మూవ్‌ MOM మూవ్‌.. | Different Rally For Mothers Health In Hyderabad | Sakshi
Sakshi News home page

మూవ్‌ MOM మూవ్‌..

Published Fri, Jul 13 2018 9:39 AM | Last Updated on Fri, Jul 13 2018 9:39 AM

Different Rally For Mothers Health In Hyderabad - Sakshi

ఉదయం నిద్ర లేచింది మొదలు.. ఉరుకులుపరుగులు ఇంటి బాధ్యతలు.. ఉద్యోగ విధులు.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పోటీలో నగర మహిళ అలసిపోతోంది. అమ్మగా మారాక... పెరిగిన కుటుంబ నిర్వహణ కారణంగా విశ్రాంతికి దూరమవుతోంది. ఫలితంగా అమ్మ శరీరానికి వ్యాయామం దూరమై.. జీవనశైలిలో వ్యాధుల బారిపడుతున్నారు. కుటుంబ సభ్యులకు పనులు కేటాయించడంలో అమ్మకు బిడియం అడ్డుగోడగా మారుతోంది. సున్నితమై ఇలాంటి అంశాలపై మోడర్న్‌ మామ్స్‌కు అవగాహన కల్పించేందుకు ‘మిలీనియం మామ్స్‌’ పేరిట ఈ నెల 15న ఉదయం 8:30 గంటలకు శంషాబాద్‌ నోవొటెల్‌ వద్ద మూవ్‌ మామ్‌ మూవ్‌ పేరిట కార్ల ర్యాలీనిర్వహించనున్నారు.

సాక్షి, సిటీబ్యూరో:  వాహనాలు నడపడంలో టైమ్, డిస్టెన్స్, స్పీడ్‌ విషయాల్లో ఆధునిక ‘మామ్స్‌’ ఎంత ఫిట్‌గా ఉన్నారో తెలియజెప్పడమే దీని ముఖ్య ఉద్ధేశ్యం. ఈ మధ్య నెక్లెస్‌రోడ్డులో వయోధిక వృద్ధులు వారి ఆరోగ్యంపై, సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అది మరువక ముందే ఇప్పుడు తల్లుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారు వాహనాలు నడపటంలో ఎంత ఫిట్‌నెస్‌ కలిగి ఉన్నారనే విషయం గమనించి, ఆధునిక తల్లులకు శారీరక వ్యాయామంపై అవగాహన కల్పించనున్నారు.  

వెల్ఫేర్‌ ఆఫ్‌ మదర్‌...
సహజంగా మహిళలకు బిడియం ఎక్కువ. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులను సాయం అడిగే సాహసం కూడా చాలా మంది చేయరు. ఆమెలో కాస్తయినా మార్పు తీసుకువచ్చి ఆరోగ్య స్పృహ కలిగించాలన్నాదే తమ లక్ష్యం. మధుమేహం, ఊబకాయం వంటివి జీవనశైలి మార్పుల కారణంగా పెరుగుతాయి. మహిళల్లో కూడా ఈ రుగ్మతలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. బాధ్యతల్లో తలమునకలైన ఆమెకు రోజు వ్యాయామం చేయాలనే ఆలోచన రెకెత్తించటమే దీని ఉద్ధేశ్యం. మిలీనియం మామ్స్‌ పేరిట నిర్వహించే కార్యక్రమంలో నగరంలో ఆసక్తిగల మహిళలను జట్టుగా తయారు చేస్తాం. వీరికి 21 రోజుల పాటు మామ్స్‌ ఛాలెంజ్‌ పేరిట పోటీ నిర్వహిస్తాం. జట్టులో ఉన్న అమ్మలకు శారీరక వ్యాయామాలను వివరిస్తాం. ప్రతిరోజు మహిళలు తాము మార్చుకున్న జీవనశైలి మార్పులను వివరిస్తూ గ్రూపులో పోస్టులు చేయాల్సి ఉంటుంది. శాస్త్రీయంగా కూడా 21 రోజులు వ్యాయామం అలవాటయితే క్రమంగా వారి జీవితంలో భాగమవుతుందనే ఆలోచనతో పోటీ నిర్వహిస్తున్నాం.    – డాక్టర్‌ మణి పవిత్ర, నిర్వాహకులు   

అవగాహన ఇలా...
శారీరక శ్రమ దూరం కావడం వల్ల తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం వ్యాయామం మాత్రమే.. మిలీనియం మామ్స్‌ పేరిట ఈ నెల 15న ఉదయం 8.30 గంటలకు శంషాబాద్‌లోని నోవెటల్‌ వద్ద  మూవ్‌ మామ్‌ మూవ్‌ పేరిట కార్ల ర్యాలీ ప్రారంభమై.. షాదాన్‌ మెడికల్‌ కాలేజీ ప్రాంగణం వరకు సాగుతుంది. అక్కడ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మదర్‌ డ్రైవర్‌ గానీ, న్యావిగేషన్‌ వచ్చి ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పుడు తల్లులు చేస్తే దాన్నే పిల్లలు అనుకరిస్తారు. అంటే రెండు తరాలు బాగుపడ్డట్లు అవుతుందనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు డాక్టర్‌ మణి పవిత్ర అన్నారు. ఇప్పటికి 200 మంది పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారని, ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు ఫోన్‌: 92465 55712 నంబర్‌లో సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement