ధర్మం కాపాడుతుంది..!
ఇస్లాం వెలుగు
పూర్వం కొంతమంది మిత్రులు కలిసి ఒక దూరదేశానికి ప్రయాణం కట్టారు. అలా వెళుతూ వెళుతూ ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. అడవిగుండానే ప్రయాణం. కొంతదూరం వెళ్ళిన తరువాత వారు దారి తప్పారు. కొన్నిరోజులపాటు ప్రయాణించినా వారికి సరైన మార్గం దొరకలేదు. అడవిలో తిరిగీ తిరిగీ బాగా అలసిపొయ్యారు. వెంట తెచ్చుకున్న తినుబండారాలు కూడా నిండుకున్నాయి. ఈ క్రమంలో వారికి ఒక ఏనుగు పిల్ల కనిపించింది. వారు దాన్ని పట్టుకున్నారు. ప్రయాణ బృందానికి నాయకుడుగా ఉన్న అబ్దుల్లాహ్, ఆ పిల్ల ఏనుగును వదిలేయమన్నారు సహచరులతో.. కాని వారు, చాలారోజులనుండి సరైన ఆహారం లేక ఆకలితో చచ్చిపోతున్నాం కనుక దీన్ని కోసుకొని తిని ఆకలి తీర్చుకుందామన్నారు.
ఏనుగుమాంసాన్ని తినడం ధర్మ సమ్మతం కాదని, ఆకలితో ప్రాణం పోయే పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఆలోచించవచ్చు గాని, ఇంకా అలాంటి గడ్డుస్థితి రాలేదు కాబట్టి దైవనియమావళిని ఉల్లంఘించవద్దని వారించాడు అబ్దుల్లా. కాని సహచరులు అబ్దుల్లా మాట వినకుండా దాన్ని కోసి వండుకొని తిన్నారు. అబ్దుల్లాను కూడా తినమని బలవంతం చేశారు. కాని అతను దాన్ని ముట్టలేదు. పైగా సహచరులు చేసిన పనికి చాలా బాధపడ్డాడు. చాలారోజుల తరువాత కడుపునిండా తిన్న సహచరులు అక్కడే ఒకచోట నిద్రకు ఉపక్రమించారు. తోటివాళ్ళంతా సుష్టుగా తిని గుర్రుపెట్టి నిద్రపోతుంటే, ఆకలి బాధతో అబ్దుల్లాకు నిద్రపట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.
సరిగ్గా అర్ధరాత్రి సమయాన భూమి కదులుతున్నట్లు అనిపించసాగింది. ఆకలితో నిద్రపట్టక దొర్లుతున్న అబ్దుల్లాకు భూకంపం వస్తుందేమోనన్న అనుమానం కలిగింది. తీరా చూస్తే అది భూప్రకంపన కాదు. ఏనుగుల గుంపు... వారిని సమీపిస్తోంది. ఒక్కొక్కడి నోటిదగ్గర తొండాలతో వాసన చూస్తూ చీమల్ని నలిపినట్లు నలిపిపారేస్తున్నాయి. కొంతమంది మేల్కొని పారిపోడానికి ప్రయత్నించారు. కాని ఏనుగులు వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు..! అంతలో ఒక ఏనుగు అబ్దుల్లాను సమీపించింది. గట్టిగా కళ్ళు మూసుకొని దైవాన్ని తలచుకున్నాడు అబ్దుల్లా. కాని ఏనుగు తన తొండంతో అబ్దుల్లాను వాసన చూసి వెనక్కి వెళ్ళిపోయింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకునేంతలోనే మరో పెద్దఏనుగుతో కలిసి అతణ్ణి సమీపించింది. అది కూడా అబ్డుల్లాను వాసన చూసింది. కాని ఏమీ చేయలేదు. ఇంతలో అందరి పని పూర్తిచేసిన మిగతా ఏనుగులు కూడా అక్కడ గుమిగూడాయి. అన్నీ తమ తమ తొండాలను రాసుకొని ఏమో గుసగుసలాడాయి.
పెద్దఏనుగు తన తొండంతో అబ్దుల్లాను ప్రేమతో నిమిరి, ఎంతో అపురూపంగా తొండంతో ఎత్తి వీపుపై కూర్చోబెట్టుకుంది. మిగతా గుంపంతా జయజయ ఘీంకారం చేస్తుండగా నాయక ఏనుగు అబ్దుల్లాను తీసుకొని ఊరి పొలిమేరల వద్దకు చేర్చింది. మరొక్కసారి ఏనుగులన్నీ నిశ్శబ్దంగా తమ తొండాలను పైకెత్తి అబ్దుల్లాకు అభివాదం చేసి అడవిలో అదృశ్యమైపొయ్యాయి. కొంతదూరం నడిచి ఊళ్ళోకి చేరుకున్న అబ్దుల్లా, ధర్మాధర్మ విచక్షణను విడిచిపెట్టి, దైవ నియమావళిని ఉల్లంఘిస్తే సంభవించే దుష్పరిణామాలను ఊరివారికి సోదాహరణంగా వివరించాడు. ధర్మావలంబనలో ఉన్న మేలునూ, సాఫల్యాన్నీ విశదీకరించాడు. కనుక కట్టుబాట్లను విస్మరిస్తే... ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఇహ పర వైఫల్యాలు తప్పవని గ్రహించాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్