మాడుగుల హల్వా ఘుమఘుమలు ఎల్లలు దాటాయి.నాలుగు తరతరాలు గడుస్తున్నాహల్వాకు ఆదరణ తగ్గలేదు.నేటికీ నిత్య మధురంగా ఉంటూ,అందరి నోటినీ పలకరిస్తోంది.విశాఖపట్టణం వచ్చినవారికి, మాడుగుల కూడా ఒక పర్యాటక ప్రదేశమే.సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మాడుగుల హల్వా ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్...
మాడుగుల పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది నోరూరించే హల్వా. ఈ తీయని పేరు సముద్ర తీరాలు దాటింది. విశాఖపట్టణానికి వచ్చినవారు, అక్కడి ప్రదేశాలను సందర్శించాక, నేరుగా మాడుగుల చేరుకుంటారు. నేతి వాసనతో ఘుమఘుమలాడే హల్వా రుచి చూస్తారు. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని పేరు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పురుడు పోసుకుంది ఈ హల్వా. ఇంతింతై వటుడింతౖయె నుంచి త్రివిక్రముని స్థాయికి చేరినక ఈ హల్వా దేశ సరిహద్దులు దాటింది.
హల్వా పుట్టుక
మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 130 ఏళ్ల కిందట మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో బూడిద గుమ్మడి, కొబ్బరికాయలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. కొంతకాలం తరవాత ఏదో ఒక కొత్త రకమైన స్వీట్ తయారుచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన... తియ్యని హల్వా రూపంలో ఆచరణలోకి వచ్చింది.
మాడుగుల హల్వా తయారీ విధానం
మంచి రకం గోధుమలను మూడు రోజుల పాటు నానబెట్టి, రుబ్బి, గోధుమ పాలు తీస్తారు. ఆ పాలను ఒక రోజు పులియబెట్టి ఆ తర్వాత పెద్ద పాత్రలో పోస్తారు. నెయ్యి, బెల్లం జత చేసి, మంట మీద ఉంచి, పాలు బాగా మరిగి దగ్గర పడేవరకు కలిపి దింపేస్తారు. జీడి పప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. హల్వా తయారీ వినడానికి, చూడటానికి సులువుగానే అనిపిస్తుంది కానీ, పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే.
మాడుగుల వాతావరణం, అక్కడి నీటిలో ఉండే గొప్పదనం వల్లే ఇంత రుచి వస్తుందని మాడుగుల వాస్తవ్యులు గర్వంగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హల్వాకు మాడుగుల కుటుంబం వారికి వచ్చిన రుచి రావటం లేదని అందరూ చెబుతుంటారు. వారికి మాత్రమే అంత రుచి రావడానికి వారు కొన్ని కారణాలు చెబుతారు. గోధుమలను రోటిలో రుబ్బడంలో నైపుణ్యం ప్రదర్శించడం, రుబ్బిన పాలను ఇనుప కళాయిలో వేసి, పాకం వచ్చే వరకు అదే వేడిలో మరగ పెట్టి హల్వా పాకం తయారు చేయడం మాడుగుల హల్వాకు రుచి రావడానికి కారణాలు.
హల్వాలో పెరుగుతున్న రకాలు
మొదటలో హల్వా ఒకటే రకం ఉండేది. విక్రయాలు పెరగడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి హల్వాను... ఆవు నెయ్యి బాదం పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా జీడి పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా గోధుమపాలు నెయ్యి చక్కెరలతో మూడు రకాలుగా తయారుచేస్తున్నారు.
పెరుగుతున్న షాపులు
మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. కొన్నాళ్ల తరవాత వారి హల్వా తయారీ విషయం బయటకు తెలియడంతో మరో మూడు కుటుంబాలు కూడా హల్వా తయారుచేయడం ప్రారంభించారు. రుచిలోను, క్వాలిటీలోనూ దంగేటివారి హల్వా ఎక్కడా రాజీ పడలేదు. ఎన్ని షాపులు వచ్చినా దంగేటి వారి హల్వా షాపుకే మంచి పేరు ఉంది.
రెండు వేల కుటుంబాలకు ఆధారం
మాడుగుల హల్వా వ్యాపారం కారణంగా సుమారు 2000 కుటుంబాలు సుఖవంతమైన జీవనం సాగిస్తున్నాయి. మాడుగులలో ఉన్నత చదువులు చదువుకుని ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు వారంతా తప్పనిసరిగా హల్వా తీసుకెళ్ళి అక్కడ వారికి రుచి చూపిస్తున్నారు.
నాలుగు తరాలుగా తగ్గని ఆదరణ...
దంగేటి ధర్మారావు నుండి అతని కుమారుడు కొండలరావు, మనుమడు దంగేటి మూర్తి, ముని మనముడు మెహన్ వరకూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరకులోయకు షూటింగులకు వచ్చే సినీ నటులు ఈ హల్వాను తప్పక రుచి చూస్తారు. దివంగత ముఖ్యమంత్రి వై.స్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ హల్వా రుచి చూశారు.
హల్వా ద్వారానే మాడుగుల ప్రసిద్ధి
మత్స్య వంశ రాజుల పాలనలో మాడుగుల సామ్రాజ్యం ఉండేది. వారి పరిపాలనలో మాడుగుల ప్రాంతానికి పేరుప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, హల్వా ద్వారానే మాడుగులకు దేశవిదేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. మాడుగుల నుండి వచ్చామని ఎవరితోనైనా అనగానే, ‘‘హల్వా తెచ్చారేమిటి బాబూ, అదెలా తయారువుతుంది. మళ్లీ ఎప్పుడు వస్తావు, మీరు వచ్చినపుడు హల్వా తీసుకురావడం మరవకండి’’ అని పలకరించడం పరిపాటిగా మారిపోయిందని స్థానికులు చెబుతారు.
- కరణం నారాయణరావు,
సాక్షి, మాడుగుల, విశాఖపట్నం జిల్లా
తరాలుగా ఒకటే రుచి నేటికీ కొనసాగిస్తున్నాం...
ఆవు నెయ్యి, గోధుమలు, కూలీల ధరలు పెరిగినా, లాభాలు ఆశించకుండా, ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నాం. మా ముత్తాత ధర్మారావు కనిపెట్టిన హల్వాను క్వాలిటీ తగ్గకుండా నేటి వరకు ఒకే విధంగా తయారు చేస్తున్నాం. అడ్రసు చెబితే చాలు ఎంత దూరమైన అందజేస్తున్నాం.
- దంగేటి మోహన్, మునిమనుమడు, మాడుగుల
Comments
Please login to add a commentAdd a comment