కొందరు తమకు తరచూ తల తిరుగుతోందనీ, పడిపోతున్న ఫీలింగ్ ఉందని అంటుంటారు. ఇంగ్లిష్‌లో గిడ్డీనెస్, డిజ్జీనెస్‌గా మనం చెప్పుకునే లక్షణాలను కలిగించే ఆ వ్యాధినే వైద్యపరిభాషలో ‘వర్టిగో’ అంటారు. మనందరి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా అనుభవించే ఈ కండిషన్‌పై అవగాహన కోసమే ఈ కథనం.
కళ్లు తిరగడం / తల తిరగడం రూపంలో కనిపించే వర్టిగో పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ.
వర్టిగో అనుభవాలు చిత్రవిచిత్రాలు...
తల/కళ్లు తిరగడం (వర్టిగో) సమయంలో కలిగే అనుభూతులు వేర్వేరు రోగుల్లో వేర్వేరుగానూ, చిత్రవిచిత్రంగా ఉంటాయి.ఉదాహణకు...
►కొందరిలో గాల్లో అలా కొట్టుకుపోతున్నట్లుగా ఫీలవుతారు
►కొందరు తలకిందులుగా లోయలో/బావిలో పడిపోతున్నట్లుగా ఫీలవుతారు
►కొందరు భవనం పైనుంచి కిందికి పడిపోతున్నట్లు అనుభూతి చెందుతారు
►మంచంపై పడుకుని ఉంటే... కొందరిలో కాళ్లు ఉన్న భాగం పైకి లేచిపోతున్నట్లు ఫీలవుతారు
►కొందరు నిటారుగానే ఉన్నా... తాము ఒక కోణంలో ఒంగుతున్నట్లు భ్రమిస్తూ... చక్కగా/నిటారుగా అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు
►తమ చుట్టూ ఉన్న ఫొటోలూ, ఫ్యాన్లు, టీవీ, టేబుల్ వంటి వస్తువులు తమ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది
►కొందరు రంగులరాట్నంలో తిరుగుతున్న అనుభూతి పొందుతారు.
వర్టిగో ప్రధానంగా రెండు విధాలు...
1. పెరిఫెరల్ వర్టిగో 2. సెంట్రల్ వర్టిగో
పెరిఫెరల్ వర్టిగో
ఇది అంత ప్రమాదకరం కాదు. అయితే... దీన్లో కళ్లు తిరగడం తాలూకు తీవ్రత చాలా ఎక్కువ. ఒక్కోసారి దీనివల్ల తన ప్రాణం పోతుందేమో అన్నంతగా రోగి భయపడతాడు. చెవి లోపలి భాగం (ఇన్నర్ ఇయర్) నుంచి మెదడుకు సంకేతాలు చేరవేసే నరానికి దెబ్బ తగిలినా, దానికి ఇన్ఫెక్షన్ కలిగినా ఈ పెరిఫరల్ వర్టిగో కనిపించే అవకాశం ఉంది. లోపలి చెవిలో ఉండే భాగాన్ని ల్యాబిరింథ్ అంటారు. దీనికి ఏమాత్రం దెబ్బతగిలినా ఇలాంటి సమస్యే వస్తుంది. దాన్ని ‘ల్యాబిరింథైటిస్’ అంటారు. ఇక లోపలి చెవి నుంచి మెదడును కనెక్ట్ చేసే నరాన్ని వెస్టిబ్యులార్ నర్వ్ అంటారు. ఒకవేళ నరానికి ఏదైనా దెబ్బతగిలి ఇలాంటి అనుభూతి కలిగితే దాన్ని ‘న్యూరోనైటిస్’ అంటారు. లోపలి చెవిలో ఒకరకమైన ద్రవపదార్థం ఉంటుంది. ఒక్కోసారి ఆ ద్రవంలో ఏవైనా పార్టికల్స్ వచ్చినా పెరిఫెరల్ వర్టిగో కనిపిస్తుంది. దీన్నే ‘బినైన్ పొజీషనల్ వర్టిగో’ అని అంటారు.
టినిటస్: కొందరిలో కళ్లు తిరిగే లక్షణంతో పాటు చెవిలో గుయ్... మనే శబ్దం వినిపిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో చికిత్సనే ఈ సమస్యలోనూ తీసుకుంటే తగ్గిపోతుంది.
సెంట్రల్ వర్టిగో...
పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే ఈ సెంట్రల్ వర్టిగో ఒకింత ప్రమాదకరం. అయితే సెంట్రల్ వర్టిగోలో కళ్లు తిరిగే తీవ్రత మాత్రం పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే కాస్తంత తక్కువ. మెదడు లోపలి భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్‌కు రక్తప్రసరణ తగ్గినందువల్ల ‘సెంట్రల్ వర్టిగో’ వస్తుంది. సాధారణ ప్రజలకు ఏది పెరిఫెరల్ వర్టిగో, ఏది సెంట్రల్ వర్టిగో అని గుర్తుపట్టడం కష్టమే. అయినా కొన్ని లక్షణాలతో గుర్తుపట్టేందుకు అవకాశం ఉంది.
చికిత్స: సమయానికి చికిత్స తీసుకుంటే వర్టిగో పూర్తిగా తగ్గుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినప్పుడు అవి తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. రోగికి కనిపించే వర్టిగోను డాక్టర్లు ‘సెంట్రల్ వర్టిగో’ అని భావిస్తే వెంటనే సీటీస్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మార్ యాంజియో బ్రెయిన్ అనే పరీక్షలు చేసి బ్రెయిన్ స్టెమ్‌లో ఎక్కడ డ్యామేజీ ఉందో తెలుసుకుని వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి.
►బ్యాలెన్స్‌ను మెరుగుపరిచే వ్యాయామాలు
►మాన్యువర్స్
►ట్యూమర్స్ వంటివి ఉన్నప్పుడు శస్త్రచికిత్స
►మెడికల్ మేనేజ్‌మెంట్
►కొన్ని సందర్భాల్లో మందులు వాడితే తగ్గిపోతుంది.
వర్టిగోను నివారించుకోండిలా...
►సాధారణంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్లలో సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. బీపీని క్రమం తప్పకుండా చెక్ చేయించుకొని, అదుపులో పెట్టుకోవాలి. శరీరంలో చక్కెర మోతాదులను క్రమం తప్పకుండా చెక్ చేయించుకుని పరగడుపు 100– భోజనం తర్వాత 160 కంటే ఎక్కువ ఉంటే తక్షణం డాక్టర్‌ను కలిసి దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు తీసుకోవాలి.
►పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే ఆ అలవాట్లుంటే వాటిని తక్షణం మానేయాలి.
►జీవన విధానాల్లో మార్పులు (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్) చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయాలి.
►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు పాలు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్ వంటి చాలా పరిమితంగా తీసుకోవాలి.
►ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తాజా పళ్లు తినాలి.
కారణాలు
►బినైన్ పొజిషనల్ ప్రాక్సిమల్ వర్టిగో. మీనియర్స్ డిసీజ్, మైగ్రేన్ వర్టిగో, తలకు గాయం కావడం కొన్ని మందులు వాడటం (ఓటో టాక్సిసిటీ)వల్ల, వెస్టిబ్యులార్ నరంలో ట్యూమర్లు, పక్షవాతం
సెంట్రల్ వర్టిగోను ఇలా గుర్తుపట్టవచ్చు...
►కళ్లు తిరగడంతోపాటు మాట తడబడటం
►మింగడం కష్టం కావడం ఒకే వస్తువు రెండుగా కనిపించడం
►చూపు మసకబారడం
►మూతి వంకరపోవడం
►కాళ్లూ, చేతులు చచ్చుపడినట్లు అనిపించడం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సెంట్రల్ వర్టిగోగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
డాక్టర్ ఇ.సి. వినయ కుమార్
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment