ఉ'త్తరం' మారాలి | Discrimination against womans | Sakshi
Sakshi News home page

ఉ'త్తరం' మారాలి

Published Wed, Feb 14 2018 1:29 AM | Last Updated on Wed, Feb 14 2018 4:29 AM

Discrimination against womans - Sakshi

తరం మారి తరం వచ్చింది. తరం మారి తరం వస్తుంది కూడా. అప్పుడు కూడా.. ఇలాంటి ఉత్తరమే వస్తుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి కటాక్షించిన ఒక అమ్మాయికి కల్యాణమే బలిదేవత కాబోయింది!ఏ మారుమూల గ్రామంలోనో కాదు.. వైజాగ్‌లో. ఎంత చదువుకున్నా ఏం లాభం? ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నా ఏం లాభం? ఇష్టం లేని పెళ్లిచూపులు.. కెరటాల్లా వచ్చి తాకుతుంటే!!


డియర్‌ ఫ్రెండ్‌!
ఒక అత్యవసర సందర్భంలో నీకీ లేఖ రాయాల్సి వస్తోంది. నన్నీ అంధకారంలోంచి బయటపడేసేది నీవు చేయబోయే ఈ చిన్ని సాయమే. లేదంటే నా కథకీ ఉత్తరమే ముగింపు కావొచ్చు. ఎందుకో చెపుతాను! చిన్నప్పటినుంచి అంతా నా ప్రతిభకు అచ్చెరువొందుతోంటే చాలా ఆనందించేదాన్ని. క్లాసులో ఫస్టొచ్చిన ప్రతిసారీ బళ్లో నాకొచ్చిన ప్రశంసల జల్లులని మదిలో ఒంపుకుని అంతులేని ఆనందాలను మూటకట్టుకొని ఇంటికి మోసుకొచ్చేదాన్ని. కానీ ఇంటి గడపకివతలే ఆ ఆనందాన్ని విడిచిపెట్టాలి. లేదంటే ఆ రోజుకిక అమ్మకీ నాకూ ప్రశాంతంగా రాత్రి గడవదు. 

ఇరుగు పొరుగుకి తెలియకుండా గుంభనంగా గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులింకా నా జ్ఞాపకాల కంటిపాపల్లోనే దాగున్నాయి. నా ఆకాంక్షలనీ, నేనధిరోహించాలనుకున్న ఎన్నెన్నో విజయపుటాశయాల ఆశలకెరటాలనూ మూతలు పడని ఆ కళ్లే మోస్తున్నాయింకా. నిజానికి టెన్త్‌తోనే నా చదువు ఆపేయాలన్న నాన్న ఆదేశాన్ని అమ్మ ధిక్కరించలేకపోయినా, ‘‘కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అన్న మాటలకు లొంగి నాన్న నన్ను కనాకష్టంగా ఇంజనీరింగ్‌లో జాయిన్‌ చేశారు. నా ఫ్రెండ్స్‌ ఎందరికో బ్యాక్‌లాగ్స్‌ ఉండిపోతే, నేను మాత్రం థర్డ్‌ ఇయర్‌లో 86 పర్సంట్‌తో క్లాస్‌లో ఫస్ట్‌ ఉన్నాను.

ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ కాకుండానే హైదరాబాద్‌లో క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించినా నాన్న ఒప్పుకోరేమోనన్న దిగులు.. నన్ను చాలా రోజులు అమ్మతో కూడా ఈ సంతోషాన్ని పంచుకోకుండా నివారించింది. చివరకు చాలా పెద్ద రాద్ధాంతం తరువాత నేను ఈ ఉద్యోగంలో చేరాను. ఆరు నెలలు కూడా కాలేదు నేనీ ఉద్యోగంలో చేరి. చేరినప్పటినుంచి నాన్న పెళ్లి చూపులకోసం పదే పదే వైజాగ్‌ రప్పిస్తున్నారు. ఆయన చెప్పిన అన్నింటికీ తలొగ్గి పెళ్లి చూపులకు ఒప్పుకున్నా, వృత్తిని కొనసాగిస్తూ, అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న నా ఆకాంక్షను ప్రతి పెళ్లికొడుక్కీ చెప్పుకుంటూ వస్తున్నాను.

కానీ ఏ పెళ్లికొడుక్కీ అతనికన్నా ఎక్కువ స్థాయిలో ఉండడం ఇష్టం ఉంటేనా? అందుకే ఇప్పటికి నలుగురైదుగురు పెళ్లికొడుకులు నా అందాన్ని సైతం కాదనుకుని వెనక్కెళ్లిపోయారు. చివరకు లక్షల కట్నం మానాన్న ఆశపెట్టినా నా ఉద్యోగం వాళ్లకు అడ్డంకిగా మారింది. ‘‘ఆడపిల్లలకు పెళ్లయ్యాక ఉద్యోగం ఎందుకన్నారొకరు. మీ నాన్న ప్రభుత్వోద్యోగిగా బాగానే సంపాదించారు. నీకెందుకీ శ్రమ అన్నారింకొందరు. అసలు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు, మా అబ్బాయే అమెరికాలో లక్షలు సంపాదిస్తోంటే , ఏదో అందమైన అమ్మాయివనీ, మంచి ఇంగ్లీషు మాట్లాడతావనీ మా చుట్టాలు చెపితే నిన్ను చూశాం కానీ ఇలా ఏదో ఎదిగిపోవాలని ఉద్యోగాలు చేసే ఆలో^è న ఉన్నట్టు మాకు తెలియదు’’ అన్నారింకొకరు.

అప్పుడు నా ఉద్యోగం మాన్పించాలన్న మానాన్న పోరు పరాకాష్టకి చేరింది. అయినా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇప్పుడిప్పుడే నా డిపార్ట్‌మెంట్‌లో నాకు కొత్త బాధ్యతలప్పగించారు కదా? యిప్పుడప్పుడే ఊరికి రావడం కుదరదని నాన్నకి ఫోన్‌లో చెప్పాను. అంతే! నిన్న నాన్నే స్వయంగా దిగిపోయారు హైదరాబాద్‌లో. ఇప్పుడు నన్ను వెంటబెట్టుకెళుతున్నారు. అక్కడేం జరుగుతుందో తెలియదు. శని ఆదివారాలు కలుపుకుని మొత్తం నాలుగు రోజులు సెలవు పెట్టాను. మా బాస్‌కి సూచనప్రాయంగా చెప్పాను. ఏదో పెళ్లి గోలని. ఆయనప్పుడే అన్నారు. అందుకే పెళ్లిళ్లు కాని అమ్మాయిలకు ఉద్యోగాలివ్వడం చాలా పెద్ద తప్పని.

లీవ్‌ లెటర్‌ ఇవ్వడానికెళితే హెచ్‌ఆర్‌లో ప్రవీణ్‌ కూడా అననే అన్నాడు ఎందుకు మేడం మీరు హాయిగా పెళ్లి చేసుకుంటే మీ స్థానంలో ఎవరైనా మగాళ్లకి అవకాశమిచ్చినట్టుంటుంది కదాని! అసలు అందరికీ నా ఉద్యోగంపైనే ఎందుకీ ఆక్షేపణ! బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. నేనీ మాటలు మానాన్న ముందు అంటే నిజంగానే మా నాన్న ఆ పని చేసేస్తారు కూడా. నన్నింటికి తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. పెళ్లికయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆ తరువాతేం జరుగుతుందో చూద్దాం. నాకు మీరు చేయాల్సిన సాయం ఒక్కటే.. నా నాలుగు రోజుల లీవ్‌ అయిపోయినా నేను రాకపోతే పోలీసులకు కానీ, మీడియాకి కానీ నా నంబర్, అడ్రస్‌ ఇవ్వండి.  - ఇట్లు మీ స్నేహితురాలు

ఐదు రోజులు ఎదురుచూసి, ఆరవ రోజు మీడియాకిద్దామనుకున్న లేఖని రెండోసారి చదివాడు వాసు. ఆ అమ్మాయి వాళ్లింట్లో జరగబోయే విపత్తుని ముందుగానే ఊహించి రాసిన ఉత్తరం నేరుగా ‘చేతన’ మహిళా సంఘం నాయకురాలు పద్మ చేతిలో పడింది. అంతే! మరో గంటలో మీడియాతో సహా పద్మ, మరికొందరు మహిళా సంఘాల వాళ్లు ఆ అమ్మాయి యింటికెళ్లి చూసి అక్కడ జరుగుతున్న దారుణానికి అవాక్కయ్యారు.

ఓ జంతువుని కట్టేసినట్టు గొలుసులతో చేతులను కట్టేసి, ఇంటి వెనుకనున్న స్టోర్‌ రూంలో దాచేసిన ఆ అమ్మాయిని విడిపించిన ఘటన వైజాగ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా బతుకుతోంది. అమ్మాయిలకు అంతిమ లక్ష్యం పెళ్లి కాదని నిరూపిస్తూ, పెళ్లి చేసుకోకుండా స్వతంత్రంగా జీవిస్తోంది. స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడి నలుగురికీ ఆదర్శంగా ఉండాలన్నదే నా లక్ష్యం. పెళ్లి, పిల్లలూ.. ఇవన్నీ నాకిప్పుడు సెకండరీ అంటోందా అమ్మాయి.
– అత్తలూరి అరుణ

చదువు, ఉద్యోగం, వివాహం.. అన్నింటా వివక్షే
అవును. లేఖలో ఆమె ఊహించిందే జరిగింది. ఆడపిల్లలకు అంతిమ లక్ష్యం పెళ్లి అన్నది ఈ సమాజం భావన. ఉద్యోగం కూడా రాబోయే వాడి కోసమే తప్ప తనకోసం కాదు. చదువుకుంటే ఒక సమస్య. చదువు లేకపోతే మరో సమస్య. ఒకరికి చదువుకున్న అమ్మాయి కావాలి. ఒకరికి పెద్దగా చదువుకోని అమ్మాయే కావాలి. ఇలా ఏదీ ఆ అమ్మాయికోసం కాదు. అన్నీ తన జీవితాన్ని శాసించే ఓ పురుషుడి కోసం. అతడి కోసం ఆమెను పోతపోసిన బొమ్మలా తయారు చేస్తారు. ఇది దుర్మార్గం. దీన్ని ప్రతిఘటించే చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తోంది. ఈ కేసే అందుకు ఉదాహరణ.

ఆ లేఖ రాసిన అమ్మాయి యిప్పుడు స్వతంత్రంగా బతుకుతోంది. తనకు నచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆడపిల్లల పుట్టుకను, చదువును, ఉద్యోగాన్నీ.. అన్నింటినీ ఆమె నుంచి దూరం చేయాలనే ఆలోచన. ఆస్తి కూడా ఆడపిల్లల పేరున ఉండకూడదనే ఎన్నో కేసులు నేను చూశాను. స్త్రీల పట్ల ఈ భావజాలం ఇప్పటిది కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తోన్న మనువాద పురుషాధిపత్య భావజాలం. ఎన్నో అననుకూల పరిస్థితుల నుంచి ఆమె ఎదిగివచ్చినా చివరకు పెళ్లి అనే ఒక పరిధిలో కుదించేస్తారు. అక్కడితో ఆమె ఆలోచనలూ, ఆకాంక్షలూ చెరిగిపోతాయి.

ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఎక్కడెక్కడైతే ఆమె ఎదుగుదలను నియంత్రించే పరిస్థితులున్నాయో అక్కడే ఆమె స్థిరంగా నిలబడే పరిస్థితి రావాలి. సమాజం నుంచి ఎదురౌతోన్న వివక్షనీ, అణచివేతనీ ఇక సహించబోమంటోంది నేటితరం స్త్రీ. అన్ని అవరోధాలను, అడ్డంకులను దాటుకొని తమకు తాముగా ఎదిగివస్తోన్న యువతులే ఈ అసమానతలను ఛేదించగలరు.
– కత్తి పద్మ, ప్రధాన కార్యదర్శి, ‘చేతన’ మహిళా సంఘం, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement