
చిటికెడు ఊదీలో సముద్రమంత బోధన
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అలా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును (కట్టెలను) కొనేవారు.
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అలా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును (కట్టెలను) కొనేవారు. ఈ కట్టెలను బాబానే స్వయంగా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉండేవారు. అది ఇప్పటికీ అలా మండుతూనే ఉంది. అందులో నుంచి ఉద్భవించే బూడిదనే ఊదీ అంటారు. బాబా ఆ ఊదీనే తీసి భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లేముందు ఆశీర్వదించి వారికి అందించేవారు. ఒక్కోసారి దానితోనే వైద్యం చేసేవారు. చిటికెడు ఊదీని బాబా తన భక్తుల నుదుటిపై పెట్టారంటే వారికి సర్వ రోగాలూ నయమయేవి.
ఊదీ ద్వారా భక్తులకు బాబా ఏం బోధించారంటే... ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు. పంచభూతాలచే రూపొందిన మన శరీరాలన్నీ సౌఖ్యాలు అనుభవించిన తరువాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్నే నిరంతరం గుర్తు చేసేందుకే బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని అందించేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల మన బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించారు. మనం ఎందరితో ఎన్ని రకాలుగా ఎంతగా ఎన్ని బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నా, అవేవీ శాశ్వతం కావని, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్తామన్న సత్యాన్ని బోధించేవారు. ఊదీకి ఆధ్యాత్మిక విశేషమే కాదు, భౌతిక ప్రాముఖ్యం కూడా ఉంది.
ఊదీ అనేక విధాలుగా శారీరక మానసిక రోగాలకు ఔషధంగా పనిచేసేది. రోగులకు, బాధార్తులకు స్వస్థత కలిగించేది. తాము ధరించిన ఊదీ ద్వారా భక్తుల చెవిలో నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యం గంట మోతవలె వినిపించి, చెడుపనులు, చెడు తలంపుల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఊదీ ధరించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాబా భక్తులు తప్పనిసరిగా నుదుట విభూది ధరిస్తారు.
సాయిబాబా తన భక్తులనుంచి శ్రద్ధను, భక్తి విశ్వాసాలను దక్షిణగా కోరారు. ఎందుకంటే శ్రద్ధ, భక్తి విశ్వాసాలే ఏ పనిని చేయడానికైనా ప్రధానావశ్యకాలు. అందుకే ఆయన భక్తులనుంచి శ్రద్ధ, సబూరి రూపంలో దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు. వాటిని తనకిస్తే వారి జీవితాలను తీయబరుస్తానని తన భక్తులకు అభయమిచ్చారు. ‘శ్రద్ధ, సబూరి అనే రెండు కాసులను ఎవరు దక్షిణగా సమర్పిస్తారో వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను. భక్తులలోని ఉన్నతమైన శ్రద్ధాభక్తులే వారిని ఆధ్యాత్మికంగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. నా పలుకులను విశ్వసించే వారు ధన్యులు’’ అని ఆయన పదే పదే బోధించేవారు. ఆయన బోధలను ఆచరించిన వారికి ఆయన అనుగ్రహంతో సకలైశ్వర్యాలు చేకూరతాయన టంలో సందేహం లేదు.
- డాక్టర్ కుమార్ అన్నవరపు
సుభాషితం
ప్రజలందరూ ఇష్టపడే చక్కని శీలం కలవారికి నిప్పు నీరులాగా, సముద్రం పిల్లకాలువలాగా, మేరు పర్వతం చిన్న గులకరాయిలాగా, సింహం జింకపిల్లలాగా, విషసర్పం పూలమాల మాదిరిగా, విషం అమృతం లాగా అవుతాయి.
ఐశ్వర్యానికి సౌజన్యమే అలంకారం. శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి పాత్రదానమూ, తపస్సుకు శాంతం, ప్రభువుకు సహనం, ధర్మానికి అపకీర్తి, ఆశ్రీత పక్షపాతం లేకుండటం అలంకారాలు.
మీకు తెలుసా?
పరుగెత్తే వారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి, భగవంతుని సన్నిధిలో ఉన్నవారికి నమస్కరించకూడదు.
ఉదయించే, అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు.