chaganti koteswar rao
-
బంగారం లోంచి సువాసనలు..!
కొంతమంది యోగ్యత కలిగినవారు ఉన్నత పదవులలోకి వెళ్ళిన కారణం చేత ఆ పదవి శోభిస్తుంది. వాళ్ళకీ కీర్తి వస్తుంది. పదవి, వ్యక్తి గుణాలు రెండూ సమున్నతంగా ఉంటే... బంగారానికి తావి అబ్బినట్లుంటుంది. ఎలా అంటే... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేసిన హెర్బర్ట్ హూవర్ బాగా పేదరికం అనుభవించాడు. తల్లీతండ్రీ లేరు. మేనమామ చదివిస్తున్నాడు. 18వ ఏట స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా..కళాశాల ఫీజు కట్టేంత డబ్బుసమకూరక చిక్కుల్లోపడ్డాడు. దీనినుంచి బయటపడడానికి ... స్నేహితుడితో కలిసి ఒక ఆలోచన చేసాడు. అప్పట్లో పోలండ్‌లో పియానో విద్వాంసుడిగా ఖ్యాతి వహించిన ఈగ్నాసీ యాన్ పద్రెస్కీ కచేరీ పెట్టి వచ్చిన వసూళ్ళలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఫీజుల కింద చెల్లించాలనుకున్నారు. ఆయనను సంప్రదించి రెండువేల డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు. కానీ వసూళ్లు కేవలం 1600 డాలర్లే వచ్చాయి. పైగా కచేరీ నిర్వహణ ఖర్చులు కూడా చెల్లించాలి. ఏం చేయాలో తోచక నేరుగా పద్రెస్కీనే కలిసి వచ్చిన మొత్తం డబ్బు ఆయన చేతిలో పెట్టి మిగిలిన దానికి చెక్ ఇచ్చారు... మీరు కాలేజీ ఫీజులకోసం ఇది చేస్తున్నామని ముందుగా ఎందుకు చెప్పలేదంటూ పద్రెస్కీ ఆ చెక్ చించేసి డబ్బు తిరిగి వారి చేతులో పెట్టి... మీ ఫీజు, కచేరీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలితే ఇవ్వండి, లేకపోయినా ఫరవాలేదన్నారు. పద్రెస్కీ తదనంతర కాలంలో పోలండ్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అది మొదటి ప్రపంచ యుద్ధకాలం. పోలండ్‌లో కరువు పరిస్థితి. తినడానికి కొన్ని లక్షలమందికి అన్నంలేని స్థితి. ప్రధానమంత్రిగా ఆయన అమెరికాలోఉన్న అంతర్జాతీయ ఆహార, సహాయ సంస్థకు ఒక విజ్ఞాపన పంపారు. ఆ సంస్థకు అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్. ఆ ఉత్తరాన్ని పరిశీలించి టన్నులకొద్దీ బట్టలు, ప్రతిరోజూ 2 లక్షలమందికి భోజనానికి సరిపడా సామాగ్రి పంపారు. ఈ ఉపకారానికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి పద్రెస్కీ అమెరికా వెళ్ళి హోవర్‌ను కలిసాడు. ‘‘మీరు కాదు కృతజ్ఞత లు.. నేను చెప్పాలి’’ అన్నాడు హోవర్. అదేమిటి అని పద్రెస్కీ ఆశ్చర్యపోతుండగా... గతంలో ఫీజుకట్టలేక మీ కచేరీ పెట్టి మిమ్మల్ని ఇద్దరు విద్యార్థులు కలిసారు, గుర్తుందా... అని అడిగాడు హోవర్. ఎప్పుడో జరిగిన వృత్తాంతం. అప్పటికి కొన్ని దశాబ్దాలు గడిచాయి. మీరు తీసుకోకుండా ఇచ్చిన డబ్బుతో కాలేజి ఫీజు చెల్లించి చదువు పూర్తి చేసుకోవడానికి మీరు సహకరించింది నాకే. మీరు చేసిన సాయంతోనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను... అన్నాడు. ఆ తరువాత కాలంలో...అంటే అమెరికా అధ్యక్షపదవి స్వీకరించడానికి ముందు కూడా హోవర్ పోలండ్ వెళ్లాడు. మళ్ళీ అక్కడ పేద పిల్లల స్థితిగతులను చూసి చలించిపోయి భారీ ఎత్తున సహాయం పంపే ఏర్పాట్లు చేసాడు... మంచి గుణగణాలు.. వారికే కాదు, వారి పదవులకు కూడా గౌరవం తెచ్చిపెడతాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర్ రావుకు గురజాడ పురస్కారం
-
చీమలు కూడా తిరగబడతాయి.. తస్మాత్ జాగ్రత్త
ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు. ఉంటే ? ‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!– అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి. అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి. పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది. అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి. అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి. గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి. రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్మఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ‘నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో....’’ అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు. ‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు. మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగనా... అనుకున్నాడు. మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు. తరువాత ఏమయిందో తెలిసిందే కదా... నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది. కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి. పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అమ్మ అమ్మే
లోకంలో మాతృత్వమనేది సమస్త ప్రాణులలో ప్రకాశిస్తుంది. ఒక ఆడపిల్లి పిల్లల్ని పెడుతుంది. మగపిల్లి వచ్చి ఎక్కడ చెనుకుతుందోనని తన పిల్లల్ని నోట కరుచుకుని వాటికి ఏ మాత్రం అపాయం కలుగకుండా గోడల్ని కూడా ఎక్కి దూకుతూ చాలా ప్రదేశాల్ని మారుస్తూ వాటికి కాప కాస్తూ వాటిని వృద్ధిలోకి తెస్తుంది. ఎవరు నేర్పారు తల్లిపిల్లికి నీ బిడ్డల్ని ఇలా కాపాడుకోవాలని? ఇది మగపిల్లికి చేతకాదు. కోడిపుంజుకు పొదగడం కానీ, ఆపద సమయాల్లో తన ప్రాణాలను అడ్డుపెట్టి పిల్లలను తన రెక్కల కింద భద్రపరచడం కానీ తెలియదు. అది కోడి పెట్టకే సాధ్యం. ఎద్దు పాలివ్వదు, దూడను పోషించదు. కానీ ఆవుకు మాత్రమే అది సాధ్యపడుతుంది. పాల్కురికి సోమనాథుడు చెప్పినట్లుగా... మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా విప్పి వాసన చూస్తే పసరిక వాసన వస్తుంది. ఆ మొగ్గే పువ్వయ్యేటప్పటికి అందులోంచి సువాసనలు ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలియదు. కన్యగా ఉండగా ఏమీ తెలియని ఒక ఆడపిల్ల మాతృత్వాన్ని పొంది ‘అమ్మా‘ అని పిలిపించుకునేటప్పటికి ఆ బిడ్డని సాకడంలో అన్ని విశేషగుణాలు ఎలా వస్తాయో ఎక్కడినుంచి ఆ వాత్సల్యం వస్తుందో అర్థం కాదు. ఆ మాతృత్వం అనేది స్త్రీలలో లేకపోతే లోకం ఎలా నిలుస్తుంది? బాల్యంలో బిడ్డడు చేసే దోషాలు అన్నీ ఇన్నీ కావు. స్త్రీకి మంగళసూత్రం ప్రాణంతో సమానం. దాన్ని ఎవడన్నా ముట్టుకున్నాడో చెయ్యి నరికేస్తుంది. అటువంటిది స్తన్యమిచ్చి బిడ్డను పోషించే సమయంలో వాడు అమ్మపాలు తాగుతూ అమ్మమెడలోని మంగళసూత్రాన్ని చేతితో పట్టుకుని గుంజుతుంటాడు. పువ్వుల పొట్లంలోంచి తీసినట్లు వాడిచేతిని విప్పి ముద్దుపెట్టుకుని విడిచిపెట్టేస్తుంది. ఏ గుండెలోంచి స్రవించిన పాలు తాగుతున్నాడో ఆ గుండెల్ని కాలు పెట్టి తంతాడు. అరికాలు ముద్దుపెట్టుకుని క్షమించేస్తుంది మాతృత్వం సమస్త అపరాధాలను క్షమించేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు ఈ లోకంలో దుర్మార్గుడైన కొడుకుంటాడేమో కానీ, దుర్మార్గురాలైన తల్లి ఉండదంటారు. ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే. ఈ లోకంలో బిడ్డ ఆకలి తల్లి గ్రహించినట్టుగా మరెవ్వరూ గ్రహించలేరు, చివరకు తండ్రి కూడా. బిడ్డడు ఏడిచిన ఏడుపులోని ఆర్ద్రతను బట్టి వాడికి ఆకలేస్తున్నదని పసిగట్టగలుగుతుంది. బిడ్డడు ఆర్తితో పిలిచిన పిలుపు అమ్మకు మాత్రమే వినిపిస్తుంది. కంటికి కనబడే 8 భూతాలతో సహా అన్ని స్వరూపాల్లో ఆయనే ప్రకాశిస్తున్నా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన భార్య పార్వతీ దేవికిచ్చి ‘నువ్వు అన్నపూర్ణవి.. లోకాలకు అన్నం పెట్టు‘ అన్నాడు. కారణం – బిడ్డల ఆకలిని చెప్పకుండానే అమ్మ గ్రహిస్తుంది కనుక. మాతృత్వానికున్న అద్భుత లక్షణం అది. ఇది శిక్షణా కేంద్రాల ద్వారా లభించేది కాదు. -
అమ్మ అభయం
అమ్మ పరబ్రహ్మ స్వరూపమేనని చెప్పినా, మొదటి నమస్కారం అమ్మకే చేయాలని వేదం ఎందుకు చెప్పిందో తెలుసుకుంటున్నాం. అయితే కేవలం సంతానవతి అయినంత మాత్రాన అందరి చేత పరబ్రహ్మ స్వరూపంగా ఒక స్త్రీ గుర్తింపు పొందుతుందా? శాస్త్రం అలా చెప్పలేదు. ఏ బిడ్డల్ని తల్లిగా కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మ స్వరూపిణి. ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదవక పోయినా, ఆమె తన భర్తచేత ఉన్నతిని పొందుతుంది. ఆమెకు నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. అలాగే బ్రహ్మ సృష్టిచేసేటప్పుడు తనువు, కరణం, భువనం, భోగం అని నాలుగింటిని దృష్టిలో పెట్టుకుంటాడని అనుకున్నాం కదా! ఆ క్రమంలో సృష్టికి సంబంధించి బ్రహ్మ అంశ అమ్మ ‘తనువు’(శరీరం)లో ఎలా ఉంటుందో భాగవతంలోని ‘కపిలగీత’ ఇలా అంది.... ‘‘స్త్రీ పురుషుల సంయోగ ప్రక్రియతో విడుదలైన పదార్థాలు సంయోగం చెంది, ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి, గర్భవాసం చేసినప్పుడు లోపల – రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అనే ఏడు ధాతువులు ఏర్పడాలి. దానిలో మళ్ళీ 9 రంధ్రాలు – రెండు కళ్ళు, రెండు శ్వాస రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం ఏర్పడాలి. అలాగే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకల, ధనంజయ, దేవదత్తాలనే పది వాయువులు ప్రవేశించడానికి అవకాశం కలిగి, అమ్మ కడుపు గర్భాలయమై, లోపల జీవుడు ప్రాణం పోసుకుని పుణ్య కర్మాచరణం చేయడానికి, తాను గతంలో చేసుకున్న పాపాలను అనుభవించడానికి కావలసిన శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి. ఇవన్నీ తయారయ్యే గర్భాలయం మాతృగర్భంలోనే ఉంటుంది.’’ చేసుకున్న పాపాలు పోగొట్టుకోవడానికి, అద్భుతమైన శరీరం బ్రహ్మ ఇవ్వాలనుకున్నా, తయారవ్వాల్సింది– అమ్మ కడుపులోనే. తండ్రి కర్తవ్యం బీజాన్ని నిక్షిప్తం చేయడం వరకే. శరీర నిర్మాణం జరగాల్సింది అమ్మ కడుపులోనే! ఇక రెండోది – ‘కరణం’. అంటే అంతఃకరణ చతుష్టయం– మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగూ సూక్ష్మరూపంలో ఉంటాయి. జీవుడు అమ్మ గర్భంలోకి ప్రవేశించినప్పుడు, అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైన ద్వారాలను తెరవగలిగిన స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది. ఎందుకలా అంటే... అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోనికి ప్రవేశించి ఇంద్రియాలను, పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్నీ, శక్తినీ నిక్షేపించడానికి ఆమె తాను తిన్న ఆహారంలోని శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకు పంపుతుంటుంది. దాని వల్ల కరణం.. అంతఃకరణ చతుష్టయం ఏర్పడింది. ఇక మూడోది ‘భువనం’. అంటే... బయట ఉండే సమస్త భోగోపకరణ సంఘాతం. కాస్త సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే– ఉపశాంతి పొందడానికీ, ‘హమ్మయ్య!’ అని మొట్టమొదట సేద తీరడానికీ అసలు అవకాశం ఎక్కడుంటుందో దాన్ని ‘భువనం’ అంటారు. ఈ లోకంలో జీవుడు తెలిసి కానీ, తెలీక కానీ మొదట ఉపశాంతి పొందేది అమ్మ దగ్గరే! తొమ్మిది నెలలు కటికచీకట్లో ఉంటాడు. దాన్ని ‘గర్భస్థ నరకం’ అంటారు. కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు. తిమ్మిరెక్కి పోతుంటుంది. లోపల వాత, పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నం చేసిన వాడిని పరమేశ్వరుడు ప్రసూతి వాయు రూపంలో బయటికి తోసేస్తాడు. బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. వెంటనే పూర్వజన్మ విస్మృతిని పొందుతాడు. పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞానం మరుగున పడుతుంది. ఆ చీకట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏవేవో ఆకారాలు కనబడి ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఊపిరి ఆగినంత భయానికి లోనవుతాడు.అమ్మ కడుపు దగ్గరకు జరుగుతాడు. ఆ భయానక స్థితిలో శిశువు ఉన్నప్పుడు ‘నా బిడ్డ’ అన్న భావనతో అమ్మ చేయి వేస్తుంది. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అందుకే అమ్మ – బ్రహ్మ. అమ్మ – దైవం. నిజానికి జీవుడు మొదట ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొదట పొందేది పరమ భయం. దానికి పూర్తి ఉపశాంతి అమ్మ దగ్గరే లభిస్తుంది. అందుకే అమ్మ – బ్రహ్మ. అమ్మ – దైవం. ఆమె – పరమాత్మ స్వరూపం. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు