షర్ట్ వేస్కో నెట్ చూస్కో...
ఇంటర్నెట్‌తో కనెక్ట్ కావాలంటే ఏముండాలి? డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్ కంప్యూటర్ ఉండాలి. తేలికగా ఉండాలంటే, కనీసం టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ఇకపై ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఇవేవీ అవసరం లేదు. చూడముచ్చటగా అదిరేటి డ్రెస్సు వేసుకుంటే చాలు... మీరు ఎక్కడ ఉన్నా, ‘నెట్’కొచ్చేయవచ్చు. షర్ట్ కాలర్‌ని తట్టడం ద్వారా మిత్రులకు సందేశాలు పంపుకోవచ్చు. కోటు బొత్తాన్ని ఒత్తడం ద్వారా మోగుతున్న ఫోను నోరుమూయించవచ్చు.
షర్ట్ చేతులను మడతేయడం ద్వారా రికార్డయిన సంభాషణను మీకు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసుకోవచ్చు. డిజిటల్లీ కనెక్టెడ్ డ్రెస్‌తో ఇలాంటివే చాలా పనులు సునాయాసంగా చేయవచ్చు. డెనిమ్ దుస్తుల సంస్థ ‘లీవైజ్’ సాయంతో సెర్చింజన్ దిగ్గజం ‘గూగుల్’ ఇలాంటి డిజిటల్లీ కనెక్టెడ్ దుస్తులకు రూపకల్పన చేస్తోంది. విద్యుత్ వాహక శక్తిగల కొత్తరకం నూలు, మల్టీటచ్ ప్యానెల్స్, సెన్సర్లతో రూపొందిస్తున్న ఈ దుస్తులు ఫ్యాషన్ రంగంలో సంచలనం కాగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.