమ్మా‘ అని పిలిపించుకునేటప్పటికి ఆ బిడ్డని సాకడంలో అన్ని విశేషగుణాలు ఎలా వస్తాయో ఎక్కడినుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు. ఆ మాతృత్వం అనేది స్త్రీలలో లేకపోతే లోకం ఎలా నిలుస్తుంది? బాల్యంలో బిడ్డడు చేసే దోషాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీకి మంగళసూత్రం ప్రాణంతో సమానం. దాన్ని ఎవడన్నా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది. అటువంటిది స్తన్యమిచ్చి బిడ్డను పోషించే సమయంలో వాడు అమ్మపాలు తాగుతూ అమ్మమెడలోని మంగళసూత్రాన్ని చేతితో పట్టుకుని గుంజుతుంటాడు. పువ్వుల పొట్లంలోంచి తీసినట్లు వాడిచేతిని విప్పి ముద్దుపెట్టుకుని విడిచిపెట్టేస్తుంది. ఏ గుండెలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు. అరికాలు ముద్దుపెట్టుకుని క్షమించేస్తుంది మాతృత్వం సమస్త అపరాధాలను క్షమించేస్తుంది.

అందుకే శంకర భగవత్పాదులు ఈ లోకంలో దుర్మార్గుడైన కొడుకుంటాడేమో కానీ, దుర్మార్గురాలైన తల్లి ఉండదంటారు. ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. ఈ లోకంలో బిడ్డ ఆకలి తల్లి గ్రహించినట్టుగా మరెవ్వరూ గ్రహించలేరు, చివరకు తండ్రి కూడా. బిడ్డడు ఏడిచిన ఏడుపులోని ఆర్ద్రతను బట్టి వాడికి ఆకలేస్తున్నదని పసిగట్టగలుగుతుంది. బిడ్డడు ఆర్తితో పిలిచిన పిలుపు అమ్మకు మాత్రమే వినిపిస్తుంది. కంటికి కనబడే 8 భూతాలతో సహా అన్ని స్వరూపాల్లో ఆయనే ప్రకాశిస్తున్నా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన భార్య పార్వతీ దేవికిచ్చి ‘నువ్వు అన్నపూర్ణవి.. లోకాలకు అన్నం పెట్టు‘ అన్నాడు. కారణం – బిడ్డల ఆకలిని చెప్పకుండానే అమ్మ గ్రహిస్తుంది కనుక. మాతృత్వానికున్న అద్భుత లక్షణం అది. ఇది శిక్షణా కేంద్రాల ద్వారా లభించేది కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement