నాకు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ (ఐడీడీఎమ్) అని, ఇన్సులిన్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. నా అంతట నేనే ఇన్సులిన్ షాట్ (ఇంజెక్షన్) ఎలా తీసుకోవాలో చెప్పండి.
- శారద, హైదరాబాద్
డయాబెటిస్ అనేది రెండు రకాలు. ఇందులో టైప్-1 డయాబెటిస్ వచ్చినవారిలో ఇన్సులిన్ అస్సలు ఉత్పత్తి కావడం జరగదు. దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ (ఐడీడీఎమ్) అంటారు. వీళ్లు క్రమం తప్పకుండా తమ రక్తంలో చక్కెర పాళ్లు పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. అయితే ప్రతిసారీ వారు హాస్పిటల్‌కు వెళ్లడమో లేదా ఇంజెక్షన్ చేసేవారిని ఆశ్రయించడమో కష్టం కాబట్టి తమంతట తామే ఇంజెక్షన్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది చాలా సులువు కూడా. మీరు ఈ కింది ప్రక్రియలను ఒకదాని తర్వాత మరొకటి (స్టెప్ బై స్టెప్) చేయండి.
1. చేతులను సబ్బుతో చాలా శుభ్రంగా కడుక్కోవాలి.
2. ఇన్సులిన్ ఉన్న సీసాను (ఇన్సులిన్ ఇంజెక్షన్ వెయిల్‌ను) చేతుల్లోకి తీసుకొని దానిలోని మందు ఒక చివర నుంచి మరో చివరకు కదిలేలా వెయిల్‌ను కదపాలి.
3. స్టెరిలైజ్ చేసిన దూదిముద్దతోగానీ, స్పిరిట్‌లో ముంచిన దూదితోగానీ సీసా మూతను తీయాలి.
4. నీడిల్ (సూదిపై) పై ఉన్న కవర్‌ను తొలగించి దానికి సిరంజిని అమర్చి, ఆ సిరంజిలో ముందుగా గాలి పూర్తిగా నిండేలా ప్లంజర్‌ను (ఇంజెక్షన్ వెనక ఉండే వెనక్కు ముందుకు నొక్కే పరికరాన్ని) వెనక్కు లాగాలి.
5. ఇప్పుడు గాలి నిండి ఉన్న ఆ ఇంజెక్షన్ నీడిల్‌ను ఇన్సులిన్ ఉన్న సీసాలోకి గుచ్చి గాలిని ఇన్సులిన్ సీసాలో నిండేలా ప్లంజర్‌ను నొక్కాలి. ఈ సమయంలో ఇంజెక్షన్‌లోకి ఇన్సులిన్‌ను తీసుకోకూడదు.
6. ఇప్పుడు ఇన్సులిన్ ఉన్న సీసాను తలకిందులుగా పట్టుకొని, ఇంజెక్షన్ సూదిని ఇన్సులిన్ ఉన్న సీసాలోకి గుచ్చాలి. మందు ఉన్న చోట నీడిల్ ఉండేలా గుచ్చి ప్లంజర్‌ను వెనక్కులాగుతూ ఇంజెక్షన్‌లోకి మార్కర్ (సూచిక) ఉన్న చోటి వరకూ మందు ఎక్కేలా ప్లంజర్‌ను వెనక్కులాగాలి. ఈ ప్రక్రియలో గాలిబుడగలు ఇంజెక్షన్‌లోకి ఎక్కకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ ఇంజెక్షన్‌లో గాలిబుడగలు ఉన్నట్లు గమనిస్తే... అవి తొలగిపోయేలా నెమ్మదిగా ప్లంజర్‌ను నొక్కి, గాలి బుడగలేవీ లేకుండా చూసుకోవాలి.
7. మార్కర్‌కు మించి అదనంగా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌లో తీసుకుంటే, దాన్ని బయట పారేయాలి తప్ప మళ్లీ బాటిల్‌లోకి తిరిగి ఇంజెక్ట్ చేయకూడదు.
8. మీరు మీ శరీరభాగంలో ఇంజెక్షన్ షాట్ తీసుకోవాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విషయంలో తొలుత డాక్టర్‌ను సంప్రదించి ఉంచుకోండి.
9. మీరు ఇంజెక్షన్ షాట్ తీసుకోవాలనుకున్నచోట ఉన్న చర్మాన్ని స్పిరిట్ ముంచిన దూదిముద్దతో తుడవండి.
10. మీ రెండు వేళ్లతో మీరు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన చర్మాన్ని వేళ్ల మధ్యకు తీసుకోండి. ఇప్పుడు సరిగ్గా నిట్టనిలువుగా శరీరంలోకి గుచ్చుకునేలా ఇంజెక్షన్ సూదిని నెమ్మదిగా చర్మంలోకి గుచ్చుకోండి.
11. మందు మీ శరీరంలోకి వెళ్లేలా ప్లంజర్‌ను నెమ్మదిగా నొక్కి, ఇన్సులిన్ అంతా శరీరంలోకి విడుదలయ్యేలా ప్లంజర్‌ను నొక్కండి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ వేళ్ల మధ్య ఉన్న చర్మాన్ని వదిలేయండి.
డాక్టర్ కె.డి. మోదీ
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
డయాబెటిక్ కౌన్సెలింగ్
Published Mon, Jun 1 2015 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement
Advertisement